breaking news
Mumbai Darshan
-
ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!
ఐఆర్సీటీసీ అనగానే కేవలం రైళ్ల టికెట్లు బుక్ చేసుకోడానికే అనుకుంటాం కదూ.. కానీ ఇప్పుడు సరికొత్త సేవల్లోకి కూడా ఈ సంస్థ దిగుతోంది. ముంబై నగరాన్ని హెలికాప్టర్లోంచి చూపించే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ముంబై నగరాన్ని ఒక్కసారి హెలికాప్టర్లో అలా చుట్టి రావాలంటే.. రూ. 5,580 చార్జీ అవుతుందని ఐఆర్సీటీసీ రీజనల్ డైరెక్టర్ వీరేందర్ సింగ్ తెలిపారు. జుహు ఏరోడ్రమ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి అలా చుట్టు తిరగొచ్చు. మంగళ, శుక్రవారాల్లో దక్షిణ ముంబై పర్యటన ఉంటుంది. జుహు, బాంద్రా-వర్లి సీలింక్, హజీ అలీ ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఉత్తర ముంబై మార్గానికి సోమ, శనివారాల్లో ట్రిప్పులుంటాయి. అందులో జుహు, వెర్సోవా, మలాడ్, గొరాయ, పగోడా, ఎస్సెల్ వరల్డ్ ప్రాంతాలు కవరవుతాయి. హెలికాప్టర్ సముద్రమట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఎగురుతుంది కాబట్టి ఇదంతా చాలా సరదాగా ఉంటుందని వీరేందర్ సింగ్ చెప్పారు. -
ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు
సాక్షి, ముంబై: నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. మహారాష్ట్ర పర్యాటక అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) ‘ముంబై దర్శన్’ జాబితాలో కొత్త ‘పర్యాటక’అందాలను చేర్చనుంది. ఇందులో బాంద్రా-వర్లీ సీ లింకు, మెట్రో, మోనో రైళ్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు అవిర్భవించాయి. ఇప్పటి వరకూ పర్యాటకులకు వాటి దర్శన భాగ్యం కల్పించడం లేదు. నూతన జాబితాతో త్వరలో మరిన్ని నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు లభించనుంది. సీ లింకు, మెట్రో, మోనో లాంటి ఈ కొత్త వింతలు ఆస్వాదించే అవకాశం కల్పించడానికి నిర్ణయించింది. రోజూ ఇలా.. ముంబై నగర అందాలు, పర్యాటక ప్రాంతాలను తిలకించడానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఇక్కడి వింతలు, విశేషాలు వారికి తెలియకపోవడంతో ఎంటీడీసీని ఆశ్రయిస్తారు. ముంబై దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సుల్లో నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు.ఇందులో గేట్ వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ టర్మినస్, అసెంబ్లీ భవనం, మెరైన్ డ్రైవ్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, ఏషియేటిక్ లైబ్రరీ, తారపోర్వాలా ఫిష్ ఎక్వేరియం, కమలా నెహ్రూ పార్క్, బూట్ బంగ్లా, బంగారు మహాలక్ష్మి, హాజీఅలీ, నెహ్రూ సెంటర్, సిద్ధివినాయక మందిరం ఇలా అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం కొత్తగా చేరిన సీ లింకు, మెట్రో, మోనో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే లాంటి వింతలు కూడా పర్యాటకులకు చూపించాలని ఎంటీడీసీ నిర్ణయించింది. గణేశ్ ఉత్సవాలు పూర్తికాగానే ఈ అందాలను పర్యాటకులకు చూపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంటీడీసీ అధికారి చెప్పారు. దీని కారణంగా ముంబైకి పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.