breaking news
medi government
-
ఎలా ఎగిరిపోనిచ్చారు?
మాల్యా పరారీపై రాజకీయ దుమారం * మోదీ ప్రభుత్వం దాటించిందన్న రాహుల్ * బ్యాంకులు ఆలస్యం చేశాయన్న జైట్లీ న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టిన కేసు విచారణ మధ్యలో ఉండగానే లిక్కర్ రారాజు విజయ్‌మాల్యా దేశం విడిచి పారిపోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గురువారం అటు పార్లమెంటులోపలా, బయటా అధికార, విపక్షాలు వాగ్బాణాలు సంధించుకున్నాయి. మాల్యా దేశం నుంచి పారిపోవడానికి ప్రభుత్వం సహాయం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడగా, బోఫోర్స్‌కేసులో ఖత్రోచీని కాంగ్రెస్ సర్కారు దేశం దాటించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. మాల్యా ఈనెల 2న పారిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో విపక్ష నేత ఆజాద్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. మాల్యా దేశం వదిలి పారిపోవడంలో ఎన్డీఏ ప్రభుత్వ కుట్ర ఉందన్నారు. ప్రభుత్వం ఆయనకెలాంటి సాయం చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ బదులిచ్చారు. పార్లమెంటు బయట రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, మాల్యాలాంటి వారిని దేశం దాటేలా చేసి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న హామీని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ‘తిండి లేక ఆకలితో రొట్టె దొంగిలించిన పేదవాడిని జైల్లో పెడతారు.. దేశంలో రూ.9వేల కోట్లు దొంగిలించిన వ్యాపారవేత్తను మాత్రం ఫస్ట్‌క్లాస్‌గా దేశం దాటిస్తారు’ అంటూ ధ్వజమెత్తారు. జైట్లీ మీడియాతో మా ట్లాడుతూ, మాల్యా విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో బ్యాంకులు జాప్యం చేశాయని, త్వరగా స్పందించి ఉంటే బాగుండేదన్నారు. మాల్యా దేశం నుంచి వెళ్లడానికి, ఖత్రోచీ భారత్ వదిలి పోవడానికి తేడా ఉందన్నారు. బోఫోర్స్ లబ్ధిదారుల్లో ఖత్రోచీ ఉన్నారని స్విట్జర్లాండ్ అధికారులు చెప్పిన తర్వాత సీబీఐ విచారణాధికారి ఖత్రోచీ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని లేఖ రాసిన రెండు రోజుల్లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖత్రోచీని దేశం దాటించిందన్నారు. కాగా, మాల్యాపై చర్యలు తీసుకోవాలంటూ తమకెలాంటి సమాచారం అందలేదని విదేశాంగ శాఖ చెప్పింది. లండన్‌లో విజయ్ మాల్యా లండన్: విజయ్ మాల్యా బ్రిటన్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర లండన్‌లోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలోని తన బంగళా నుంచి గంట ప్రయాణం దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్నట్లు సమాచారం. మాల్యా గతవారం హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని సెయింట్ అల్బన్స్ సమీపంలోని టెవిన్ గ్రామంలోని తన ‘లేడీవాక్’ ఎస్టేట్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. టెవిన్‌లో ఉన్నప్పుడు పబ్‌లకు వెళ్లే మాల్యా.. ఇప్పుడు మాత్రం బయట కనిపించలేదని అంటున్నారు. -
విజయ్ మాల్యా ఎలా పారిపోయారు?
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ కోసం, ఆదివాసీల అటవీ హక్కుల కోసం పోరాడుతున్న గ్రీన్ పీస్ కార్యకర్త ప్రియా పిళ్లైని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. మధ్యప్రదేశ్‌లోని మహాన్ కోల్ బ్లాక్‌కు వ్యతిరేకంగా అటవి సంపద సంరక్షణ కోసం పోరాడుతూ, అందులో భాగంగా లండన్ బయల్దేరిన పిళ్లైని 2015, జనవరి 11న అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో నిలిపేశారు. లండన్‌లో ఆమె ప్రచారం కారణంగా దేశం పరువు పోతుందని భావించిన మోదీ ప్రభుత్వం ఆమెను ‘నో ఫారిన్ ట్రావెల్’ కేటగిరీలో కూడా చేర్చారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఆమెను ఆ జాబితా నుంచి తొలగించారు. దేశ ప్రయోజనాల కోసం, ఆదివాసీల సంక్షేమం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్న ప్రియా పిళ్లైని విమానాశ్రయంలో అడ్డుకున్న మోదీ ప్రభుత్వం, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోతున్న లింకర్ కింగ్ విజయ్ మాల్యాను మాత్రం సాదరంగా లండన్ వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ఇది ద్వంద్వ ప్రమాణాలు అనుసరించడం కాదా ? విజయ్ మాల్యా అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు బకాయిపడ్డ విషయం తెల్సిందే. ఆయన ఎక్కువగా రుణాలు తీసుకున్నది వివిధ ప్రభుత్వ బ్యాకుల నుంచే. అదంతా పేద ప్రజలు, టాక్స్ పేయర్స్ దాచుకున్న సొమ్మే అనడంలో అతిశయోక్తి లేదు. విజయ్ మాల్యాపై సిబీఐ ‘లుకౌట్’ నోటీసు ఉన్నా అధికారుల కళ్లుగప్పి ఆయన విదేశానికి ఎలా చెక్కేస్తారు. దేశ, ప్రజల ప్రయోజనాలు పట్టని కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండానే మాల్యా తప్పించుకుపోయాడంటారా? ‘సమ్‌థింగ్ రాంగ్ విత్ ది మోదీ గవర్నమెంట్’. విజయ్ మాల్యా పారిపోయాక కూడా ఆయన్ని పట్టుకునేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు? పైగా ఆయన ఏ దేశం వెళ్లారో కూడా తెలియదని కేంద్రం బుకాయిస్తోంది. తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదుగదా! ఇలా దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే వారు సాధారణంగా ఇంగ్లండ్ వెళతారన్నది అందరికి తెల్సిన విషయమే. అక్కడి చట్టాల ప్రకారం ఇలాంటి వారికి అక్కడ సులభంగా శరణు దొరుకుతుంది. అక్కడ కొత్త జీవితం ప్రారంభించవచ్చు.