breaking news
MLA bode Prasad
-
మద్దూరులో ఇసుక రగడ
కంకిపాడు : మద్దూరు క్వారీలో ఇసుక తవ్వకాలకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులతోపాటు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్గీయులు యత్నించారు. నెహ్రూ వర్గీయులకు స్థానిక మత్య్సకారులు మద్దతుగా నిలిచారు. దీంతో ఇసుక క్వారీ వద్ద మంగళవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు మండలం చోడవరం ఇసుక క్వారీ మూసివేతతో నెహ్రూ వర్గీయులు రెండు పొక్లెయిన్లను సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్దూరుకు చేర్చారు. ఈ క్రమంలోనే స్థానిక టీడీపీ నాయకులు పొక్లెయిన్లను దించొద్దంటూ అడ్డుకున్నారు. మత్స్యకారులు, ఇసుక క్వారీ కార్మికుల మద్దతుతో పొక్లెయిన్లను క్వారీలోకి దించారు. మంగళవారం ఉదయం క్వారీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా టీడీపీ నేతలు, బోడె ప్రసాద్ అనుచరులు, స్థానికుల మద్దతుతో క్వారీలోకి వెళ్లకుండా యంత్రాలను అడ్డుకున్నారు. క్వారీలోకి దారి బాగుచేసుకున్నామని, శాండ్ వర్కర్స్ సొసైటీ పేరున తవ్వకాలు జరుపుతున్నామని టీడీపీ వర్గం స్పష్టంచేసింది. ఉచిత ఇసుక విధానం ప్రకటించాక ఇదేమిటని స్థానిక క్వారీ కార్మికులు, నెహ్రూ వర్గీయులు ప్రశ్నించారు. దీంతో కరకట్టపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్ఐ హనీష్‌లు ఇరువర్గాలతోనూ విడివిడిగా చర్చించారు. సీనియర్ అసిస్టెంట్ వి. శ్రీనివాసరావు గ్రామానికి వచ్చి క్వారీ రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ అవసరాలకు అనుమతులు ఉన్న పొక్లెయిన్లతో మాత్రమే తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. బహిరంగ మార్కెట్లోకి ఇసుక ప్రభుత్వ అవసరాల పేరుతో వందల కొద్దీ లారీల ఇసుక బహిరంగ మార్కెట్లోకి వెళుతోందని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని క్వారీ కార్మికులు ఆరోపించారు. లారీల నుంచి అక్రమంగా సొమ్ము వసూలు చేస్తున్నారని, డ్రెవర్లను కొడుతున్నారంటూ ఫిర్యాదుచేశారు. ఫ్రీ ఇసుక పేరుతో ఎమ్మెల్యే దందా చేస్తున్నారంటూ నెహ్రూ వర్గీయులు పోలీసు అధికారుల వద్దే ఆరోపణలు చేశారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు నిర్ధారించిన నంబర్ల ఆధారంగా లారీలను మాత్రమే లోడింగ్‌కు పంపేలా చర్యలు తీసుకున్నామన్నారు. బయటి వాహనాలతో కూడా లోడింగ్ జరుగుతున్నట్లు ఆరోపిస్తున్నారు కాబట్టి ఉన్నతాధికారులు నుంచి మార్గదర్శకాలు వచ్చే వరకు క్వారీని మూసివేస్తున్నామని ప్రకటిస్తూ క్వారీలోకి వెళ్లే మార్గానికి ఉన్న గేటును మూయించారు. ఉత్తర్వులు ఇలా.. ఏప్రిల్ 14 నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో సాగిన ఆందోళనలతో మే 11నుంచి క్వారీ కార్మికులు కూడా తవ్వుకునేందుకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ అవసరాలకు యంత్రాలతోనూ, వ్యక్తిగత అవసరాలకు కూలీలతోనూ లోడింగ్ చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. బారులు తీరిన లారీలు క్వారీలో లోడింగ్ నిలిచి పోవడంతో మద్దూరు ప్రాంతంలో లారీలు భారీగా నిలిచిపోయాయి. కరకట్ట పొడవునా, మద్దూరు గ్రామంలోకి వెళ్లే మార్గం లోనూ లారీలు, ట్రాక్టర్లు, పెద్ద లారీలు బారు లు దీరాయి. ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు కానీ ఇక్కడ ఉన్న లారీల్లో అధిక భాగం బయటి మార్కెట్లోకి వెళ్లే లారీలు ఉన్న విషయం స్పష్టమైంది. -
ఇసుక దుమారం
అక్రమ తరలింపుపై నిలదీసిన వైఎస్సార్ సీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ పోడియం వద్ద విపక్షం బైఠాయింపు వాడీవేడిగా జెడ్పీ సమావేశం ‘సిగ్గు లేకుండా గాలి మాటలు మాట్లాడుతున్నారు.. ఆ ఊరికి వెళ్లండి.. జనం మిమ్మల్ని రాళ్లతో కొడతారు. మీకు ప్రజల సమస్యలతో పనిలేదు. మిమ్మల్ని జైలులో పెట్టాల్సిందే.. పదేళ్లుగా దోచుకున్నారు..’ అంటూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జెడ్పీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యనమలకుదురు రీచ్ నుంచి ఇసుక అక్రమ తరలింపుపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకురాలు తాతినేని పద్మావతి నిలదీసినప్పుడు సమావేశంలో గందరగోళం నెలకొంది. అప్పడు బోడే ప్రసాద్ చేసిన పై వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన మంగళవారం జరిగింది. గ్రామీణాభివృద్ధి శాఖపై చర్చ జరిగినప్పుడు జెడ్పీలో ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ యనమలకుదురు ఇసుకరేవు నుంచి ఇసుకను అక్రమంగా తొలగించి పెనమలూరులో 50 రోడ్లు నిర్మించారన్నారు. దీనిపై కథనం ఓ పత్రికలో వచ్చిందంటూ ఆ పత్రికను చూపారు. యనమలకుదురు ఇసుక రేవుకు అనుమతి ఉందో, లేదో చెప్పాలని కలెక్టర్‌ను నిలదీశారు. ప్రభుత్వంతో పనిలేకుండా కమిటీ పేరుతో రోడ్ల నిర్మాణానికంటూ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించారన్నారు. ఆ సమయంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళాసభ్యులపై దూషణకు దిగిన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు సభను జరగనివ్వబోమంటూ ఆమెపాటు పలువురు మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించారు. దీనికి బోడే ప్రసాద్.. తాను మహిళా సభ్యులను సిగ్గు లేదని అనలేదని, అన్నట్లు భావిస్తే సారీ.. అని చెప్పారు. దీంతో సభ్యులు పోడియం వద్ద నుంచి నిష్ర్కమించారు. ఆ తర్వాత బోడే ప్రసాద్ పత్రికలో వచ్చిన కథనాన్ని సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం ఆయన కాల్‌మనీ వ్యవహారంపై మాట్లాడతానని కోరారు. దానికి మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కంచి రామారావు జిల్లా పరిషత్‌లో ప్రజాసమస్యలపై చర్చించాలని, ఒక్కొక్కసారి సభ జరుగుతున్న తీరు చూస్తుంటే తాము ఇలాంటి సంఘటనలు చూడటానికే బతికున్నామా అనే బాధ కలుగుతోందన్నారు. అవినీతి రుజువు చేయండి: మంత్రి రవీంద్ర పింఛన్లు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని, ఎక్కడైనా అవినీతి జరిగితే ఆధారాలతో రుజువు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇసుక క్వారీలను డ్వాక్రా సంఘాలకు అప్పగించడంతో కొంతమంది పనికట్టుకుని నిర్వీర్యం చేసిన మాట వాస్తవమన్నారు. ఎవరేం మాట్లాడారు.. ఠపింఛన్లు, నూతన గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరులో జన్మభూమి కమిటీ సభ్యులను పక్కనపెట్టి ఎంపీడీవోలు, తహశీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు సంబంధించి కనీస సమాచారాన్ని అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు ఇవ్వటం లేదని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు మాట్లాడుతూ పశ్చిమకృష్ణాలోని మండలాలకు నాగార్జునసాగర్ నీటిని ఎప్పటికి విడుదల చేస్తారని ప్రశ్నించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేస్తామని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ త్వరితగతిన మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు.పుష్కరాల ఏర్పాట్లు, విద్యాశాఖపై సమీక్ష జరిగిన సమయంలో ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతన బడ్జెట్‌ను తీసుకురావడంలో డీఈవో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. డీఈవో కార్యాలయ ఉద్యోగులు 20 సంవత్సరాలుగా ఒకే సీటులో పనిచేస్తున్నారని, డీఈవో కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇసుక రీచ్‌ల వ్యవహారంపై కలెక్టర్ దృష్టిసారించి అక్రమాలను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపాలన్నారు.