breaking news
mallavva
-
వృద్ధురాలి హత్య - బంగారు, నగదు చోరీ
మెదక్ జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో ఇమ్మడి మల్లవ్వ(80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్యచేసి రెండున్నర తులాల బంగారు, 50 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం వేకువ జామున జరిగింది. మల్లవ్వ కుమారుడు జయపాల్‌రెడ్డి సిద్ధిపేటలో స్కూల్ నడుపుతూ అక్కడే ఉంటున్నాడు. వృద్దురాలు మాత్రం ఇంటిపట్టునే ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తోంది. ఆదివారం వేకువ జామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమె గొంతు నులిమి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు దోచుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటలైనా వృద్దురాలు నిద్ర లేవకపోవడంతో ఇరుగుపొరుగువారు దొడ్డిదారి గుండా ఇంట్లోకి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది. ఆమె మెడ వద్ద గాయాలు ఉన్నాయి. విషయం పోలీసులకు, ఆమె కుమారునికి చేరవేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు మరణం తట్టుకోలేని ఓ తల్లి..
తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా): కొడుకు మరణించాడన్న నిజాన్ని తట్టుకోలేని ఓ తల్లి వెంటనే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి పరిధిలోని నర్సింగాపూర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అల్లెపు లింగయ్య, మల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో కొమురయ్య(50) శనివారం పనికి వెళ్లి వచ్చాడు. నీళ్లివ్వాలని అడిగి.. వెంటనే నోటిలో నుంచి నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే.. తల్లి మల్లవ్వ కొడుకు మీద పడి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. ఆటోలో కొమురయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దుద్దెనపల్లి వద్ద 108లోకి ఎక్కించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లి మల్లవ్వ సైతం మృతి చెందడం గమనార్హం. -
ఆత్మీయ స్పర్శ... కష్టాల్లో భరోసా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘హలో.. హరీషా!.. నేను బిడ్డా.. నాసర్‌పుర మల్లవ్వను మాట్లాడుతన్నా.. మూడు దినాల సంది సుక్క నీళ్లు రావట్లేదు.. సారోళ్లకు జరజెప్పు కొడుకా’. ‘ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా.. ’అనుమాండ్ల గుడి ముందర నిలబడి మాట్లాడుతున్న బిడ్డా.. ‘సరే అక్కడే ఉండమ్మా...’ 10 నిమిషాల్లో ఎవరో ఒక వ్యక్తి రెండు క్యాన్లతో నీళ్లు పట్టుకొచ్చి మల్లవ్వ చేతిలో పెట్టారు. ఇంకో మూడు నిమిషాల తరువాత మల్లవ్వ చేసిన కాయిన్ బాక్స్ రింగ్ అయ్యింది. రిసీవర్ చెవి దగ్గర పెట్టుకుంటే ‘నేను మున్సిపాల్టీ ఇంజనీర్‌ను మాట్లాడుతున్నా.. పైపు లైన్ పగిలిపోయింది. బాగు చేశాం.. ఇంకో గంటలో మీకు నీళ్లు వదులుతామమ్మా’ అంటూ సమాధానం. ఒక్క మల్లవ్వే కాదు సిద్దిపేటలో ప్రతి అవ్వకు ఆయన కొడుకే. కష్టమొచ్చినా.. కన్నీళ్లొచ్చినా సిద్దిపేట ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది ఆయన ఫోన్ నంబర్. రూపాయి ఖర్చు చేస్తే చాలు వాళ్ల కష్టాలు గట్టున పడ్డట్టే. ప్రతి వ్యక్తి మనన్నలు పొందిన హరీష్ రావు రాజకీయ లైఫ్ స్టైల్లోకి తొంగి చూస్తే.. ప్రతి గ్రామంలో కనీసం 20 మందినైనా పేర్లు పెట్టి మరీ పిలుస్తారు. స్థాయి, భేదం మరిచిపోయి పల్లె జనంతో కలిసిపోతారు. వాళ్లతో మాట కలుపుతాడు.. ‘ఏం జరుగుతుందే..! వెంకటాపూర్ల బట్టోళ్ల బాల్రాజన్న నీళ్ల కోసం 10 బోర్లు ఏసిండట గదనే.. గన్ని బోర్లు ఎసుకుంటారే... ఎంత అప్పయితదే..!’ ఈ మాటతో రైతులు, కూలీలు, సాధారణ జనం గుండె లోతుల్లోంచి మాట్లాడుతారు. వాళ్ల కడుపులో దాచుకున్న కష్టాలను, కన్నీళ్లను విడమరిచి చెప్తారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి మానసిక ధైర్యం ఇవ్వడంతో హరీష్ సిద్ధంగా ఉంటారు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కచ్చితంగా ఫోన్ లిఫ్టు చేస్తారు. అందులో జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగినా... సిద్దిపేట నియోజకవర్గంలో ఆత్మహత్యలు స్వల్పంగా నమోదయ్యాయి. జనం చెప్పిన సమస్యలనే అసెంబ్లీలో లేవనెత్తుతారు. ఉదాహరణలు చెప్తూ అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తారు. అధికారులను పరుగులు పెట్టిస్తారు. ఇదీ హరీష్‌రావు స్టైల్. పచ్చడి మెతుకులు తింటూ... నియోజకవర్గంలో హరీష్‌రావుకు కార్యకర్తల మధ్య మధ్యవర్తులు ఉండరు. ప్రతి కార్యకర్తను ఆయన నేరుగా కలుస్తారు. ప్రధాన అనుచరులు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు హరీష్‌రావుకు చేరవేస్తారు. ప్రతి విషయాన్ని ఆయన ఆసక్తితో తెలుసుకుంటారు. ఇక పార్టీ కార్యకర్తలు అలిగితే ఆ ట్రీట్మెంటు వేరే ఉంటుంది. ఎవరు ఎందుకు అలిగారు? అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని మనుసులో పెట్టుకుంటారు. ఆయా కార్యకర్తల గ్రామానికి వెళ్లినప్పుడు, గ్రామంలో సమస్యలు వింటారు.. సరిగ్గా భోజన సమయానికి అలిగిన కార్యకర్త ఇంటికి పోయి మంచం వేసుకుని కూర్చుంటారు. ‘అన్నా... ఆకలైతందే, ఇంట్లో ఏముందే ’అని ఆప్యాయంగా, ఆర్థ్రతతో అడుగుతారు. ఇంట్లో ఏమున్నా తింటారు... ఏమి లేకుంటే పచ్చడి మెతుకుల్లో పచ్చి నూనె పోసుకొనైనా తింటారు. కార్యకర్తతో మాట కలిపి భోజనం ముగించేలోపు కార్యకర్త కడుపులో బాధను పోగొడతారు. ఆయనకు భరోసా ఇవ్వడమే కాదు, ఇచ్చిన హామీ నెరవేరిందా? లేదా? అని ఆయన నేరుగా సదరు వ్యక్తికే ఫోన్ చేసి తెలుసుకుంటారు. కాయిన్ బాక్స్ మంత్రి.. కార్యకర్తలకు అందుబాటులో లేని సందర్భంలో వారు ఫోన్ చేయగానే విషయం విని సంబంధిత అధికారులకు వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించడం ద్వారా అతన్ని కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే అని పిలిచేవాళ్లు... ఇప్పుడు కాయిన్ బాక్స్ మంత్రి అయ్యారు. పేద కార్యకర్తలు పెళ్లి కార్డు ఇస్తే భోజనం కోసం బియ్యం పంపడం అతని సంప్రదాయం. సభలు జరిగినప్పుడు కార్యకర్తల మధ్య కూర్చోవడం ద్వారా వారికి క్రమశిక్షణ పాఠాలను పరోక్షంగా చెప్పేస్తారు. ఎవరు శుభకార్యానికి పిలిచినా వెళతారు.