breaking news
Muster
-
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
మస్టర్లు ఇవ్వండి మహాప్రభో..!
సింగరేణి కంపెనీ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మస్టర్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లకోసారి టెండర్ ద్వారా నియమించుకుంటున్న సిబ్బంది సంక్షేమాన్ని ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు పట్టించుకోవడంలేదు. ఫలితంగా వారు అరకొర సదుపాయాలు, పనిదినాలు కరువై అవస్థలు పడుతున్నారు. ఏరియాలో ప్రతిరోజు సింగరేణికి 70 మంది సెక్యూరిటీ సిబ్బందిని అందించేందుకు ఓ సంస్థ సుమారు 150 మంది నిరుద్యోగులను గార్డులగా నియమించుకుంది. తమ సంస్థ ద్వారా ఉద్యోగం పొందే వారి నుంచి రూ.10వేలు తీసుకునే నిబంధనను విధిం చింది. అయితే దీనిని స్థానిక కార్మిక సంఘాల నాయకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో సదరు సంస్థ నిరుద్యోగ యువతను దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం గడవడానికి అప్పు.. సప్పు చేసి రూ.10వేలు కట్టి ఉద్యోగంలో చేరిన వారికి ప్రతిరోజు డ్యూటీలు ఇవ్వకుండా నెలలో కేవలం 5 నుంచి 15 మస్టర్లు మాత్రమే ఇస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. మస్టర్ల విషయమై ప్రశ్నిస్తే మీకు.. ఇష్టమైతే చేయండి.. లేకుంటే మానుకోండి.. అంటూ నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నట్లు వారు వాపోతున్నారు. స్థానిక సెక్యూరిటీ అధికారులు సదరు సంస్థ నుంచి నెల నెలా మామూళ్లు తీసుకుని మాకేమీ తెలియదంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు కరువు ఒక్కో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్న సంస్థ గార్డులకు సరైన రక్షణ చర్యలు కల్పించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. యూనిఫాం ఇవ్వకపోవడంతో పాటు జంగల్లో రాత్రి వేళ విధులు నిర్వహించే ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకోవడంలేదని సిబ్బంది చెబుతున్నారు. ఇద్దరు సిబ్బంది విధులు నిర్వర్తించే అటవీ ప్రాంతంలో ఒక్కరికే డ్యూటీ వేస్తున్నారని, దీంతో అడవి జంతుల దాడిలో గాయపడుతున్నామని గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌కాస్టు పరిసర ప్రాంతాల్లో సరైన షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వర్షాకాలం లో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. లైట్లు సైతం నాణ్యతగా లేనివి ఇవ్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికి తోడు ఇటీవల కాలంలో నెలకు కనీసం 15 మస్టర్లు కూడా ఇవ్వకపోవడంతో సగం వేతనమే వస్తోందని ఆవేదన చెందుతున్నారు. విధులకు వచ్చిన గార్డులను కనీసం రోజుకు 5 నుంచి 10 మందిని తిరిగి పంపుతున్నారు. యాజమాన్యానికి అనుకూలంగా ఉండే కొంత మందికి మాత్రమే నెలలో అన్ని రోజులు విధులు కల్పిస్తూ చెక్‌పోస్టు వంటి ప్రాంతాల్లోనే వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణి అధికారులు తక్షణమే స్పందించి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులందరికీ నెలకు కనీసం 20 నుంచి 25 మస్టర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత గార్డులు కోరుతున్నారు.