breaking news
Midsize cars
-
కియా నుంచి కొత్త సెల్టోస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్‌కి ప్రాధాన్యమిస్తూ మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్‌ను రూపొందించినట్లు చెప్పారు. వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్ లెవెల్ 2, బోస్ 8–స్పీకర్ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్ సేల్స్ ఆఫీసర్ సున్‌హాక్ పార్క్, సీనియర్ వీపీ అతుల్ సూద్ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్ వాహనాలను కియా విక్రయించింది. -
ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ వర్టస్ సంచలనం
హైదరాబాద్: జర్మనీకి చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మధ్యస్థాయిసెడాన్ వర్టస్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే 2,000లకుపైగా యూనిట్లు డెలివరీ చేసినట్టు కంపెనీ ప్రకటించింది. లాంచ్ చేసిన దగ్గర్నుంచి ఈ కారు అద్భుతమైన స్పందనతో కస్టమర్ డిమాండ్‌ను సాధించిందని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. దీని కారణంగా కంపెనీ తన 'బిగ్ బై డెలివరీ', మెగా డెలివరీ ప్రోగ్రామ్‌ను ఇండియా వ్యాప్తంగా ప్రారంభించామని చెప్పింది. ప్రారంభ ఆఫర్లో వర్టస్ ధర ఎక్స్‌షోరూంలో రూ.11.21 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైన్స్ పొందుపరిచారు. 1.0 లీటర్ ట్రిమ్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటరుకు 19.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 18.12 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 1.5 లీటర్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ 18.67 కిలోమీటర్ల మైలేజీ ఉంటుందని తెలిపింది. హోండా సిటీ, మారుతీ సియాజ్, హ్యుండై వెర్నా, స్కోడా స్లావియాలకు ఇది పోటీనిస్తుంది. ఎంక్యూబీ ఏ0 ఇండియా ప్లాట్‌ఫామ్‌పై పూణే సమీపంలోని చకన్ ప్లాంటులో ఇది తయారైంది. కాగా ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల రిలీజ్ చేసిన వర్టస్ ఇండియాలో ఏ సెడాన్ కారుకు సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను సాధించింది. కేరళలోని కొచ్చిలో ఉన్న ఒక షోరూం ఒకేరోజు 150 కార్లను డెలివరీ చేసింది. తద్వారా ఇండియా బుక్ రికార్డ్స్‌లో వర్టస్ చోటు సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. -
కార్లపై జీఎస్టీ సెస్ పెంపుపై ఈ వారంలో ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: పెద్ద కార్లు, ఎస్‌యూవీలు, మిడ్‌సైజ్ కార్లపై జీఎస్టీ సెస్‌ను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచేందుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనపై ఈ వారంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా కార్ల ధరలు తగ్గినందున, వీటిపై సెస్‌ను పెంచే ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆగస్టు 5న ఆమోదం తెలిపింది. అయితే సెస్ పెంపునకు జీఎస్టీ చట్టం సెక్షన్ 8లో సవరణలు చేయాల్సివుంటుంది. అందుచేత ఈ సవరణకు అవసరమయ్యే ఆర్డినెన్స్ జారీపై వచ్చే కొద్దిరోజుల్లో కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సెస్ పెంపుపై నిర్ణయం తీసుకునేముందు...రోడ్డు రవాణా, భారీ పరిశ్రమల శాఖల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ జారీ తర్వాత ఆరునెలలలోపుగా చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం పొందాల్సివుంటుంది. తదుపరి సెస్ పెంపును ఎప్పటినుంచి అమలు చేయాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి భేటీ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న జరుగుతుంది.


