breaking news
in nallajarla
-
నేడు సీఎం చంద్రబాబు పోతవరం రాక
నల్లజర్ల : స్మార్ట్ విలేజ్‌గా ఎంపికై అభివృద్ధి పనులు పూర్తి చేసిన పోతవరం గ్రామాన్ని సీఎం చంద్రబాబు శుక్రవారం సందర్శించనున్నారు. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైనట్టు కలెక్టర్ భాస్కర్ గురువారం నల్లజర్లలో వెల్లడించారు. జిల్లా అధికారులు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు తదితర ప్రజాప్రతినిధులతో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సీఎం హెలికాఫ్టర్‌లో పోతవరం చేరుకుంటారు. హెలీప్యాడ్ పక్కనే బలహీనవర్గాల కోసం 6 ఎకరాల భూమిలో జీప్లస్ త్రీ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మహిళా సమాఖ్య, యువజన సమాఖ్య నూతన భవనాలు ప్రారంభిస్తారు. అనంతరం పాత్రుని చెరువు అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడే పీహెచ్సీ, నీరు-చెట్టు పైలాన్లను ఆవిష్కరిస్తారు. అనంతరం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. తదుపరి హైస్కూల్ అదనపు తరగతి గదులు, కాంపౌండ్ వాల్ ప్రారంభించి అక్కడే గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా కవులూరు, చీపురుగూడెం, తిమ్మన్నపాలెంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. నల్లజర్ల హైస్కూల్లో 15 వేల మందితో నీరు-చెట్టు జలసంరక్షణపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నల్లజర్లలో నల్ల-ఎర్ర చెరువు వద్ద పార్క్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఏకేఆర్జీ కళాశాల పక్కన ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి రాజధానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఎంపీపీ జమ్ముల సతీష్, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, పోతవరం, నల్లజర్ల సర్పంచ్‌లు పసుమర్తి రతీష్, యలమాటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వాగత సన్నాహాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జిల్లాలో 24 కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు
నల్లజర్ల : యాంత్రీకరణపై రైతుకు పెట్టుబడి భారం తగ్గించే విధంగా యంత్ర పరికరాలు అద్దెకు (కస్టమ్ హైరింగ్ సెంటర్) ఇచ్చే కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. జిల్లాలో ఒక్కోటీ రూ. కోటి వ్యయంతో 24 కష్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నల్లజర్లలో రూ.10 లక్షలతో నిర్మించిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని జెడ్పీ చైర్మన్ బాపిరాజు, రూ.8.50 లక్షలతో నిర్మించిన ఉద్యానశాఖ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంపునకు యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. యాంత్రీకరణతో పాటు సాగు నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. తాడిపూడి, ఎర్రకాలువ కుడికాలువ, చింతలపూడి లిప్ట్‌ల నుంచి సాగునీరు అందించి సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అధికారుల కష్టంతోనే నల్లజర్ల మండలం జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకోబోతుందని బాపిరాజు చెప్పారు. పంచాయతీరాజ్ దినోత్సవం ఈ నెల 24న సీఎం చంద్రబాబును పోతవరం తీసుకువచ్చి సత్కరించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, జెడ్పీటీసీ కొఠారు అనంతలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ ్మశ్వరి, ఉద్యానశాఖ ఏడీ జి.విజయలక్ష్మి, ఆత్మ పీడీ ఆనందకుమారి, ఏడీఏ రాజన్ తదితరులు పాల్గొన్నారు.