breaking news
Mukheskumar Meena
-
‘మెట్రో’ సమస్యలకు త్వరలో పరిష్కారం: కలెక్టర్ మీనా
రాంగోపాల్‌పేట్: సెయింట్ థామస్ చర్చి వద్ద జరుగుతున్న మెట్రో పనుల్లో తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా అన్నారు. ఇక్కడ పనులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ చర్చి కమిటీ ప్రతినిధులు నిర్మాణం పనులు అడ్డుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ ప్రతినిధులు సమస్యను కలెక్టర్‌కు వివరించారు. ఆల్ఫా హోటల్, దాని పక్కనే ఉన్న పెట్రోల్ బంకు స్థలం తమదేనని, అందులో నుంచి మెట్రో లైన్ వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ అలాకాకుండా ప్రార్థనలు, సభలు, వివిధ సంస్థల కార్యకలాపాలు జరుపుకునే మైదానం, ప్రేయర్‌హాల్ గుండా లైన్ వెళ్లడం వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తాయని కలెక్టర్‌కు విన్నవించారు. 162 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి ఆస్తులను ఇలా అడ్డగోలుగా లాక్కోవడం మెట్రో అధికారులకు తగదని చెప్పారు. గతంలో తమకు వారు హామీ ఇచ్చి కూడా దాన్ని విస్మరించారని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చర్చి ప్రతినిధులు 5 నుంచి 7 మీటర్లు బయటకు జరిగి నిర్మాణాలు చేసుకోమంటున్నారని, దీన్ని పరిశీలిస్తామన్నారు. అన్ని వర్గాలతో చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొంటామని చర్చి ప్రతినిధులు శామ్యూల్ థామస్, దాస్ రాబర్ట్ తదితరులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. -
గోల్కొండ కోటను సందర్శించిన కలెక్టర్
గోల్కొండ: పంద్రాగస్టు రోజున కేసీఆర్ గోల్కొండ కోటలో జెండా ఎగరవేయనుండడంతో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా మంగళవారం గోల్కొండ కోటకు వచ్చారు. భారతీయ పురాతత్వ సర్వేక్షణ శాఖ అధికారులతో కలిసి ఆయన అట్టార సిడి ప్రాంతాన్ని పరిశీలించారు. గత సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టార సిడి ప్రాంతాన్ని ప్రత్యేకంగా సందర్శించి అరగంట పాటు అక్కడున్నారు. 51 ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పరేడ్ గ్రౌండ్‌గా తీర్చిదిద్దేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదే శించడంతో కలెక్టర్ అట్టార సిడి కందకాల నుంచి ఆషుర్‌ఖానా వరకు విస్తరించి ఉన్న మైదానాన్ని పరిశీలించారు. మైదానం మధ్యలో ఉన్న పెద్ద బండరాళ్లు, చెట్లను తొలగించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా కటోరహౌస్ క్రాస్‌రోడ్డు నుంచి అట్టార సిడి వరకు ఉన్న రోడ్డు ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తే తలెత్తే సమస్యలను కూడా ఆయన అధికారులతో చర్చించారు. ఆయన వెంట ఆర్డిఓ నిఖిల, గోల్కొండ త హసిల్దార్ వంశీమోహన్, పురావస్తు శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం అధికారులు ఉన్నారు.