breaking news
Menu implementation
-
గుడ్డు లేదు.. పండు లేదు!
సాక్షి, పెద్దేముల్: మధ్యాహ్న భోజన పథకంలో శ్రావణ మాసం అంటూ పలు ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్డు విద్యార్థులకు ఇవ్వడం లేదు. ఇదేమని అడగితే గుడ్డు బదులు పండు ఇస్తున్నామంటున్నారు. తీరా ఏది ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది మధ్యాహ్న భోజన బిల్లులు రానిది గుడ్డు ఎలా పెట్టాలని ఆయాలు చెబుతున్నట్లు తెలస్తుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారం తప్పకుండా విద్యార్థులకు గుడ్డు ఇవ్వాలి. పలు పాఠశాలల్లో వారంలో రెండు సార్లు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో హెచ్ఎంలు ఒక్క గుడ్డుకు రూ.4 బిల్లు చేస్తుంటారు. దానికి తోడు పాఠశాలల్లో మెనూ కూడా సరిగా పాటించడం లేదు. వారంలో రెండు సార్లు కిచిడీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్య లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరు తున్నారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీనివాస్‌ను వివరణ కోరగ శ్రావణ మాసంలో గుడ్డు బదులు తప్పకుండా పండు ఇవ్వాలన్నారు, పండ్లు ఇవ్వక పొతే బిల్లు చేసే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయాన్ని పాఠశాలల హెచ్ఎంలకు తెలియచేస్తామన్నారు. -
పొట్ట కొడుతున్నారు!
కేజీబీవీల్లో మెనూ అమలు గాలికి ఆఫీస్ మెయింటెనెన్స్ పేరుతో దందా అనంతపురం ఎడ్యుకేషన్ : అనాథలు, మధ్యలో బడిమానేసిన ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) స్పెషల్ ఆఫీసర్లు, సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) కార్యాలయంలోని కొందరు అధికారులకు ఆదాయ వనరులుగా మారాయి. వీటిద్వారా ప్రతినెలా లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. కేజీబీవీలను పర్యవేక్షించాల్సిన అధికారుల అండతోనే స్పెషల్ ఆఫీసర్లు ఈ అక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు ఎస్ఎస్ఏ సిబ్బంది పెట్టిన పేరు ‘ఆఫీస్ మెయింటెనెన్స్’. జిల్లాలో మొత్తం 62 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో 36 కేజీబీవీలు ఏపీఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 18 ఏపీఆర్ఐఈ సొసైటీ కింద, 5 గిరిజన సంక్షేమశాఖ, 3 సాంఘిక సంక్షేమశాఖ కింద నడుస్తున్నాయి. వీటిల్లో సుమారు 10,500 మంది విద్యార్థినులు చదువుతున్నారు . ప్రతినెలా రూ.5 వేలు ఎస్ఎస్ఏ పరిధిలో నడుస్తున్న 36 కేజీబీవీల నుంచి ఆఫీస్ మెయింటెనెన్స్ పేరుతో ఎస్ఎస్ఏలో కొందరు సిబ్బంది దందా చేస్తున్నారు. బిల్లులు చేయాలంటే ఒక్కో కేజీబీవీ నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు చెల్లించాల్సిందే. గతంలో ఎంతోకొంత పుచ్చుకుని బిల్లులు చేసేవారు. ఇటీవల ఓ అధికారి ప్రతి కేజీబీవీకి రూ.5 వేలు ఫిక్స్ చేశారు. గతేడాది నవంబరు నుంచి ఈ దందాకు తెరతీశారు. 36 కేజీబీవీల ద్వారా ప్రతి నెలా రూ.1.80 లక్షలు అప్పనంగా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో వివిధ స్థాయి అధికారులు వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. స్పెషలాఫీసర్లు రూ.5 వేలు ముందుగా చెల్లించకపోతే బిల్లులు పాస్ చేయకుండా కొర్రీ వేస్తున్నారు. దీంతో చాలామంది స్పెషలాఫీసర్లు బిల్లులు తెచ్చేటప్పుడే ‘ఆఫీస్ మెయింటెనెన్స్’ కూడా తెచ్చిస్తున్నారు. మెనూ అమలు గాలికి గతంలో ఒక్కో కేజీబీవీలో విద్యార్థుల జాబితాల్లో పదుల సంఖ్యలో బినామీ పేర్లు ఉండేవి. వాటి ద్వారా వచ్చే సొమ్ములో కేజీబీవీ, ఎస్ఎస్ఏ సిబ్బంది వాటాలు పంచుకునేవారు. ఇటీవల ఆధార్ సీడింగ్ జరిగిన తర్వాత బోగస్ విద్యార్థినులు దాదాపు లేరు. ఈ పరిస్థితుల్లో ప్రతి నెలా రూ. 5 వేల ‘ఆఫీసు మెయింటెనెన్స్’ ఇవ్వడం ఇబ్బందే. దీంతో పిల్లల పొట్టకొడుతున్నారు. మెనూ అమలు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఏ నిత్యావసర సరుకులూ ఉపయోగించడం లేదు. నీళ్ల పప్పు, నీళ్ల మజ్జిగ, కూరగాయలు లేని సాంబారు, చికెన్, కోడిగుడ్డు.. ఇలా అన్ని విషయాల్లోనూ మమ అనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కేజీబీవీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని విద్యార్థినుల బంధువులు కోరుతున్నారు.