breaking news
Ministering
-
అక్రమాల అంతస్తులు ఉల్లంఘనులు !
- ఆర్మూర్‌లో అపార్ట్మెంట్ల జోరు - నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు - అగ్నిమాపక శాఖ అనుమతులకు మంగళం - పట్టించుకోని అధికారగణం, షోకాజ్లతో సరి.. - అక్రమాల బాగోతం వెనుక భారీ మంత్రాంగం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్‌లో అక్రమ బహుళ అంతస్థుల (అపార్ట్మెంట్ల్) నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలను ఏ మాత్రం లెక్కచేయకుండా ఈ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కొందరు నిర్మాణదారులు అధికారులను సైతం బుట్టలో వేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఈ నిర్మాణాల జోరు పెంచారు. రోజు రోజుకు విస్తరిస్తున్న ఆర్మూర్ పట్టణంలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. సెట్బ్యాక్లు వదలకుండా.. కనీసం అగ్నిమాపకశాఖ అనుమతులు సైతం లేకుండా నిర్మిస్తున్నారు. నివాస గృహాల పేరిట అనుమతి పొంది ఏకంగా వ్యాపార సముదాయాలను కట్టేస్తున్నారు. ఆర్మూరు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా మంతని బ్లాక్ పేరిట నివాసగృహాల సముదాయూనికి అనుమతి పొంది ఏకంగా 150 మడిగెల వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన ఓ మాజీ కార్పొరేటర్‌కు 10 శాతం వాటా ఇవ్వడం అప్పట్లో ఆర్మూరులో చర్చనీయాంశమైయింది. మామిడిపల్లి చౌరస్తా దగ్గర నీటి పారుదలశాఖ స్థలాన్ని కొంత ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్‌తో కూడిన ఓ అపార్టుమెంట్ నిర్మించడం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఇంత జరుగుతున్నా... ఇటు మున్సిపల్, అటు పంచాయతీ అధికారుల పనితీరు నామమాత్రంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పరిస్థితి... ఆర్మూర్ పట్టణంలోని అక్రమ నిర్మాణాల జోరు ఆందోళనకరంగా ఉంది. నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం, భవిష్యత్తు జాగ్రత్తలపై కూడా కనీసం ముందుచూపు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు నోటీసులతో సరిపుచ్చారు తప్ప చర్యలేమీ లేవు. ఆర్మూర్ పట్టణంలో మొదలైన ఈ సంస్కృతి పక్కనే ఉన్న పెర్కిట్ గ్రామ పంచాయతీకి కూడా విస్తరించింది. పెర్కిట్ పరిధిలో నివాస గృహాల నిర్మాణాలు వేగంగా పెరుగుతున్నాయి. అలాగే ఆపార్ట్మెంట్లు సైతం నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎనిమిది అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటీ నిబంధనలకు అనుగుణంగా లేవు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో జీ ప్లస్-2కు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇక్కడ 5, 6 అంతస్తుల వరకు నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో మూడవ అంతస్తు పైబడి ఏ ఒక్క అపార్ట్‌మెంట్‌కూ అనుమతి లేదు. అపార్టమెంట్ కింద సెల్లార్లకు బదులు కొన్నింటిలో దుకాణాలను ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రతి అపార్ట్‌మెంట్‌కు సెల్లార్ పక్కన ప్రత్యేకంగా స్థలం వదిలిపెట్టారు. కానీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. నిర్మాణాల జోరు పెంచేసి విక్రయాలు కూడా చేపట్టారు. ముడుపుల బాగోతం... అపార్టుమెంట్ల అక్రమ నిర్మాణం వెనుక ముడుపుల బాగోతం కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నారుు. ఒక అపార్ట్మెంట్ నిర్మాణం వెనుక సంబంధిత అనుమతిదారులకు నిర్మాణదారులు ఒక ఫ్లాట్‌ను నజరానాగా ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యహరించడంలో పరమార్థం ఇదే అంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్థానికులు, మరికొందరు అక్రమ నిర్మాణాలపై గ్రామ పంచాయతీకి పలుమార్లు ఫిర్యాదు చేసినా.. స్పందించిన దాఖలాలు లేవు. ముడుపులు అందుకొని అక్రమ నిర్మాణాల వైపు చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు వరంగా మారాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ముడుపులు ముట్టచెపుతున్నామని రియల్ఎస్టేట్ వ్యాపారులే ఖర్చుల ఖాతాలో చూపుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారి చిరునామాను అక్రమ నిర్మాణదారులకు చేరవేసి.. ఫిర్యాదు వెనక్కి తీసుకొనేలా అధికారులే చేయడం గమనార్హం. వేల్పూరు రోడ్డులో చేపట్టిన రెండు అపార్టుమెంట్ల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీనిపై స్థానికంగా కొందరు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయగా, వారినే అధికారులు నిర్మాణదారులతో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డి మాండ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ని ర్మించాలని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందు లు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ... ఎక్స్ అఫీషియో మంత్రాంగం..
ఆమదాలవలస: ఇప్పటివరకూ ఎప్పుడా ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నేటితో పురపాలక చైర్పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. ఆమదాలవలస పురపాలక సంఘంలో చైర్పర్సన్ ఎన్నిక జిల్లా అధికారుల సమక్షంలో కమిషనర్ ఎన్.నూకేశ్వరావు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో వెలువడిన పుర ఫలితాలలో వైఎస్సార్సీపీ-10, టీడీపీ-8, కాంగ్రెస్-3, స్వతంత్రులు 2 స్థానాలు కైవసం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. మున్సిపాలిటి ఏర్పడిన దగ్గర నుంచి బొడ్డేపల్లి కుంటుంబీకులకే పట్టణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు వైసీపీలో ఫలితాలు వెలువడకముందే చేరారు. మరొకరు ఫలితాల అనంతరం టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతా కుమారి, టీడీపీ అభ్యర్థిగా తమ్మినేని గీతను ఎన్నికలముందే ప్రకటించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ప్రకటించడంతో మరలా బొడ్డేపల్లి కుటుంబానిదే చైర్పర్సన్ కుర్చి అని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు ఎలాగైనా గెలిచిన ఇతర పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లపై టీడీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఎవరికీ మద్దతు తెలుపుతారో అనే అంశంపైనే చైర్పర్సన్ ఎన్నిక ముడిపడి ఉందని పలువురు చెబుతున్నారు. మాట వినని కాంగ్రెస్ కౌన్సిలర్లు ... కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులరాలు బొడ్డేపల్లి సత్యవతి మాటలు వినడంలేదని సమాచారం. వీరు ఎవరికి మద్దతు పలుకుతారనేది కీలకం కానుంది. వీరు ఓటింగ్ సమయంలో హాజరుకాకుండా చూసే విధంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారు రాకపోతే టీడీపీదే పైచేయి అవుతుందని వారి నమ్మకం. ఎక్స్అఫిషియో ఓట్లతో గెలవాలనుకుంటున్న టీడీపీ... టీడీపీ నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఎక్స్అఫిసియో ఓట్లు ఆమదాలవలస మున్సిపాలిటీలో వినియోగించుకోనున్నారు. వీరి ముగ్గురు ఓట్లతో టీడీపీకి 12, వైఎస్సార్సీపీకి 11 ఓట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సెలర్ అభ్యర్థులు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తేనే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా చైర్పర్సన్ ఎంపిక గురించే చర్చ సాగుతోంది. మరి కొన్ని గంటల్లోనే ఈ చర్చకు తెరపడనుంది.