breaking news
mvs sharma
-
గజం రూ.లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తారా?
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో గజం స్థలం రూ.లక్ష, రూ.లక్షన్నర ఉంటే.. ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో ఆంతర్యమేంటని యూపీఎస్సీ మాజీ ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్ హటంగడి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూ కుంభకోణమని, దీని వెనుక అధికార పార్టీ నాయకుడి హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు.విశాఖలో ప్రభుత్వ భూములు, ఆస్తుల బదలాయింపుపై వార్వా నివాస్ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రొఫెసర్ కేఎస్ చలం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పెట్టుబడిదారులు మన ఆస్తులు, భూములు కొట్టేస్తున్నారని, మనపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డిరు. విస్తారంగా ఉన్న రక్షిత అడవుల్ని, తీర ప్రాంతాన్ని కూడా చేజిక్కించుకుంటున్నారని అన్నారు. టాటా ఏమైనా పేద సంస్థా? పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలు చొప్పున 22 ఎకరాలు టాటా (టీసీఎస్) కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థా? అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాల్ని కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాల్లో లూలు మాల్ పెడితే ఆ ప్రాంతం, పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ట్రాఫిక్‌తోపాటు, కాలుష్యం భయంకరంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అని, ప్రజల భూమిని ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాలని సూచించారు. ఉపాధి కల్పిస్తామనే ఉత్తుత్తి హామీలతో విశాఖలో భూముల్ని కార్పొరేట్లకు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఇలాగే భూములు ఇచ్చారని, కానీ ఉద్యోగాలు మాత్రం కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరిట భూముల అమ్మకం నగర వినాశనానికే దారి తీస్తుందన్నారు. ఇటువంటి నిర్ణయాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే ప్రజా మద్దతుతో తిప్పి కొడతామని హెచ్చరించారు. వార్వా అధ్యక్షుడు ఎన్.ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వార్వా ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్, నివాస్ అధ్యక్షుడు బి.గురప్ప, ప్రధాన కార్యదర్శి పిట్టా నారాయణమూర్తి, హరి ప్రసాద్, బీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘కొత్త పింఛన్ విధానంతో నష్టమే’
శ్రీకాకుళం అర్బన్: నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టదాయకమని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. నూతన పెన్షన్ విధానం–పర్యావసానాలపై సెమినార్ అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా పెన్షన్ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయన్నారు. ఈ విధానాల వల్ల పాతపెన్షన్ కూడా గ్యారెంటీ లేకుండా పోతుందని అన్నారు. కాబ ట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కలసికట్టుగా పో రాడి ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్న ఈ సదస్సులో గరిమెళ్ల అధ్యయనవేదిక కన్వీనర్ ఎస్.కిషోర్‌కుమార్, ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు గొంటి గిరిధర్ పాల్గొన్నారు. -
అణు’ ప్రాంతాల్లో ఆంక్షలు
శ్రీకాకుళం సిటీ: అణుకుంపటి మళ్లీ అంటుకుంటోంది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అణు ప్లాంట్ ఏర్పాటుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన తాజా జీవో మళ్లీ నిప్పు రాజేసింది. అధికారంలో లేనప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా ద్వంద్వవైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వం తెర వెనుక మాత్రం అణు ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరిస్తామని, దానికి భిన్నంగా భూసేకరణ చేపట్టబోమని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్టారెడ్డి ఒక పక్క శాసనమండలిలో చెప్పగా.. అదే రోజు కొవ్వాడ అణు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరించి.. వాటి పరిధిలో ఎటువంటి అభివృద్ధి పను లు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనమండలిలోనూ చర్చ అంతకుముందు శనివారం ఉదయం శాసనమండలిలోనూ అణు ప్లాంట్‌పై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పర్యావరణ, అటవీ, ఇతరత్రా అనుమతులు పొందకుండా భూసేకరణ చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. అందువల్ల ఇప్పటివరకు కొవ్వాడలో జరిగిన భూసేకరణను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. భూ ప్రకంపనల అధ్యయన నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అనుమతులు పొంది, 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. దీనిపై అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పందిస్తూ కోర్టు తీర్పుకు భిన్నంగా జరిగి ఉంటే కొవ్వాడలో భూసేకరణను రద్దుచేస్తానని, భూకంప నివేదిక తర్వాతే ప్రభుత్వం తరపున ఆమోదం తెలుపుతామని ప్రకటించారు. నాలుగు జోన్లలో ఆంక్షలు ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతాలను నాలుగు ప్రత్యేక జోన్లుగా వర్గీకరిస్తూ.. వాటి పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని ఆదేశిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నెం. 186ను జారీ చేసింది. పర్యావరణ శాఖ, అణుశక్తి రెగ్యులేటరీ బోర్డు సూచనల మేరకు ఈ ఆంక్షలు విధించినట్లు జీవోలో పేర్కొన్నారు. ఆ నాలుగు జోన్లు ఏవంటే.. రణస్థలం మండలంలోని రామచంద్రాపురం, టెక్కలి, గూడెం గ్రామాలు ఎక్స్‌క్లూజన్ జోన్ పరిధిలోకి వస్తాయని, ఈ ప్రాంతాల్లో నివాస, ఆవాసాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొన్నారు. స్టెరిలైజ్డ్ జోన్ పరిధిలోకి అక్కయ్యపాలెం, చిల్లపేటరాజాం, దేరశాం, కోటపాలెం, జీరుకొవ్వాడ, మరువాడ, మెంటాడ, ఎన్.గజపతిరాజపురం, పాపారావుపేట, పాతర్లపల్లి, పాతసుందరపాలెం, సీతారాంపురం, సూరంపేట, తెప్పలవలస తదితర గ్రామాలను చేర్చారు. ప్లాంట్‌కు 5 కి.మీ. పరిధిలో ఉన్న ఈ గ్రామాలను నిషిద్ధ ప్రాంతంగా నోటిఫై చేశారు. ఎమర్జెన్సీ ప్లానింగ్ జోన్ కింద ప్లాంట్ చుట్టూ 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిధిలో ప్లాంట్ ఉద్యోగుల గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి నిర్మాణాలు చేపడతారు. ప్లాంట్‌కు 30 కి.మీ. విస్తీర్ణం వరకు ఇంపాక్ట్ అసెస్మెంట్ జోన్‌గా గుర్తించారు. దీని పరిధిలో అణు ప్లాంట్ ప్రభావంపై అధ్యయనాలు నిర్వహిస్తారు. నాడు వ్యతిరేకించిన వారే.. ఈ జీవోతో అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో టీడీపీ, రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి స్పష్టమైంది. ప్రతిపక్షంలో ఉండగా ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమాలను ప్రోత్సహించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించి అణు విద్యుత్‌కు యథోచిత సహకారం అందించడంపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అణు పార్కుకు అనుకూలంగా ఉందని స్పష్టమవుతోంది. ఇది నిజంగా ప్రజలను మోసం చేయడమే.. నేను శనివారం శాసనమండలిలో అణు భూసేకరణను రద్దు చేయాలని కోరాను. అటవీశాఖ మంత్రి సానుకూలంగా మాట్లాడారు. ఇంతలోనే పురపాలక శాఖ నుంచి నాలుగు జోన్లలో ఎటువంటి అభివృధ్ది పనులు చేయకూడదంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదంతా అణు పార్కుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్నే సూచిస్తోంది. దీనిపై పోరాడతాం. - ఎంవీఎస్ శర్మ, ఎమ్మెల్సీ