breaking news
MS Shobharani
-
సాంఘిక సంక్షేమ డీడీ పోస్టుపై ఉత్కంఠ
కర్నూలు(అర్బన్): జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల పోస్టు భర్తీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ డీడీగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ శోభారాణిని గత నెల 4న ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో వైఎస్ఆర్ జిల్లా జేడీ పీఎస్వీ ప్రసాద్‌ను కర్నూలుకు బదిలీ చేయగా వివిధ కారణాల రీత్యా ఆయన ఇక్కడకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో కర్నూలుకు వచ్చేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న మన రాష్ట్రానికి చెందిన అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ డీడీ కాలేబు, కరీంనగర్ డీడీ నాగేశ్వరరావు, ఖమ్మం డీడీ రంగలక్ష్మి, నల్గొండ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సీతామహాలక్ష్మి, మహబూబ్‌నగర్ ఈడీ వీరఓబులు, వరంగల్ డీడీ రోషన్న, నల్గొండ డీడీ వెంకటనర్సయ్య, మహబూబ్‌నగర్ డీడీ జయప్రకాష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరిలో పలువురు కర్నూలుకు వచ్చేందుకు ఉత్సాహంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లా స్థాయి అధికారుల విభజనకు సంబంధించి ఈ నెల 15న కమలనాథన్ కమిటీ సమావేశం కానున్న దృష్ట్యా వీరంతా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కర్నూలు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య, గుంటూరు డీడీ హనుమంతునాయక్, శ్రీకాకుళం డీడీ అచ్చుతానందన్ ఉన్నారు. వీరు ముగ్గురిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకుంటే, తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది అధికారులను మన రాష్ట్రానికి అడ్జెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ల ఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కమలనాథన్ కమిటీ సిఫారసుల మేరకు బదిలీలు జరిగితే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం డీడీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇక మిగిలిన ఇద్దరు అధికారులను సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సెక్రటరీ పోస్టుల్లో నియమించే అవకాశాలున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న, ఖాళీ ఏర్పడనున్న పోస్టులన్నీ భర్తీ అయ్యే అవకాశాలున్నందున సంబంధిత అధికారులు ఇక్కడకు వచ్చేందుకు మంత్రులు, ముఖ్యమైన ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమైన పోస్టులకు ఇన్‌చార్జీలే దిక్కు! సాంఘిక సంక్షేమ శాఖలో ముఖ్యమైన పోస్టులన్నీ ఇన్చార్జీల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. అత్యంత కీలకమైన డీడీ పోస్టు నెల రోజులుగా ఇన్‌చార్జీగానే కొనసాగుతోంది. డీడీ శోభారాణి నెల క్రితం ఇక్కడి నుంచి బదిలీ కాగా, అప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పులిచేరి సారయ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఇక్కడ డీఎస్‌డబ్ల్యుఓ వెంకటనర్సయ్య నల్గొండ డీడీగా పదోన్నతిపై వెళ్లారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పోస్టును ఏడాది క్రితం నుంచి ఆలూరు ఏఎస్‌డబ్ల్యుఓ నాగభూషణం ఇన్చార్జీ విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు ఏఎస్డబ్ల్యుఓగా రాజకుమారి 2013 మే 31న పదవీ విరమణ చేయగా అప్పటి నుంచి నేటి వరకు పెద్దపాడు వసతి గృహ సంక్షేమాధికారి బాబు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10లోగా బదిలీలు జరిగిపోతాయని అందరూ భావించినా రాష్ట్ర ప్రభుత్వం 20వ తేది వరకు ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నందున బదిలీలు కాస్తా వాయిదా పడ్డాయి. -
సొంత పిల్లల్లా చూసుకోవాలి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థినులను ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు సొంత పిల్లల్లా చూసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక బి.క్యాంప్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహ సముదాయ ఆవరణలో జిల్లాలోని సాంఘిక సంక్షేమశాఖ కళాశాల, హైస్కూల్ స్థాయి ప్రత్యేక వసతి గృహాల సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ వసతి గృహాల్లో 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో వార్డెన్లు స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నామా? విద్యార్థినులు సక్రమంగా కళాశాలకు వెళ్తున్నారా? తదితర విషయాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలనూ తెలుసుకోవాలన్నారు. సాధారణంగా ఈ వయస్సులోని విద్యార్థినులు తమ బాధలను ఇతరులతో చెప్పుకోలేక.. సరైన నిర్ణయాలు తీసుకోలేక నష్టపోతుంటారన్నారు. అందువల్ల వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ కుటుంబ విషయాలను కూడా చర్చించేలా సఖ్యత పెంపొందించుకోవాలన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినులను పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయాలన్నారు. ఇప్పటికే అన్ని కళాశాలల వసతి గృహాలకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పంపామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దిశానిర్దేశం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఇ.నాగభూషణం, సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, మోహన్‌రెడ్డి, జాకీర్ హుసేన్, సిద్ధరామయ్య, కళాశాల వసతిగృహ సంక్షేమాధికారులు మాధవేణి, గౌరి, హైస్కూల్ స్థాయి ప్రత్యేక హాస్టళ్ల సంక్షేమ అధికారులు లీలావతి, కల్పన, కరుణలత, అనిత తదితరులు పాల్గొన్నారు.