breaking news
Minister Lakshmaredy
-
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
వడదెబ్బపై అప్రమత్తం
♦ ఉన్నతాధికారులతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి అత్యవసర చర్చ ♦ ఆసుపత్రుల్లో వడదెబ్బ చికిత్సలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం ♦ మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయండి ♦ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన సాక్షి, హైదరాబాద్: మండే ఎండలకు రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారి జనం వడదెబ్బ బారిన పడుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. వడదెబ్బ లక్షణాలతో వచ్చే వారికి వెంటనే చికిత్స అందేలా చూడాలని అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఏప్రిల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారు లతో గురువారం చర్చించారు. వడదెబ్బ లక్షణాలతో వచ్చేవారికి చికిత్స అందించేం దుకు అవసరమైన మందులు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సెలైన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏయే ఆసుపత్రుల్లో కొరత ఉందో తెలుసుకుని వెంటనే అందుబా టులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా తెలియజెప్పాలని పేర్కొన్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష.. సాధారణంగా 35–36 డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలుగుతామని, ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని తెలిపారు. ‘37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే శరీరంలో వేడిని తట్టుకోవడానికి గుండె, రక్తనాళాలు, స్వేద గ్రంథులు సాధారణం కంటే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, నాలుక తడారిపోతుండటం, శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోవడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరడం వంటి లక్షణాలు వడదెబ్బకు సూచికలు. చెమట వల్ల శరీరం ఉప్పు శాతాన్ని కోల్పోయి తలనొప్పి, కళ్లు తిరగడం, వికారం, వాంతులు వంటివి సంభవిస్తాయి. కొంతమందిలో ఒంటి నొప్పులు, తిమ్మిర్లు కూడా ఏర్పడతాయి. శరీరం వేడెక్కినా, రక్తపోటు తగ్గినా, మానసిక గందరగోళానికి గురైనా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి’ అని తెలిపారు. ఈ మేరకు మంత్రి లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఇవీ పాటించాల్సిన సూచనలు.. ♦ వడదెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి తరలించాలి. శరీరాన్ని తడి బట్టతో తుడుస్తూ చల్లబడేలా చేయాలి. ♦ ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోస్, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. ♦ ఇలా ప్రథమ చికిత్స చేసిన వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. ♦ ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకపోవటమే ఉత్తమం. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకునే వెళ్లాలి. ♦ గొడుగు, టోపీ వంటివి వినియోగించాలి. ముదురు రంగు దుస్తులు ధరించవద్దు. వీలైనంత వరకు కాటన్ వస్త్రాలే ధరించాలి. ♦ వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిది. ♦ కాఫీ, టీ, ఆల్కహాలుకు దూరంగా ఉంటే మంచిది. ♦ కూలీలు ఎండ సమయంలో పనులకు వెళ్లవద్దు. ఉపాధి హామీ పనుల్లో ఉండేవారు ఉదయం, సాయంత్రం వేళల్లోనే పనులు చేయాలి. 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరోవైపు గురువారం పలు జిల్లా కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యా యి. ఆదిలాబాద్, నల్లగొండల్లో అత్యధికంగా 43 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్, మెదక్లలో 43 డిగ్రీలకు కాస్త తక్కువగా, రాజధాని హైదరాబాద్లో 42 డిగ్రీలు నమోద య్యాయి. దీంతో జనం రోడ్లపైకి రావడానికే జంకారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారు లన్నీ జనసంచారం లేక పూర్తిగా బోసిపోయా యి. కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వందల మంది వడ దెబ్బకు గురవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వడగాడ్పుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.