breaking news
Mosquito breeding
-
ఎంజీపీఎం ద్రావణంతో దోమ నివారణ!
రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేసే క్రమంలో చీడపీడల బారిన పడకుండా పంటలను కాపాడుకోవడం అనేది చాలా ముఖ్య ఘట్టం. అందుకు గాను పొలాల వద్దనే అందుబాటులో ఉండే కొన్ని రకాల మొక్కల రసాలను కలిపి రైతులు స్వయంగా తయారుచేసుకోగలిగిన సరికొత్త ద్రావణాలపై నిత్యం ప్రయోగాలు చేస్తూ.. చక్కని ద్రావణాలను ఆవిష్కరిస్తున్నారు రైతు శాస్త్రవేత్త కొమ్ములూరి విజయకుమార్. వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి.వెలంవారిపల్లె ఆయన స్వస్థలం. ఇప్పటికే 5 రకాల కొత్త ద్రావణాలను రైతులకు అందించిన ఆయన తాజాగా ‘ఎంజీపీఎం’ ద్రావణాన్ని రూపొందించారు. విజయకుమార్ గతంలో తయారు చేసి అందించిన 5 రకాల ద్రావణాలను చాలా మంది రైతులు వినియోగిస్తూ ప్రయోజనం పొందుతున్నారు. అవి... 1. జముడు, సునాముఖితో తయారు చేసే ద్విపత్ర ద్రావణం. 2. ఎర్రిపుచ్చకాయలు, నల్లేరు తీగలతో తయారు చేసే వై.ఎన్. ద్రావణం. 3. దున్నంగి, ఊడుగలతో తయారు చేసే డీయూ ద్రావణం. 4. కుందేలు కొమ్ములు పొద, పిచ్చి ఎర్రగడ్డలతో తయారు చేసే కె.వై. ద్రావణం. 5.పచ్చగన్నేరు, కలబందలతో తయారు చేసే పీఏ ద్రావణం. ఆయన తాజాగా తయారు చేస్తున్న మరో ద్రావణం ‘ఎంజీపీఎం’ ద్రావణం. తెల్లదోమ, పచ్చదోమల దాడితో సుమారు 60 శాతం పంట దిగుబడులను రైతులు నష్టపోతున్నారని ఒక అంచనా. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘ఎంజీపీఎం’ ద్రావణం ఉపయోగపడుతుందని విజయకుమార్ చెప్పారు. దీన్ని పత్తి మినహా అన్ని రకాల తోటలపై పిచికారీ చేసి పరీక్షించామన్నారు. పూతపైన వచ్చే ఎటువంటి పురుగునైనా మట్టుబెడుతుంది. వైరస్ తెగుళ్లను పంటలోకి దరి చేరనీయదు. విత్తనశుద్ధికి కూడా ఉపయోగ పడుతుందన్నారు. ‘ఎంజీపీఎం’ ద్రావణం అంటే? పంటలకు సోకే చీడపీడల నివారణకు పొలాల గట్ల మీదే అన్ని ప్రాంతాల్లోనూ లభించే ‘మంగకాయలు’(ఎం), ‘గబ్బాకు’(జీ) (దీన్నే కుక్క జీరుంగ ఆకు అని కూడా అంటారు), చెట్లను అల్లుకొని ఉండే ‘పాచి తీగ (పీ)’, మజ్జిగ(ఎం)లతో కూడినదైనందున ‘ఎంజీపీఎం’ ద్రావణం అని పేరు పెట్టారు. మంగకాయలు: ఈ మంగ చెట్లు అడవుల్లోను, కొండలు, గుట్టలపైన, వాగులు, వంకల గట్ల పైన పెరుగుతుంటాయి. మంగ కాయలు చేదుగా, జిగటగా ఉంటాయి. గబ్బాకు (కుక్క జీరుంగ ఆకు) : గబ్బాకు మొక్కలు ప్ర«ధానంగా వరి పొలాల గట్లపై విరివిగా ఉంటాయి. ఈ మొక్కలను అర అడుగు ఎత్తు పెరగనిచ్చి వరి మడులలో పచ్చిరొట్ట ఎరువుగా తొక్కిస్తారు(దమ్ము చేస్తారు). పాచి తీగ (చెట్లకు అల్లుకుని ఉంటుంది): పాచి తీగలు ముఖ్యంగా పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో దొరుకుతాయి. చెట్లకు వేలాడుతూ ఉంటాయి. ఈ తీగలకు పురుగులు, తెగుళ్లు ఉండవు. ‘ఎంజీపీఎం’ ద్రావణంతయారు చేసుకునేదెలా? 5 కిలోల మంగ కాయలు, 10 కిలోల గబ్బాకు(కుక్క జీరుంగ ఆకు)లు, 10 కిలోల పాచి తీగలు సేకరించి, దంచి ఉంచుకోవాలి. 200 లీటర్ల నీరు పట్టే డ్రమ్ము తీసుకుని అందులో ముందుగా 5 లీటర్ల మజ్జిగను, 170 లీటర్ల నీటిని పోయాలి. ఆ తరువాత మంగకాయలు, గబ్బాకు, పాచి తీగల గుజ్జును ఆ డ్రమ్ములో వేసి, బాగా కలియ దిప్పాలి. డ్రమ్మును నీడలోనే పెట్టాలనేమీ లేదు. ఆరుబయటైనా పెట్టొచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్రతో కలియబెట్టాలి. దీనిపై తప్పకుండా గోనె సంచి కప్పి ఉంచాలి. 8 రోజుల పాటు మురిగిన తర్వాత మాత్రమే ఈ 200 లీటర్ల ద్రావణాన్ని వాడుకోవాలి. దీనికి కాలదోషం లేదు. (రైతు శాస్త్రవేత్త కొమ్ములూరి విజయకుమార్‌ను 98496 48498 నంబరులో సంప్రదించవచ్చు) – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా పంట ఏదైనా 3 సార్లు పిచికారీ.. ► ‘ఎంజీపీఎం’ ద్రావణాన్ని ఉ. 5 గంటల నుంచి 8 గంటల వరకు, సా. 5.30 గంటల నుంచి 7 గంటల వరకు పిచికారీ చేస్తే మంచిది. 7 గంటల తర్వాత చల్లితే మిత్రపురుగులు దెబ్బతింటాయి. ► అమావాస్య ముందు రోజు, అమావాస్య, అమావాస్య తర్వాత రోజులు పిచికారీ చేయాలి. ఆయా రోజుల్లో పురుగు పొదుగుతూ ఉంటుంది కాబట్టి, అప్పుడు చల్లితే మంచి ఫలితం ఉంటుంది. ► ఏ పంటకైనా 3 దఫాలు పిచికారీ చేయాలి. మొదటి దఫా 10 లీటర్ల నీటికి లీటరు ద్రావణం, రెండో దఫా 10 లీటర్ల నీటికి లీటరున్నర ద్రావణం, మూడో దఫా 10 లీటర్ల నీటికి 2 లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. ► పంటలను బట్టి 3 పిచికారీల మధ్య వ్యవధి మారుతుంది. పంటలు ఏవైనప్పటికీ మొదటి దఫా 10:1 లీ., రెండో దఫా 10:1.5 లీ., మూడో దఫా 10:2 లీ. నిష్పత్తిలో ద్రావణాన్ని కలుపుకోవాలి. ► వేరుశనగ, ధనియాలు, మినుము, పెసర, సొర, బీర, కాకర, గుమ్మడి వంటి పంటలకు విత్తుకున్న 11వ రోజు, 16వ రోజు, 22వ రోజు పిచికారీ చేయాలి. కొత్తిమీర, ధనియాలు, ఆకుకూరల తోటలు 2 నుంచి 4 ఆకుల దశలో మొదటి పిచికారీ చేయాలి. ► చీనీ, సపోట, జామ, దానిమ్మ, మామిడి, ఇతర పండ్ల తోటలకు మొదటి సారి పిచికారీ చేసిన తర్వాత 8వ రోజు, 16వ రోజు పిచికారీ చేయాలి. కాండం, కొమ్మలు, ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. -
ఫంగస్‌తో దోమల నివారణ!
వైద్య సదుపాయాలు బాగా పెరిగాయనుకుంటున్న ఈ కాలంలోనూ మలేరియా వ్యాధి ద్వారా ఏటా మరణిస్తున్న వారి సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండటం బాధాకరమే. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధికి చెక్ పెట్టేందుకు మేరీల్యాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడో కొత్త టెక్నిక్‌ను ఆవిష్కరించారు. జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా సాధారణ ఫంగస్ తేలు, సాలీడు విడుదల చేసే విషాన్ని ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ విషంతో దోమలు చనిపోతాయి. అయితే మనుషులకు ఎలాంటి హానీ ఉండదు. అంతేకాకుండా ఈ సరికొత్త ఫంగస్ ద్వారా తేనెటీగలకు, ఇతర క్రిమికీటకాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. దోమల శరీరాలకు తాకిన వెంటనే ఫంగస్ పెరగడం మొదలై.. కొంత సమయానికి శరీరంలోకి చొచ్చుకుపోయి చంపేస్తుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న బ్రెయిన్ లోవెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఫంగస్ బారిన పడ్డ దోమ మనుషుల రక్తం పీల్చడం కూడా మానేస్తుందని.. ఫలితంగా మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తిని అతి తక్కువ కాలంలోనే అడ్డుకోవచ్చని వివరించారు. రసాయన మందులతో పోలిస్తే ఈ ఫంగస్ దోమపై చూపే ప్రభావం చాలా భిన్నమైందని, దోమ నాడీవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్త రేమండ్ పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఫంగస్ విడుదల చేసే విషం కేవలం దోమ రక్తంలో మాత్రమే చైతన్యవంతమయ్యేలా జన్యుపరమైన స్విచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఇతరులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేశామని వివరించారు.