breaking news
Minister Jayant Sinha
-
ఎంఎస్ఎంఈలకు నిధుల కోసం ఎల్ఐసీతో సిడ్బి ఒప్పందం
హైదరాబాద్: స్టార్టప్‌లు, లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రోత్సాహామివ్వడానికి ఎల్ఐసీతో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బి) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందని సిడ్బి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్ఐసీతో కలిసి ఒక నిధిని (ఫండ్) ఏర్పాటు చేస్తామని సిడ్బి సీఎండీ శివాజీ పేర్కొన్నారు. మరోవంక గత రెండు దశాబ్దాలుగా వెంచర్ ఫండ్స్‌కు తోడ్పాటునందిస్తున్నట్లు ఎల్ఐసీ చైర్మన్ తెలిపారు. -
ఈ-కామర్స్ వార్షిక వృద్ధి 10-15%
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ వార్షిక వృద్ధి రేటు 10-15 శాతం మధ్యలో ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఎక్స్‌ప్రెస్ ఇండస్ట్రి కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఐసీఐ) సమావేశంలో మాట్లాడారు.. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి దిశగా పయనిస్తే, ఈ-కామర్స్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అసోచామ్-డెలాయిట్ సర్వే ప్రకారం..ఈ-కామర్స్ రంగం 2015 చివరకు 16 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2010లో 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ రంగం 2014 చివరకు 13.6 బిలియన్ డాలర్లకు చేరింది. -
జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం సమావేశమయ్యారు. దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జైట్లీతో పాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులతో రాజన్ సమావేశమయ్యారు.రైతులకు రుణ పునర్వ్యవస్థీకరణ: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల రుణ పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు తాను సూచించినట్లు రాజన్ చెప్పారు. అంతక్రితం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని (రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకులకు సూచన) వెల్లడించారు. అకాల వర్షాల వల్ల రబీ సాగు పరిధిలో 17% పంట నష్టం జరిగినట్లు మంగళవారంనాటి ఆర్బీఐ విధాన ప్రకటన పేర్కొంది. మరోవంక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ బుధవారం నోటిఫై చేసింది. -
4 పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన నాలుగు సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ (సీసీఈఏ) ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు తెలిపారు. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 22,574 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, నాల్కో, బీహెచ్ఈఎల్ సంస్థలు ఉన్నాయి. ఓఎన్జీసీలో 5 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 13,217 కోట్లు, ఎన్ఎండీసీ, నాల్కోల్లో చెరి పది శాతం వాటాల విక్రయంతో మొత్తం రూ. 6,228 కోట్లు, బీహెచ్ఈఎల్లో 5 శాతం వాటాల విక్రయంతో రూ. 3,129 కోట్లు, రాగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. -
బ్యాంకింగ్ సంస్కరణలే లక్ష్యం
జ్ఞాన సంగం సదస్సులో విస్తృతస్థాయిలో చర్చలు మొండి బకాయిలు, విలీనాలు తదితర ఆరు కీలక అంశాలపై దృష్టి సంస్కరణల బ్లూప్రింట్‌ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్న బ్యాంకింగ్ నిపుణులు పుణే: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా ‘జ్ఞాన సంగం’ సదస్సులో సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక(బ్లూప్రింట్) రూపుదిద్దుకుంటోంది. శుక్రవారమిక్కడ ప్రారంభమైన ఈ రెండు రోజుల సదస్సులో 100 మందికి పైగా బ్యాంకర్లు, నిపుణులు విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సంస్కరణల బ్లూప్రింట్‌ను నేడు ప్రధాని మోదీకి సమర్పించనున్నారు. పీఎస్‌యూ బ్యాంకుల సీఎండీలు, ఆర్బీఐ అధికారులు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న మొండిబకాయిలు(ఎన్పీఏలు), రుణ వృద్ధి మందగించడం, బ్యాంకుల మధ్య విలీనాలు, కొనుగోళ్లు(కన్సాలిడేషన్) వంటి కీలక అంశాలపై తగిన పరిష్కార మార్గాల కోసం విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), టెక్నాలజీ సద్వినియోగం, ప్రాధాన్య రంగ రుణాలు, రిస్క్ మేనేజ్మెంట్, పీఎస్‌యూలకు తగిన వ్యూహాల రూపకల్పన, కన్సాలిడేషన్లపై ఆరు ప్రత్యేక గ్రూపు లు నివేదికలను తయారు చేయనున్నాయని.. వీటిని నేడు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించనున్నట్లు చెప్పారు. ఇదో గొప్ప అవకాశం... ఈ సదస్సును ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రారంభించారు. తమ ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, అదేవిధంగా వ్యాపారాలకూ అనుకూలంగా వ్యవహరిస్తుందని చెబుతూ... బ్యాంకులు కూడా ఇదేవిధమైన ధోరణితో ముందుకెళ్లాలని చెప్పారు. తమ వ్యాపారాన్ని లాభదాయకంగా నిర్వహించుకుంటూ నే... పేద ప్రజలు, సామాజిక రంగాలకు కూడా చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని సిన్హా వ్యాఖ్యానించారు. భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు నిలకడగా 7-8 శాతం మేర కొనసాగడానికి తగిన సలహాలు, సూచనలను బ్యాంకర్ల నుంచి ఆయన ఆహ్వానించారు. సదస్సులో ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఇండియన్ బ్యాంక్ సీఎండీ టీఎం బాసిన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ వీఆర్ అయ్యర్, కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ ఎస్ఆర్ బన్సల్ తదితర బ్యాంకుల అధిపతులతోపాటు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ చైర్మన్ టీఎస్ విజయన్, పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ(పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్, ఆర్బీఐ డీప్యూటీ గవర్నర్లు హాజరయ్యారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నేడు చర్చల్లో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సదస్సు ముగింపు ప్రసంగం చేయనున్నారు. కాగా, వచ్చే 10-15 ఏళ్లలో దేశ ఫైనాన్షియల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఈ వినూత్న వర్క్‌షాప్ ఒక అద్భుత అవకాశాన్ని కల్పించిందని సిన్హా వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో సంస్కరణలను తక్షణం, వేగంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. విలీనాలొక్కటే మార్గం కాదు... పీఎస్‌యూ బ్యాంకుల బలోపేతానికి విలీనాలు, కొనుగోళ్లు ఒక్కటే మార్గం కాదని అధియా పేర్కొన్నారు. మార్కెట్ నుంచి సులువుగా నిధులను సమీకరించేందుకు తగిన యంత్రాంగాన్ని రూపొందించుకోవడం ఇతరత్రా చర్యల ద్వారా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు కూడా మెరుగుపడతాయని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అధియా అభిప్రాయపడ్డారు. పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహించాలంటూ పలు నివేదికలు వచ్చినప్పటికీ.. ఈ కన్సాలిడేషన్ అంశం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 27 బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. కాగా, కన్సాలిడేషన్‌పై బ్యాంకుల నుంచి కొన్ని సూచనలు వచ్చాయని.. దీనిపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని అధియా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్య రంగ రుణాల(పీఎస్ఎల్) లక్ష్యాలకు సంబంధించి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది వ్యవసాయ రంగ వృద్ధికి ఇప్పుడు చాలా కీలకమైనది. అయితే, పీఎస్ఎల్లో ఈ రంగానికి చోటు లేదు’ అని అధియా ఉదహరించారు. కాగా, బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోవడంతో పాటు రుణాలకు డిమాండ్ తగ్గిపోవడం కూడా ఆందోళనకరమైన అంశమేనని అధియా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రుణ వృద్ధి కేవలం 5.2 శాతానికి పరిమితమైంది. 2014 సెప్టెంబర్ 30 నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏ) రూ.2.43 లక్షల కోట్లకు చేరాయి. టాప్ పోస్టులకు పైవేటు నిపుణులు! పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో చైర్మన్, సీఈఓ-ఎండీ పోస్టుల్లో ప్రైవేటు రంగ నిపుణులకు కూడా అవకాశం కల్పించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ పోస్టులకు ప్రైవేటు రంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే, ఈ మార్పులకు ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ(ఏసీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందని చెప్పారు. యాజమాన్యపరమైన సంస్కరణల్లో భాగంగా పీఎస్‌యూ బ్యాంకుల్లో సీఎండీ పోస్టులను సీఈఓ-ఎండీ, చైర్మన్‌గా ప్రభుత్వం ఇటీవలే విడదీసింది.