breaking news
Manisha Reddy
-
త్రిసభ్య కమిటీకి వినతులు
కడప ఎడ్యుకేషన్: ఈనెల 17వ తేదీన నారాయణ జూనియర్ కళాశాలలో జరిగిన నందిని, మనీషారెడ్డిల మృతిపై విచారణ చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం రాష్ట్ర అతిథి గృహంలో ఉన్న త్రిసభ్య కమిటి సభ్యులకు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, ఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. విద్యార్థులు మృతి చెందిన రోజు కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. త్రిసభ్య కమిటి సభ్యులను కలిసిన వారిలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిలా అధ్యక్షుడు అలూరు ఖాజీ ర హ్మతుల్లా, ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్రారెడ్డి. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి అంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ ఉన్నారు. -
మిన్నంటిన ఆందోళనలు
అనంతపురం ఎడ్యుకేషన్ : వైఎస్ఆర్ జిల్లా కడప నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు నందిని, మనీషారెడ్డి ఆత్మహత్యకు కారణం కళాశాల యాజమాన్యం వేధింపులేనని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాస్తారొకోలు, ధర్నాలు, మంత్రి నారాయణ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్లో నారాయణ విద్యా సంస్థల యాజమాన్య దిష్టిబొమ్మను దహనం చేశారు. విదార్థినుల మృతిపై న్యాయ విచారణ జరిపేందుకు మంత్రి కళాశాల కావడంతో అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రమణ, కుళ్లాయప్ప, పవన్, కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఓవర్‌బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కేవై ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినిల ఆత్మహత్యలపై సిట్టింగ్‌జడ్జితో న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గాదిలింగ, చాంద్‌బాషా, సంతోష్, మున్నా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్య వేధింపులు కారణంగానే విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి దిష్టిబొమ్మ దహనం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక క్లాక్‌టవర్ వద్ద మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే కళాశాలల్లో ఎంతటి వేధింపులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ వీరాంజనేయులు, నాయకులు హరికృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు నిరసనగా బుధవారం రాయలసీమ వ్యాప్తంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి కూడా నేడు విద్యా సంస్థలకు బంద్‌కు పిలుపునిచ్చారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరుణకుమార్ డిమాండ్ చేశారు. మంత్రిని పదవి నుంచి తప్పించి నారాయణ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. గుంతకల్లు, కదిరి, ఉరవకొండ, హిందూపురంలలో సైతం విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.