breaking news
MLA kishanreddy
-
టీఆర్ఎస్ది ఆర్భాటమెక్కువ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ.. ఆలోచన తక్కువ అన్నట్లు తయారైందని బీజేపీ శాసనసబాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ తమ పథకాలుగా చెప్పకుంటూ.. గొప్పలకుపోవడం తప్ప చేసిందేమీలేదన్నారు. కరీంనగర్‌లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నాలుగు పథకాలపై దృష్టిపెట్టి దేశమంతటా అమలు చేస్తుంటే, తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలనే ఉద్దేశంతో వరికి రూ.200, పత్తికి రూ.1000 చొప్పున పెంచితే.. ఆ ధరలకు కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్ఎస్ అని మండిపడ్డారు. పంటలబీమా పథకంపై ప్రచారం నిర్వహించకపోవడంతో రూ.55లక్షలపైచిలుకు ఉన్న రైతుల్లో కేవలం 5లక్షల మంది మాత్రమే వినియోగించుకున్నారని, దీనికి రాష్ట్రప్రభుత్వం విధానాలే కారణమని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటివరకు రేషన్ కార్డు ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. కార్డులపై కేంద్రప్రభుత్వం లోగో పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే ప్రింట్ చేయడంలేదన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి లేకుండాపోయిందన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించలేకపోతున్నాం కాబట్టి ప్రత్యేక అధికారుల ద్వారా పంచాయతీల పాలన చేస్తామని మంత్రివర్గం నిర్ణయించడం బాధాకరమన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికలు వాయిదా పడేలా ప్రభుత్వమే ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎన్నికలు వాయిదా పంచాయతీ రాజ్ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. గతంలో సర్పంచ్‌లకే పర్సన్ ఇన్చార్జిలుగా పదవీకాలం పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నాలుగేళ్లయినా డీఆర్సీ లేకపోవడం, జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు లేకపోవడం, ప్లానింగ్బోర్డుపై స్పష్టత లేని దుస్థితి నెలకొందన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా పరిపాలన జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం అన్ని తామై పనిచేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో బోనాల పండుగ జరిగితే ఆహ్వాన పత్రికపై స్థానిక ఎంపీ బండారు దత్తాత్రేయ ఫొటో లేదని, అదే వేరేజిల్లా ఎంపీ కవిత ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటన జరిగి సంవత్సరం పూర్తయినా దళితులపై దాడులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోలేదని, ఇసుక అక్రమ రవాణా, లారీలు ప్రాణాలు తీసే సంఘటనలు ఇప్పటికీ ఆగలేదన్నారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానంతో న్యాయం గురించి ఆలోచించడంలేదన్నారు. ఎస్సీ కమిషన్ వచ్చి నేరెల్ల ఘటనపై ఆదేశించినా దౌర్జన్యాలు ఆగడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీఆర్ఎస్కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర నాయకులు కోమల్ల ఆంజనేయులు, కొరివి వేణుగోపాల్, మీస అర్జున్‌రావు, సుజాత రెడ్డి, గాజుల స్వప్న, సుశీల, బేతి మహెందర్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, గుడిపాటి జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం కరీంనగర్‌సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పీఠం కదిలి కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలో కమలం జెండా వికసించడం ఖాయమని అన్నారు. నగరంలోని వైశ్యభవన్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పలు పార్టీలు, కుల సంఘాల ముఖ్యనాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం సాగింది. బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దేశవ్యాప్తంగా పెనుమార్పులకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించిందన్నారు. నాలుగేళ్ల ఎన్డీయే హయాంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకపోవడం నీతివంతమైన పాలనకు నిదర్శనమన్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియా ఆగడాలకు అనేకమంది బలైనా, పోలీసుల దాష్టికానికి పదుల సంఖ్యలో యువత జీవచ్ఛవాలుగా మారినా రాహుల్‌గాందీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో తాము అభివృద్ధిపథంలో పయనిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తూ తన కుటుంబ అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరటాల శివరామకృష్ణ, ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు అనూప్, విశ్వబ్రాహ్మణ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్, శాతవాహన ఆటో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కిసాన్‌నగర్ మిత్ర మండలి సభ్యులు, మెడికల్ రిప్స్, పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితోపాటు నాయకులు బాస సత్యనారాయణరావు, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి సుజాతరెడ్డి, సాయికృష్ణారెడ్డి, గణపతి, వెంకట్‌రెడ్డి, కొట్టె మురళీకృష్ణ, బోయినిపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు. -
మోదీ సారథ్యంలో సమగ్ర ప్రగతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అఫ్జల్‌గంజ్: ప్రపంచ దేశాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైపే చూస్తున్నాయని, దేశ సమగ్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గౌలిగూడ మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో ‘నవీన పథంలో ప్రగతి’ ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఇలాంటి ప్రదర్శనలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14 నుంచి ‘ఇ-మండి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. రైతుల కోసం ప్రధానమంత్రి పసల్ బీమా యోజనను తీసుకువచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగానికి కోతలు లేని విద్యుత్‌ను అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించిందన్నారు. కేంద్రం చర్యలతో నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు దూరమయ్యాయని వివరించారు. అంబేద్కర్ జన్మించిన గ్రామాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారని తెలిపారు. అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు కీలక స్మారక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార కార్యాలయం డెరైక్టర్, క్షేత్ర ప్రచార అధికారిణి కృష్ణవందన, అసిస్టెంట్ మాంకాళి శ్రీనివాస్, ఎంజీబీఎస్ స్టాల్ అసోసియేషన్ అధ్యక్షులు జి. నరేందర్ యాదవ్, బీజేపీ మజ్దూర్ మోర్చా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వై.కృష్ణ, హాకర్స్ సెల్ కన్వీనర్ మహేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం
కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసింది : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత బీజేపీపైనే ఉందని, కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) కార్యవర్గ సమావేశం శనివారం జీడిమెట్ల సరోజిని గార్డెన్లో నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న హడావిడిలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం సిగ్గు చేటన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాపథం నిర్వహించినప్పుడు అందరికి సమాచారం ఇచ్చే వారని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం పార్టీ కార్యక్రమంలాగానే అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర ఇన్చార్జ్ ప్రదీప్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, దీపక్ జన్‌ఖండ్, భరతసింహారెడ్డి, వారాల మహేష్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వాన్ని వీడాలనీ అంబర్‌పేట నియోజక వర్గం ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను హెచ్చరించారు. నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా నత్త నడకన సాగుతున్నాయని... వెంటనే వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివారం పాత నల్లకుంట ప్రాంతంలో కిషన్‌రెడ్డి జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలసి పాదయాత్ర చేశారు. బస్తీలు, కాలనీల్లో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే దర్శనమివ్వడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లకు ప్యాచ్‌వర్క్స్ చేపట్టడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కలుషిత నీటిపై ప్రజలు ఫిర్యాదు చేయగా తక్షణమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, పరిశుద్ధమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ స్థానిక నేతలు పలువురు కూడా ఉన్నారు.