breaking news
Mexican police
-
ద గ్రేట్ ఎస్కేప్..!
జోయాక్విన్ ఎల్ చాపో గుజ్మాన్.. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా అధినేత. మెక్సికన్ డ్రగ్స్ వ్యాపార చీకటి సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతో శాసించగల ఈ కరుడుగట్టిన నేరగాడు రెండోసారి మెక్సికన్ పోలీసుల కళ్లుగప్పి జూలై 11న జైలు నుంచి తుర్రుమన్నాడు! తలపండిన ఇంజనీర్లు సైతం నివ్వెరపోయేలా ఏకంగా 18 మీటర్ల లోతులో.. ఐదున్నర ఫీట్ల ఎత్తు, రెండున్నర ఫీట్ల వెడల్పుతో.. కిలోమీటరున్నర పొడవున సొరంగం తవ్వించి మరీ అందులోంచి పారిపోయాడు! మొదటిసారి 1993లో అరెస్టు అయి.. 2001లో లాండ్రీ బండిలో దాక్కుని ఇదే జైలు నుంచి తప్పించుకున్న గుజ్మాన్.. 2014లో పట్టుబడ్డాడు. ఇలాంటి తప్పిదం మరోసారి జరగబోదంటూ మెక్సికన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఏడాది గడిచేసరికి మరోసారి అదే జరిగింది! మెక్సికో సిటీకి 50 మైళ్ల దూరంలోని అల్టిప్లానో జైలు నుంచి జరిగిన ఈ గ్రేట్ ఎస్కేప్ వెనక కసరత్తు గురించి తెలిస్తే ఔరా! అని ముక్కున వేలేస్కోవాల్సిందే!! ఇదీ స్కెచ్..! జైలు నుంచి పారిపోవాలనుకున్న ఈ ఖల్ నాయక్ సొరంగ నిర్మాణానికి ప్లాన్ వేశాడు. రంగంలోకి దిగిన అతడి అనుచరులు పంటపొలాల మధ్య ఉన్న జైలుకు కిలోమీటరున్నర దూరంలో ఓ ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ఆ ఇంటిలోపలి నుంచి జైలుకు సొరంగ తవ్వకం మొదలుపెట్టారు. సొరంగం తవ్వకానికి అధునాతన పరికరాలతో ఇంజనీరింగ్ ప్లాన్ వేశారు. మట్టిని తవ్వి, రవాణా చేసేందుకు పట్టాలపై పరుగులు తీసేలా మార్పులు చేసిన ఓ మోటారు బైకు, దానికి ట్రాలీని వినియోగించారు. టన్నులకొద్దీ మట్టిని ఎవరికీ అనుమానం రాకుండా గోడల చాటుగా ఉంచుతూ తరలించారు. నేలకు 18 మీటర్ల లోతులో సొరంగాన్ని కచ్చితత్వంతో జైలులో గుజ్మాన్ గది బాత్రూంలోని షవర్ వరకూ తవ్వారు. మామూలుగా అయితే రెండేళ్లు పట్టే ఈ సొరంగాన్ని వీరు సంవత్సరంలోపే పూర్తి చేసేశారు. సొరంగంలోకి స్వచ్ఛమైన గాలిని పంపడం కోసం ప్లాస్టిక్ గొట్టాలను, వెలుతురు కోసం విద్యుత్ బల్బులను అమర్చారు. ఇంకేం.. అదను చూసుకుని సొరంగంలోకి చెక్క నిచ్చెన ద్వారా దిగిన గుజ్మాన్ అందులోని మోటారు బైకు ఎక్కి తుర్రుమన్నాడు. వెళుతూవెళుతూ.. ‘ఎగిరిపోతున్నా’నని సంకేతంగా చెప్పేందుకని ఓ పిచ్చుకనీ జైలు గదిలో వదిలి వెళ్లాడు! సొరంగంలో గాలి నాణ్యతను తెలుసుకునేందుకే ఆ పిచ్చుకని వాడుకుని ఉంటారని భావిస్తున్నారు. అయితే, జైలు సిబ్బంది పాత్ర లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదని, జైలు గది నేలను డ్రిల్లింగ్ మిషన్‌తో బద్దలుకొట్టినప్పుడైనా సంగతి బయటపడేదని భద్రతానిపుణులు అంటున్నారు. జైలు సిబ్బందికి రూ. 317 కోట్ల లంచాలు ముట్టచెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మొత్తానికి చేతులు కాలిన తర్వాత మెక్సికన్ ప్రభుత్వం గుజ్మాన్ కోసం ఇప్పుడు సినలోవా రాష్ట్రంతో పాటు దేశమంతా కోట్లాది డాలర్లను ఖర్చు చేస్తూ జల్లెడ పడుతోంది. ఇదివరకే లక్ష ఫొటోలను పంపిణీ చేసింది. పది వేల మంది పోలీసులు, 48 డాగ్‌స్క్వాడ్ బృందాలు.. 101 చెక్‌పోస్టులు.. విమానాలు, రైళ్లు, హైవేలు, హోటళ్లు, ఆస్పత్రులు.. చివరికి మార్చురీలను సైతం వదలకుండా గాలిస్తున్నారు. అయితే, అతడు ఇంకా మెక్సికోలోనే ఉన్నాడా? లేక మరో సొరంగం ద్వారా అమెరికాకు చెక్కేశాడా? అన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది! అన్నట్టూ.. ప్రపంచ అత్యంత శక్తిమంతుల్లో ఒకడిగా గుజ్మాన్‌కు ‘ఫోర్బ్స్’ పత్రిక జాబితాలో కూడా చోటు లభించింది. గుజ్మాన్ చీకటి వ్యాపార ఆదాయం ఏటా రూ. 20 వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా! -
కిడ్నాపర్లు చెర నుంచి 44 మంది బందీలు విడుదల
రేనోసా బస్సు టెర్మినల్‌లో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన 44 మందిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా రక్షించినట్లు రేనోసా ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు.రేనోసా ఈశాన్య ప్రాంతంలోని ఓ ఇంట్లో వారంతా బందీలుగా ఉన్నారని తెలిపారు.అయితే వారిలో ఓ మహిళ తమను రక్షించండంటూ గట్టిగా అరుస్తున్న అరుపులు అటువైపుగా గస్తీ తిరుగుతున్న పోలీసులకు వినిపించాయి.దాంతో గస్తీ పోలీసులు ఆ నివాసానికి చేరుకుని బందీలుగా ఉన్న 44 మందిని రక్షించినట్లు చెప్పారు. బందీలలో 24 మంది మెక్సికన్లు, 14 మంది హుండరస్ వాసుల్లో ఐదుగురు మైనర్లుతోపాటు సెల్వడార్కు చెందిన వ్యక్తి, గ్వాటిమాల,బెలిజియన్ దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. ఇటీవల రేనోసా నగరంలోని బస్ టెర్మినల్ వద్ద వారందరిని కిడ్నాప్ చేశారు. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలంటే అధిక మొత్తంలో నగదు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. తాములిపాస్ రాష్ట్ర సరిహద్దుల్లో రేనోసా పట్టణం ఉంది.ఆ పట్టణంలో సరైన నివాస ప్రతాలు లేని వలసదారులపై స్థానికులు తరచుగా దాడులు, అత్యాచారాలు,కిడ్పాప్లు చేస్తున్న విషయం విదితమే.