ఆరు వేల ఏనుగులు, 400 పులులు
దేశంలోనే ప్రథమ స్థానంలో కర్ణాటక
మాట్లాడుతున్న మంత్రి రామనాథ రై
బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అరణ్యాల్లో ప్రస్తుతం ఆరు వేల ఏనుగులు, నాలుగు వందలకు పైగా పులులు ఉన్నాయని, తద్వారా పులులు, ఏనుగుల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో కర్ణాటక నిలిచిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బి.రామనాథ రై వెల్లడించారు. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవలే వన్యజీవుల లెక్కింపు చేపట్టగా 400కు పైగా పులులు, ఆరు వేలకు పైగా ఏనుగులు ఉన్నట్లు తేలిందని అన్నారు. వన్యజీవులు సమృద్ధిగా ఉంటేనే అడవులు, ఆ ప్రాంతాలు పర్యావరణ సమతౌల్యంతో ఉండేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో వన్యప్రాణులు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయని, దీన్ని అడ్డుకునేందుకు గాను అటవీశాఖ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. అరణ్యాలను కాపాడుకుంటే వన్యజీవులు ఆ అడవులను వదిలి జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితే ఉండదని అభిప్రాయపడ్డారు.
వన్యజీవుల సంరక్షణ పట్ల మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని అభయారణ్యాల్లో ఉన్న పులులపై నిఘా ఉంచేందుకు గాను సీఎస్ఎస్ కార్ప్ సంస్థ 800 నిఘా కెమెరాలను ప్రభుత్వానికి అందజేసిందని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఇక జనావాసాలపై ఏనుగుల దాడుల నిరోధానికి గాను ఇప్పటికే కందకాల నిర్మాణం, రైల్వే పట్టీల ఏర్పాటును అటవీశాఖ కొనసాగిస్తోందని పేర్కొన్నారు.