breaking news
Minister RV Deshpande
-
ఆటగాళ్లపై కిట్లను విసిరిన కర్ణాటక మంత్రి
న్యూఢిల్లీ: కర్ణాటక రెవిన్యూ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండే(71) వివాదంలో చిక్కుకున్నారు. ఆటగాళ్ల చేతికి స్పోర్ట్స్ కిట్లను అందించకుండా గాల్లోకి విసిరేసి పట్టుకోవాల్సిందిగా ఆయన సూచించారు. కర్ణాటకలో తన నియోజకవర్గం హలియాల్‌లో ఇండోర్ స్టేడియంను మంత్రి దేశ్‌పాండే బుధవారం ప్రారంభించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి అథ్లెట్లకు క్రీడా కిట్లను అందించాల్సిందిగా నిర్వాహకులు దేశ్‌పాండేను వేదికపైకి ఆహ్వానించారు. ఆటగాళ్లందరినీ ముందుకు రావాల్సిందిగా కోరిన మంత్రి.. మహారాజు తరహాలో వేదిక నుంచి ఆటగాళ్లపైకి కిట్లను విసిరేశారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అక్టోబర్‌లో రాష్ట్రానికి ‘చైనా పెట్టుబడిదారులు
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో రెడ్‌కార్పెట్ ‘హువాయి’ ఆర్ అండ్ డీ విభాగం ప్రారంభోత్సవంలో మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే బెంగళూరు: కర్ణాటకలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించే విధంగా ‘రెడ్ కార్పెట్’ స్వాగతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుకుతోందని రాష్ట్ర ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే తెలిపారు. చైనాకు చెందిన ప్రముఖ ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) రంగ సంస్థ హువాయి నగరంలో మొత్తం 20 ఎకరాల్లో 170 మిలియన్ల యూఎస్ డాలర్లతో నిర్మించిన ‘హువాయి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ క్యాంపస్’ను ఆర్.వి.దేశ్‌పాండే గురువారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....చైనాకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి చర్చించిందని చెప్పారు. కర్ణాటకలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సిద్ధరామయ్య ఆహ్వానించారని తెలిపారు. ఇందుకు స్పందించిన చైనా ప్రతినిధులు రానున్న అక్టోబర్‌లో తమ పారిశ్రామిక వేత్తల బృందంతో బెంగళూరు వస్తామని, అదే సమయంలో వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర మౌలిక సదుపాయల కల్పన, సమాచార శాఖ మంత్రి రోషన్‌బేగ్ మాట్లాడుతూ....దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వైట్‌ఫీల్డ్‌లోని ఐటీపీఎల్ ప్రాంతానికి చేరుకోవడానికి ట్రాఫిక్ కారణంగా ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. అందువల్ల ఐటీపీఎల్ నుంచి హెబ్బాళ ఫ్లై ఓవర్ వరకు ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మరిన్ని ఇండస్ట్రియల్ పార్క్‌ల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వీటి ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధిని కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ, హువాయి ఇండియా సీఓఓ విల్సన్ వాంగ్ తదితరులు పాల్గొన్నారు.