breaking news
mobile transaction
-
పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ
ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్97 కమ్యూనికేషన్స్.. హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్. యూపీఐ ద్వారా యాప్‌లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది. యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది. -
మీ మొబైలే మీ పర్సు... జాగ్రత్త!!
ప్రస్తుతం రోజూ పోలీసులకు తమ మొబైల్ ఫోన్లు పోయాయని పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ వాలెట్లు పెరిగిన నేపథ్యంలో మీ మొబైల్‌ను ఇకపై మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మీ మొబైలే మీ పర్సు. మొబైల్ పోతే మీ పర్స్ పోయినట్టే. అదెలాగంటే... చాలా మొబైల్ వాలెట్లకు ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నపుడు ప్రతిసారీ లాగిన్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పేటీఎం, మొబిక్విక్ వంటి వాలెట్లను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ఉంచారనుకోండి. మీ మొబైల్ గనక పోగొట్టుకున్నట్లయితే... ఆ మొబైల్‌ను చేజిక్కించుకున్న వ్యక్తి, దాన్లోని మీ వాలెట్లలో ఉన్న డబ్బులు మొత్తాన్ని కాజేసే అవకాశం ఉంది. ఆ వాలెట్ నుంచి మరో వాలెట్‌కు బదిలీ చేస్తే తరవాత దాన్ని తిరిగి రప్పించుకోవటం చాలా కష్టం. ఇలాంటివి జరక్కుండా చూడాలంటే మొదట మీ మొబైల్‌ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవటం ముఖ్యం. దాన్ని మొబైల్ గా మాత్రమే కాకుండా... పర్సులా చూసుకోవాలి. ⇔ మొబైల్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వద్దు. ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. ⇔ ఎన్ని వాలెట్లు పడితే అన్ని వాలెట్లూ డౌన్లోడ్ చేసుకుని, వాటిలో డబ్బులు వేయటం సరికాదు. ⇔ మొబైల్ వాలెట్లో మరీ ఎక్కువ డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. మీ లావాదేవీల అవసరాన్ని బట్టి తక్కువ మొత్తాన్ని వేసుకుంటే చాలు. ఒకవేళ మొబైల్ పోయినా, మీ వాలెట్లో వివరాలు చోరీకి గురైనా... నష్టం అందులో ఉన్న మొత్తానికి మాత్రమే పరిమితమవుతుంది. ⇔ ఇపుడు కొన్ని మొబైల్ వాలñ ట్లు అదనపు సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తున్నాయి. వాలెట్ ఓపెన్ చేయాల్సిన ప్రతిసారీ ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనివల్ల ఒకవేళ మీ మొబైల్ పోయినా, చోరీకి గురైనా... దాన్లోని వాలెట్‌ను మాత్రం అవతలి వ్యక్తులు అంత తేలిగ్గా యాక్సెస్ చేసుకోలేరు. ⇔ మీ మొబైల్ పోయిందనుకోండి! వెంటనే మీకు వాలెట్ పాస్వర్డ్ ఎలాగూ తెలిసి ఉంటుంది కనక మీ కంప్యూటర్ నుంచి లాగిన్ అయి... పాస్వర్డ్ మార్చేయండి. అపుడు మొబైల్ ద్వారా వాలెట్‌ను యాక్సెస్ చేయటానికి ప్రయత్నించినా... అది పాస్వర్డ్ అడుగుతుంది. మార్చిన పాస్‌వర్డ్‌ను అవతలి వ్యక్తి ఎంటర్ చేసే అవకాశం ఉండదు కనక మీ వాలెట్ సేఫ్‌గా ఉంటుంది. ⇔ మొబైల్ పోతే... తక్షణం మీ నెంబరును బ్లాక్ చేయిం^è ండి. అపుడు ఏ వాలెట్‌నూ అవతలి వ్యక్తి ఓటీపీ ద్వారా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండదు. నెంబరు బ్లాక్ చేయించకపోతే... మొబైల్ దక్కించుకున్న వ్యక్తి ఓటీపీ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకునే ప్రమాదముంటుంది. ⇔ ఆన్‌లైన్‌వైపు తప్పనిసరిగా మళ్లాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఈ జాగ్రత్తలు మారుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా బ్యాంకులు తదితర సంస్థలు కస్టమర్లలో అవగాహన పెంచి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం చాలా ఉంది. వచ్చే ఏడాది మొబైల్ మోసాలు 65% పెరగొచ్చు అసోచామ్ అధ్యయనం ఈ–వాలెట్లు, ఇతర అన్లైన్పేమెంట్ గేట్వేస్ ద్వారా డిజిటల్ లావాదేవీల జోరందుకుంటున్న నేపథ్యంలో మొబైల్ ద్వారా జరిగే మోసాలు బాగా పెరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదిక హెచ్చరిస్తోంది. మొత్తం సైబర్ నేరాల్లో మొబైల్ మోసాలు వచ్చే ఏడాదిలో 60–65 శాతానికి పెరగవచ్చని అంచనా వేసింది. దేశంలో ఒక వ్యాపారం ప్రారంభానికి లేదా అభివృద్ధికి ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమని, అందుకే ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దాదాపు 40–45 శాతం ఆర్థిక చెల్లింపులన్నీ మొబైల్ హ్యాండ్సెట్స్ ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు మొబైల్ మోసాల వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని వివరించింది. మొబైల్ మోసాలు వచ్చే ఏడాదిలో 60–65 శాతానికి చేరొచ్చని పేర్కొంది. క్రెడిట్/డెబిట్ కార్డు మోసాలే అధికం.. సైబర్ నేరాల్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మోసాలు టాప్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది. గత మూడేళ్లలో ఈ మోసాలు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయని పేర్కొంది. సైబర్ నేరాల్లో క్రెడిట్/డెబిట్ కార్డు మోసాల వాటా 46 శాతంగా ఉందని తెలిపింది. దీని తర్వాతి స్థానంలో ఫేస్బుక్ నేరాలు (39 శాతం), మొబైల్ మోసాలు (21 శాతం), ఈ–మెయిల్ ఐడీ హ్యాకింగ్ (18 శాతం), మోసపూరిత కాల్స్/ఎస్ఎంఎస్లు (12 శాతం) వంటివి ఉన్నాయని పేర్కొంది. సైబర్ దాడుల నుంచి కస్టమర్ల సమాచారాన్ని భద్రపరచడం కీలకమని వివరించింది. -
నెట్టింట్లో జాగ్రత్త సుమా!!
• తప్పనిసరిగా అంతా ఆన్‌లైన్‌వైపు • ఇదే అదనుగా నేరగాళ్ల కొత్త ఎత్తులు • కార్డు వివరాలు ఎవరి చేతికైనా దక్కితే అంతే • అంతర్జాతీయ సైట్లలో కొనుగోళ్లతో టోపీ • పట్టుకునే యంత్రాంగం పోలీసులకూ లేదు • బ్యాంకులు బ్లాక్ చేసినా... నష్టం కస్టమర్‌కే • ఇక మొబైల్ లావాదేవీల్లో మరింత జాగ్రత్త • వాలెట్లలో పరిమితంగా డబ్బులు వేస్తే సరి • మొబైల్ పోతే నష్టం ఆ మొత్తానికే పరిమితం • అన్నిటికన్నా ముఖ్యం... నెట్‌పై అవగాహన దేశమంతా ఇంటర్నెట్, మొబైల్ లావాదేవీలవైపు మళ్లాల్సిందేనని చెబుతోంది ప్రభుత్వం. దానిపై భారీ ప్రచారమూ మొదలెట్టింది. జనం కూడా కష్టంగానైనా అలవాటు పడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రయాణంలో ఇబ్బందులు అంత తేలిగ్గా సమసిపోయేవి కావు. నోట్ల రద్దుకు ముందు జనానికి సంబంధించి జరగాల్సిన కసరత్తేదీ జరగకపోవటంతో... వారు ఇంటర్నెట్ను అలవాటు చేసుకోవటానికి, లావాదేవీల్ని భద్రంగా జరపటానికి చాలా కాలమే పట్టొచ్చు. మరి ఈ లోపు «భద్రతో..? అది గాలిలో దీపమే!!. ఎందుకంటే మెజారిటీ జనానికి ఇప్పటికీ ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ఉన్నవారిలో కూడా మెజారిటీ ప్రజలకు దాంతో భద్రంగా లావాదేవీలు ఎలా జరపాలో తెలియదు. ఇక తెలిసిన అతి కొద్ది మందిని సైతం ముంచేయటానికి నేరగాళ్లు రకరకాల ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. కొన్ని రకాల మోసాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే ఈ కథనం... – సాక్షి, బిజినెస్ బ్యూరో పోలీసులు పట్టించుకుంటారా? దాదాపు ఏడాది కిందట సురేష్ క్రెడిట్ కార్డు మోసానికి గురయ్యాడు. మాయగాళ్లు తన కార్డు ఉపయోగించి అమెజాన్ వెబ్సైట్లో దాదాపు రూ.49వేల విలువ చేసే వస్తువులు కొన్నారు. ఆ తరవాత మరికొన్ని సైట్లలో చెల్లింపులు కూడా చేశారు. దీనికి సంబంధించి సురేష్‌కు బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్ చేసి... కార్డు బ్లాక్ అయిందని, దాన్ని తొలగించడానికి ఫోన్‌కు వచ్చిన ‘కోడ్’ను చెప్పాలని అడగటంతో తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని చెప్పాడు. దాంతో మోసగాళ్ల పని ఈజీ అయింది. లావాదేవీ పూర్తయింది. వెంటనే మొబైల్‌కు సమాచారం రావటంతో అప్రమత్తమై... ఈ విషయమై తొలుత అమెజాన్‌కు ఫిర్యాదు చేశాడు. లావాదేవీ నంబరు, తన కార్డు నెంబరు చెప్పి... ఆ వస్తువు డెలివరీని ఆపేసి, డబ్బులు బ్యాంకుకు రిటర్న్ చేయాలని కోరాడు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు ఎస్బీఐ కార్డు సంస్థకూ విషయం చెప్పాడు. మరి జరిగిందేంటి? ⇔ తన వద్ద జరిగిన లావాదేవీని అమెజాన్ నిలుపు చేయలేదు. సరుకులు డెలివరీ అయిపోయాయి. సురేష్ కార్డు నుంచి రూ.49వేల మొత్తం కట్ అయిపోయింది. దీనిపై అమెజాన్‌ను అడిగితే... డెలివరీని నిలుపు చేసే అవకాశం తమకు లేదనేదే సమాధానం. నిజానికి అమెజాన్‌కు ఇలాంటి వ్యవహారాల్లో తమ కస్టమరే ప్రధానం. ఇక్కడ కస్టమరంటే మోసానికి గురైన వారు కాదు. లావాదేవీ జరిపిన వ్యక్తి. అందుకే అది లావాదేవీ నిలిపివేయలేదు. ⇔ పోలీసులు ఏం దర్యాప్తు చేశారోగానీ... ఇప్పటికీ అతీగతీ లేదు. ఆ మాయగాళ్లను పట్టుకున్నదీ లేదు. అయినా పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు రోజూ పదుల సంఖ్యలో వస్తూనే ఉంటాయి. వారి దగ్గర మాత్రం పరిమితమైన సిబ్బంది. అందుకే.... వాళ్లు ఫిర్యాదు తీసుకోవటానికే వెనకాడుతుంటారు. తీసుకునేటప్పుడే... పట్టుకోవటం కష్టమండీ!! అని చెబుతుంటారు కూడా. అదీ కథ. ⇔ ఇక బ్యాంకు మాత్రం అప్పటికప్పుడు ఆ కార్డును బ్లాక్ చేసి కొత్త కార్డు మంజూరు చేసింది. కానీ ఆ రూ.49 వేలు మాత్రం సురేషే భరించాల్సి ఉంటుందని చెప్పింది. ఎందుకంటే బ్యాంకు ఇలాంటి నష్టాల్ని భరించదు. కార్డు దారుల అజాగ్రత్త వల్లే ఇది జరిగిందంటూ బాధ్యతను వారిపైకి నెడుతుంది. కారణం... ఇలాంటి మోసాలు పెద్ద ఎత్తున జరుగుతుండటమే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇదంతా ఎందుకంటే... మన దగ్గర మోసగాళ్లకు తెలిసినన్ని ఎత్తులు మరెవరికీ తెలీవు. వారి దగ్గరున్న టెక్నాలజీ పోలీసులు, బ్యాంకుల వద్ద కూడా లేదంటే అతిశయోక్తి కాదు. మరి ఇలాంటివేవీ కట్టుదిట్టం చేయకుండా ఆన్లైన్ లావాదేవీలు చేయండని విపరీతమైన ప్రచారం మాత్రం చేస్తే సరిపోతుందా? మోసాల్ని అరికట్టే టెక్నాలజీని బ్యాంకులు అమలు చేయాల్సిన అవసరం లేదా? మోసం జరిగితే పట్టుకునే విధంగా తమ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం పోలీసులకు లేదా? ఇక మోసగాళ్లు ఎక్కువగా ఆన్లైన్ కొనుగోళ్ళే జరుపుతారు కనక వీటిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ–కామర్స్ సైట్లకు లేదా? ఇవన్నీ ప్రశ్నలే. అంతర్జాతీయ లావాదేవీలా...? అంతే!! ఏడాది కిందట మోసపోయిన సురేష్... ఆ తరవాత బ్యాంకు కొత్త కార్డు మంజూరు చేయటంతో తీసుకున్నాడు. అయితే మళ్లీ మోసపోయాడు. కెనడా గూస్ వెబ్సైట్లో 860.11 డాలర్ల విలువైన వస్తువుల్ని మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేశారంటూ సురేష్ మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు ఫోన్ చేశాడు. మీరేమైనా అంతర్జాతీయ లావాదేవీ చేశారా? అని బ్యాంకు సిబ్బంది అడగ్గా... తానెలాంటి లావాదేవీ చేయలేదని చెప్పగా... తక్షణం కార్డును బ్లాక్ చేస్తున్నామని, కొత్త కార్డు పంపిస్తామని బ్యాంకు పేర్కొంది. సురేష్ కార్డు వివరాలు కొట్టేసిన సదరు మోసగాడు అక్కడితో ఆగలేదు. వివిధ అంతర్జాతీయ వెబ్సైట్లలో లావాదేవీలు జరిపే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. కానీ కార్డు బ్లాక్ కావటంతో ఆ లావాదేవీలన్నీ తిరస్కరణకు గురవుతున్నట్లు సురేష్ మొబైల్‌కు దాదాపు 112 మెసేజ్లొచ్చాయి. అంటే!! సదరు మోసగాడు దాదాపు 112 సార్లు ప్రయత్నించాడన్న మాట. తక్షణం అప్రమత్తమైన సురేష్... కెనడా గూస్ వెబ్సైట్లో వారికో అభ్యర్థన పెట్డాడు. తాను మోసానికి గురయ్యానని, తన కార్డు వివరాలతో ఓ మోసగాడు 860.11 డాలర్ల విలువైన లావాదేవీ జరిపాడని, దాని డెలివరీని నిలుపు చేసి... ఆ మొత్తాన్ని బ్యాంకుకు బదలాయించాలని కోరాడు. నిజానికి ముందే చెప్పినట్టు ఏ ఈ–కామర్స్ సంస్థకైనా తన కస్టమరు ముఖ్యం. మోసాన్ని అడ్డుకోవటం, లావాదేవీని నిలుపు చేయటం తమ పని కాదని, అలాంటివి తమ చేతుల్లో లేవని ఓ ఈ–కామర్స్ నిర్వాహకుడు చెప్పారు. ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే..! 1. కార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ వేరెవ్వరికీ ఇవ్వకండి. ఏ బంకులోనో, హోటల్లోనో బిల్లు చెల్లించాల్సి వస్తే... పీఓఎస్ యంత్రాన్ని మీ దగ్గరికే తీసుకుని రమ్మనండి. దానిపై పిన్ ఎంటర్ చేసి, మీ సమక్షంలోనే లావాదేవీ మొత్తం పూర్తయ్యేలా చూసుకోండి. 2. ఆన్లైన్ లావాదేవీలకు ఆఫీసు ఇంటర్నెట్గానీ, పబ్లిక్ వైఫై గానీ ఉపయోగించవచ్చు. సైబర్ కేఫ్‌లలో ఆన్లైన్ లావాదేవీలు జరపటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. మీరు లావాదేవీ జరిపే సిస్టమ్‌లో కుకీలు మీ డేటాను స్టోర్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. 3. మీ కార్డు వెనకవైపు మూడు సంఖ్యల సీవీవీ ఉంటుంది. అది వేరెవ్వరికీ తెలియకుండా... కార్డు మీ చేతికి రాగానే దాన్ని చెరిపేయండి. చెరపటం సాధ్యం కాకపోతే... కనీసం మార్కర్‌తో దాన్ని కొట్టివేయటం మంచిది. కాకపోతే ఇలా చేసే ముందు ఆ మూడు నెంబర్లను మీరు గుర్తు పెట్టుకోవాలి సుమా!! ఈ మోసమెలా జరిగి ఉండొచ్చు? నిజానికి ఈ లావాదేవీకి సంబంధించి సురేష్ మొబైల్‌కు ఓటీపీ రావటం గానీ, నేరగాడు సంప్రదించటం కానీ ఏమీ జరగలేదు. మరి ఇది ఎలా జరిగి ఉండొచ్చు? ఈ విషయమై కొందరు సైబర్ నేరాల నిపుణుల అభిప్రాయం ఏమిటంటే.. ‘‘అంతర్జాతీయ వెబ్సైట్లలో లావాదేవీలు జరిపేటపుడు చాలా సైట్లు ఓటీపీ, పిన్ వంటివి అడగటం లేదు. కార్డు నెంబరు, ఎక్స్పైరీ తేదీ, వెనకాల ఉండే మూడు సంఖ్యల సీవీవీ తెలిస్తే చాలు. అంతర్జాతీయ సైట్లలో లావాదేవీలు ముగించేయొచ్చు. బహుశా! కార్డు దారు ఏ పెట్రోల్ బంకులోనో, హోటల్లోనో బిల్లు చెల్లించేటపుడు వారికి కార్డు ఇచ్చి ఉండొచ్చు. వారు ఆ వివరాలు కాపీ చేసుకుని.... వాటి సాయంతో ఈ లావాదేవీ జరిపి ఉండొచ్చు’’ అని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిపుణుడు తెలియజేశారు. ‘‘మోసగాడు ఇక్కడే ఉంటాడు. ఏ కెనడా వెబ్సైట్లోనో, అమెరికా చిరునామా ఇచ్చి కొనుగోలు చేస్తాడు. 860 డాలర్ల కోసం పోలీసులో, మరో దర్యాప్తు సంస్థో అమెరికా వెళ్లలేదు కదా? అమెరికాలో డెలివరీ అయిన ప్రాంతాన్ని పట్టుకుని, వివరాలు సేకరిస్తే ఎవరు చేశారన్నది తెలిసిపోతుంది. కానీ అలా చేయరన్నదే ఈ అంతర్జాతీయ ముఠాల ధైర్యం’’ అని ఆయన వివరించారు. కార్డుదారు ఏ ఆన్లైన్ సంస్థలోనో లావాదేవీ జరిపినపుడు ఆ వివరాలను టెక్నాలజీ సాయంతో మోసగాళ్లు చేజిక్కించుకుని ఉండే అవకాశం ఉంది.