breaking news
Mahasweta
-
Mahasweta Ghosh: ఎడారి చిరుత
ప్రపంచంలో అత్యంత కష్టమైన మారథాన్ ‘సహారా మారథాన్’. ఆరు రోజుల పాటు సహారా ఎడారిలో 250 కిలోమీటర్లు నడవాలి. ఒక్క ఒయాసిస్సు కూడా తగలని ఈ దారిలో ప్రాణం కూడా పోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన పోటీలో భారతీయ మహిళ మహాశ్వేతా ఘోష్ మొదటిసారి పాల్గొని మారథాన్ పూర్తి చేసింది. ఆమె పరిచయం. ‘మారథాన్ దెస్ సేబుల్స్’ లేదా ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ లేదా ‘సహారా మారథాన్’లో పాల్గొనేవారి ధైర్యం ఏమిటో? మామూలుగా ఎండలో నడవడమే కష్టం. అలాంటిది ఎడారి ఎండలో నడవడం సామాన్యమా? మామూలు నేల మీద ఎక్కువసేపు నడవడం కష్టం. ఇక ఎడారి ఇసుకలో ఎక్కువ సేపు నడవడం సాధ్యమా? 44 ఏళ్ల మహాశ్వేతా ఈ అసాధ్యమైన మారథాన్‌ను పూర్తి చేయగలిగింది. అలా చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు స్థాపించింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యి మే 1న ఈ మారథాన్ పూర్తయ్యింది. ఎడారిలో సాహసవంతులు ‘మారథాన్ ఆఫ్ ది శాండ్స్’ 1986 నుంచి మొదలయ్యింది. 1984లో పాట్రిక్ బ్యూయెర్ అనే ఫ్రెంచ్ వ్యక్తి మొరాకోలోని సహారా ఎడారిలో 12 రోజుల పాటు ఒక్కడే 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. అతడు ప్రయాణించిన దారిలో ఒక్క ఒయాసిస్సు కూడా లేదు. ఎడారి తండాలు కూడా కనిపించలేదు. అంటే ఈ దారి అల్ట్రా మారథాన్‌కు అనువైనదని భావించి రెండేళ్ల తర్వాత ఈ మారథాన్‌ను మొదలెట్టాడు. అయితే 2009 నాటికిగాని ఇది ఊపందుకోలేదు. ఆ సంవత్సరం వెయ్యి మంది సహారా మారథాన్‌లో పాల్గొన్నారు. అడుగడుగునా సవాళ్లు 2023లో మారథాన్ ఆఫ్ ది శాండ్స్ ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యింది. భారతదేశం నుంచి మహాశ్వేతా ఘోష్ మాత్రమే హాజరయ్యింది. అనేక దేశాల నుంచి మొత్తం 1200 మంది పోటీదారులు వచ్చారు. ‘మా అందరికీ 11 కిలోల బరువున్న బ్యాక్ ప్యాక్ మాత్రమే అనుమతించారు. రోజుకు 12 లీటర్ల నీళ్లు నిర్వాహకులు సప్లై చేశారు. అంతకుమించిన నీరు దొరకవు. ఎవరి ఆహారం వారు తినాలి. మారథాన్‌లో పెద్దగా స్నేహాలు ఏర్పడవు. పోటీ కాబట్టి ఎవరి లక్ష్యంలో వారు నడుస్తుంటారు. ఎడారి దారిలో 40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకూ ఉండే ఎండలో నడవడం అంటే మాటలు కాదు. మాకు ప్రతిరోజూ లక్ష్యం ఇస్తారు. అంటే రోజుకు 70 నుంచి 90 కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోవాలి. ఇచ్చిన సమయంలో నిర్దేశిత దూరానికి చేరుకోలేకపోతే అక్కడితో వారు పోటీ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు. నేను ఎలాగైనా ఈ మారథాన్ పూర్తి చేయదలిచాను. అందుకే ఏ రోజు కూడా నిర్దేశిత గమ్యాన్ని తప్పలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోయారు’ అని తెలిపింది మహాశ్వేతా. పోహా, ఓట్స్ ‘నేను మారథాన్ సాగిన ఆరు రోజులు హల్దీరామ్ డిహైడ్రేటెడ్ దాల్ చావల్, రెడీ టు ఈట్ పోహా, న్యూట్రిబార్స్, చాక్లెట్లు, డ్రై ఓట్స్ తిన్నాను. తల మీద సోలార్ హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్ట్రోలింగ్ స్టిక్స్, భుజాన బ్యాగ్‌తో మన నడక కొనసాగాలి. చివరిరోజు చివరి దశలో పరుగు తీయాలి. ఎండ మన సహనాన్ని పరీక్షిస్తుంది. డీ–హైడ్రేట్ కాకుండా చూసుకో వాలి. చాలామంది తల మీద నీళ్లు పోసుకుంటారు. అలా పోసుకోవడం వల్ల వేడి ఇంకా పెరుగుతుంది. కేవలం మెడ, ముఖం తడుపుకుంటూ ముందుకు సాగాలి. గుడారంలో రాత్రిపూట విశ్రాంతిలో భాగ్ మిల్కా భాగ్‌లోని స్ఫూర్తిగీతం వినేదాన్ని’ అని చెప్పిందామె. భ్రాంతుల నుంచి ‘ఎడారిలో భ్రాంతులు ఎక్కువ. వాటి మాయలో పడ్డామంటే చిక్కుల్లో పడతాం. ఈ ఎడారిలో నీకు ఎప్పటికీ నీళ్లు కనిపించవు. కనిపించే నీళ్లను నమ్మకు అని నా మనసుకు చెప్పుకున్నాను. ఏమంటే చాలాసార్లు ఎండమావులు కనిపిస్తాయి. షూస్‌లో ఇసుక దూరకుండా నడవడం పెద్ద విద్య. ఇన్ని కష్టాలు పడ్డా అంతిమంగా యాత్ర ముగిస్తే కలిగే ఆనందం నిజంగా జీవితంలో ఒయాసిస్సులా ఉంటుంది’ అందామె నవ్వుతూ. లూజర్స్ స్ఫూర్తి ‘మాది పశ్చిమ బెంగాల్. నేను కాలేజీలో చదివేప్పుడు సన్నబడటానికి నడకను, జాగింగ్‌ను సాధనంగా చేసుకున్నాను. అదే కొనసాగిస్తున్నాను. 2019లో నెట్‌ఫ్లిక్స్‌లోని లూజర్స్ సిరీస్ నాకు మారథాన్ ఆఫ్ శాండ్స్ గురించి తెలియజేసింది. అందులోని ఒక ఎపిసోడ్లో ఒలింపిక్ విజేత మౌరో ప్రాస్పెరీ మారథాన్ ఆఫ్ శాండ్స్ను ఎలా ముగించాడో వివరంగా చూపించారు. నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే ఎడారిలో మారథాన్ చాలా కష్టం. అందుకే రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో నాకై నేను 75 కిలోమీటర్ల మారథాన్ సాధన చేసి ఈ అతికష్టమైన ఎడారి మారథాన్‌కు సిద్ధమయ్యాను’ అని చెప్పింది మహాశ్వేతా ఘోష్. -
సుష్మాస్వరాజ్ పొరపాటు చేశారు!
న్యూఢిల్లీః ప్రసిద్ధ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అద్భుత రచనలు చేసిన మహాశ్వేతాదేవి సామాజిక న్యాయంకోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. అయితే ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఇతర మంత్రుల మధ్య ఎంతో పేరుగాంచిన ఆమె... రచయిత మహా శ్వేతాదేవి మరణంపై సంతాపం ప్రకటించడంలో మాత్రం తప్పిదం చేశారు. ఎప్పుడూ ఎంతో ఆచితూచి మాట్లాడే సుష్మా... శ్వేతాదేవి రచనలను కోట్ చేయడంలో మాత్రం అనుకోని పొరపాటు చేశారు. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ అనుకోని తప్పిదం చేశారు. ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి మరణంపట్ల సంతాపం తెలపడంలో భాగంగా ఆమె రచించని రెండు పుస్తకాలను కోడ్ చేసి, తప్పులో కాలేశారు. ఆశాపూర్ణా దేవి రాసిన 'ప్రథమ్ ప్రతిశ్రుతి', 'బకుల్ కథ' పుస్తకాలను.. మహాశ్వేతాదేవి రాసినట్లుగా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మహాశ్వేతాదేవి రచరనలు తనపై శాశ్వత ముద్రను వేశాయంటూ సుష్మాస్వరాజ్... శ్వేతా రచించని రెండు పుస్తకాల పేర్లను తన ట్విట్టర్ సందేశంలో రాశారు. అయితే విషయాన్ని ట్విట్టర్ వినియోగదారులు కొందరు చూసి.. తెలిపే వరకూ కూడా ఆమె గమనించలేదు. అనంతరం తప్పును తెలుసుకొన్న సుష్మా.. వెంటనే పుస్తకాల పేర్లను పేర్కొన్న రెండో ట్వీట్ ను డిలీట్ చేశారు. అయితే సుష్మా తన పొరపాటు మెసేజ్ ను వెంటనే డిలీట్ చేసినా.. ప్రజలు మాత్రం ఆమెను వదల్లేదు. ఆమె డిలీట్ చేసిన మెసేజ్ ఫొటోలను పోస్ట్ చేసి, ఇది ఆమె పట్టని తనానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. అజ్ఞానానికి నిదర్శనమని అభివర్ణించారు. సామాజసేవకోసం జీవితాన్ని త్యాగం చేసిన మహాశ్వేతాదేవి మరణం విషయం తెలిసిన వెంటనే గొప్ప రచయితను కోల్పోయామంటూ ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా.. ఎంతోమంది ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం తెలిపిన విషయం విదితమే. -
మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం..
కోల్ కతాః పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమెకు.. గురువారం నుంచీ ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, అయినా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె మూత్రపిండాలు రెండూ సరిగా పనిచేయడం లేదని, గురువారం రాత్రి డయాలసిస్ నిర్వహించినా.. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనపించడం లేదని వైద్యులు చెప్తున్నారు. 90 ఏళ్ళ వయసున్నశ్వేతాదేవి వివిధ ఆరోగ్య సమస్యలతో కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో రెండు నెలలుగా చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో తగిన వైద్యం అందిస్తున్నామని, అయినా పరిస్థితి విషమిస్తుండటంతో వెంటిలేషన్ పై శ్వాసను అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. 1996 లో జ్ఞానపీఠ అవార్డు పొందిన మహా శ్వేతాదేవి.. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 1926 లో జన్మించారు. శ్వేతాదేవి తల్లిదండ్రులు సైతం రచయితలే.