breaking news
Marry again
-
మళ్లీ... పెళ్లి ఖాయం?
టీనేజ్‌లో ఉన్నప్పుడే హృతిక్ రోషన్, సుజానే ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదిహేడేళ్ల వివాహ బంధానికి ఇటీవలే ఈ దంపతులు ముగింపు పలికిన విషయం తెలిసిందే. పిల్లలిద్దరు మాత్రం తండ్రి దగ్గర కొన్ని రోజులు, తల్లి దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు. ఆ సంగతలా ఉంచితే.. హృతిక్ జీవితంలోకి మరో అమ్మాయి వచ్చే అవకాశం ఉందట. వచ్చే జనవరి 10కి హృతిక్ 41వ పడిలోకి అడుగుపెడతారు. అప్పట్నుంచీ ఆయన స్టార్ తిరిగిపోతుందని ముంబయ్‌కి చెందిన ప్రముఖ జాతక నిపుణులు చెబుతున్నారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనీ, మరో రెండేళ్లల్లో హృతిక్ రోషన్ రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, ఆ స్టార్ సైన్స్ సూచిస్తున్నాయట. -
మళ్లీ పెళ్లి చేసుకుంటా!
లేటు వయసులో ఇలాంటి ఆలోచనలేంటి? అని ఆడిపోసుకోవడానికి జనాలు వెనకాడరని తెలిసినా, ‘నేను పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నా’ అని బహిరంగంగా ప్రకటించేశారు బాలీవుడ్ మాజీ కథానాయిక జీనత్ అమన్. ఆమె ఎవరో చెప్పడానికి జస్ట్ ‘దమ్ మారో దమ్’ పాట చాలు. ఇక, జీనత్ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే... 1985లో నటుడు, దర్శకుడు మజర్ ఖాన్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు పుట్టాక జీనత్ పూర్తిగా వారికే అంకితమయ్యారు. మజర్‌తో ఆమె వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదు. మజర్ వేధింపులు భరించలేక ఆయన్నుంచి జీనత్ విడిపోయారు. అప్పట్నుంచీ కొడుకులే లోకంగా జీవిస్తున్నారామె. ఈ బుధవారంతో 63వ పడిలోకి అడుగుపెట్టిన జీనత్.. ‘‘ఇన్నాళ్లూ ఒంటరిగానే నెట్టుకొచ్చాను.. మిగతా జీవితం పంచుకోవడానికి ఓ తోడు కోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన మనోభావాలను విపులంగా వ్యక్తపరుస్తూ -‘‘నటిగా మంచి వైభవాన్ని చూస్తున్న సమయంలోనే నేను పెళ్లి చేసుకున్న విషయం, దానివల్ల సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అప్పటికి 15 ఏళ్లు నిర్విరామంగా పని చేసినందువల్లో ఏమో పూర్తిగా నా కుటుంబానికి అంకితమైపోయాను. నా ఇద్దరు కొడుకులు అజాన్, జహాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లయ్యారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. నా కోసం కొంత సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారు. మా అబ్బాయిలు అంత బిజీ కావడం నాకు ఆనందంగా ఉంది. కానీ, జీవితాంతం ఇలా ఒంటరిగా గడిపేయాలని నాకనిపించడం లేదు. ఆ దేవుడు నాకు మంచి ఆరోగ్యం, జీవితాన్ని ఆస్వాదించే మనసునిచ్చాడు. అలాంటప్పుడు ఏదో కోల్పోయినట్లుగా ఒంటరి బతుకెందుకు? అనుకుంటున్నా. అందుకే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’’ అని జీనత్ తెలిపారు.