breaking news
Modernization of roads
-
రూ.15 వేల కోట్లతో రోడ్ల ఆధునీకరణ: తుమ్మల
హైదరాబాద్: రాష్ర్టంలో మరో మూడేళ్లలో రూ.15 వేల కోట్లు వెచ్చించి ఆర్ అండ్ బి రహదారులను ఆధునీకరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తా నుంచి బాచుపల్లి వరకు రూ.15 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు ఆయన రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, విడతలవారీగా రహదారుల పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు మధ్యలో డివైడర్లు, వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వడివడిగా ‘స్లమ్ ఫ్రీ’ సర్వే
93 స్లమ్స్‌లో ఇప్పటికే పూర్తి మిగతా వాటిలో చకచకాపనులు కనీస సౌకర్యాలు, రెండు బెడ్రూంల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సిటీబ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వ హామీ కనుగుణంగా ఓవైపు రహదారుల ఆధునీకరణ, ఫ్లై ఓవర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు మరోవైపు స్లమ్‌ఫ్రీ సిటీ కోసం ఆయా స్లమ్స్‌లో సర్వే కార్యక్రమాలు వేగవంతం చేశారు. గ్రేటర్లో మొత్తం 1476 స్లమ్స్ ఉండగా, ఇందులో 93 స్లమ్స్‌లో సర్వే పూర్తిచేశారు. ఇప్పటికే శంకుస్థాపన జరిగిన ఐడీహెచ్ కాలనీలో మాదిరిగా 2బెడ్రూమ్తో కూడిన ఇళ్ల నిర్మాణాల కోసం అధికారులు ఈ సర్వే చేశారు. ఇళ్లతోపాటు అక్కడ కల్పించాల్సిన తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రహదారుల స్థితిగతులనూ అంచనా వేశారు. ఎన్ని బస్తీల్లో సదరు సదుపాయాలున్నాయో, ఎన్నింట్లో లేవో, ఎన్నింట్లో మెరుగుపరచాల్సి ఉందో సమగ్ర సర్వే నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కింద నిధులతో ఈ పనులు చేయాలని భావిస్తున్నారు. అందుకుగాను సదరు ప్రజలు ఎక్కువగా ఉన్న స్లమ్స్‌లో తొలిదశ సర్వే నిర్వహించారు. వాటితోపాటు ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని త్వరలో పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఖర్చు చేసేందుకు ప్రస్తుత ఆర్థికసంవత్సర బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారు. మార్చిలోగా పనులు చేపట్టాల్సి ఉండటంతో సదరు నిధులతో ఈ పనులు చేయాలని యోచిస్తున్నారు. కాగా, చాలా స్లమ్స్‌లో అపార్ట్మెంట్లు కాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు కావాలనే డిమాండ్ ఉన్నట్లు సర్వేలో తేలింది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలు సుముఖంగా లేరు. ఈనేపథ్యంలో తొలుత కొన్ని ప్రాంతాల్లో ఈ ఇళ్ల పథకాన్ని పూర్తిచేసి.. తద్వారా అక్కడ కలిగే సదుపాయాలు, పెరిగే డిమాండ్ చూపిస్తే మిగతా ప్రాంతాల వారూ ముందుకు రాగలరని యోచిస్తున్నారు. తద్వారా గ్రేటర్ నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనియాలని అధికారులు భావిస్తున్నారు.