breaking news
multiple blasts
-
హై అలర్ట్ : వదంతులు నమ్మొద్దు
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లతో దద్దరిల్లిన క్రమంలో శ్రీలంక అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయం మూడు చర్చిలు, ఐదు ఫైవ్‌స్టార్ హోటళ్లలో పేలుళ్లతో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. పేలడు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు స్ధానిక భద్రతాధికారుల ప్రయత్నాలకు తోడు ఎమర్జెన్సీ సర్వీసులు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి... (బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పలు చోట్ల సైన్యాన్ని రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేసి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. కొలంబోలోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో బాంబు పేలుళ్ల ఘటన అనంతర పరిస్ధితులపై ఆయన తన నివాసంలో సమీక్షించనున్నారు. కాగా బాంబు పేలుళ్ల ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా అధికారులు అందుకు అనుగుణంగా అప్రమత్తం కాలేదనే వార్తలు దుమారం రేపాయి. -
జంట పేలుళ్లు: 12మంది మృతి
పాకిస్థాన్ : పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని కైబర్ పక్తున్వ ప్రావెన్స్లో శుక్రవారం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఘటనలో మొత్తం 12 మంది మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా కోర్డు ఆవరణలో జరిగిన ఈ దాడిలో లాయర్లు, పోలీసులు ఎక్కువ సంఖ్యలో మరణించారు. కొద్ది రోజుల క్రితం లాయర్లను టార్గెట్ చేసుకుని పాక్ లోని ఓ ఆసుపత్రిలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఎవరు ప్రకటించలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.