breaking news
Made in home
-
సింగిల్ శాటిన్ పూల అందాలు!
మేడ్ ఇన్ హోమ్ ఓ చిన్న క్లిప్... కురులకు కొత్త అందాన్ని అద్దుతుంది. అందుకే మార్కెట్ నిండా రకరకాల మోడళ్ల క్లిప్పులు దర్శనమిస్తున్నాయి. కానీ ఎన్నని కొంటాం! రేట్లు మండిపోతున్నాయి కదా! అందుకే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేయడం మొదలుపెట్టండి. పెద్ద కష్టమేమీ కాదు. మొదట క్లాత్ మీద కావలసిన ఆకారంలో రేకుల డిజైన్ వేసుకోవాలి. తర్వాత రేకుల్ని కత్తిరించి, వాటి అంచుల్ని కొద్దిగా వెనక్కి రోల్ చేయాలి. తర్వాత వీటన్నిటినీ పువ్వులా పేర్చుకుంటూ గమ్‌తో అతికించాలి లేదా పిన్ చేయాలి. ఆపైన మధ్యలో ఓ పూస కానీ రాయి కానీ అతికిస్తే అందమైన పువ్వు తయారవుతుంది. దీన్ని రబ్బర్ బ్యాండ్‌కి అతికించాలి. లేదంటే సింపుల్‌గా ఉండే మెటల్ క్లిప్స్ మార్కెట్లో దొరుకుతాయి. కొన్ని కొని పెట్టుకుంటే వాటికి కూడా అతికించుకోవచ్చు. క్లాత్ పెద్ద ఖరీదు కాదు కాబట్టి రకరకాల రంగుల బట్టని కొద్దికొద్దిగా కొని పెట్టుకుంటే, అవసరమైనప్పుడు క్షణాల్లో డ్రెస్సుకి తగ్గ క్లిప్ తయారు చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి... చూసి ప్రయత్నించవచ్చు. -
చెవులను చుట్టేసే అందం!
మేడ్ ఇన్ హోమ్ చక్కని డ్రెస్ వేసుకుంటాం. సమయానికి దానికి తగ్గ చెయిన్ ఉండకపోవచ్చు. ఆ చెయిన్‌కి తగ్గ ఇయర్ రింగ్స్ ఉండకపోవచ్చు. ఉన్నవాటితో అడ్జస్ట్ అవుదామంటే రంగులు మ్యాచ్ కాకపోవచ్చు. దాంతో పార్టీకి వెళ్లాలన్న మూడ్ ఖరాబు కావచ్చు. కానీ మీ దగ్గర క్విల్డ్ పేపర్స్, ఓ తీగ, కాస్త జిగురు ఉంటే చాలు... అప్పటికప్పుడు మీకు కావలసిన జ్యూయెలరీని మీరే తయారు చేసుకోవచ్చు. ఇంతకీ క్విల్డ్ పేపర్ అంటే తెలుసు కదా! చుట్లు చుట్లుగా ఉంటుంది. డెకరేషన్లో వాడుతుంటారు. ఇది చాలా రంగుల్లో ఉంటుంది. ఖరీదు తక్కువే కాబట్టి అన్ని రంగులూ తెచ్చి పెట్టుకోండి. రాగి, సిల్వర్ తీగలు కూడా దగ్గర ఉంచుకోండి. ఓ గమ్ బాటిల్ ర్యాక్‌లో పడేయండి. అంతే... ఇక మీరే జ్యూయెలరీ డిజైనర్ అవతారం ఎత్తవచ్చు. మీకు ఏ ఆకారంలో ఇయర్ రింగ్ లేక లాకెట్ కావాలో పేపర్ మీద గీసుకోండి. ఆ ఆకారంలో క్విల్డ్ పేపర్ పీసెస్‌ను పెట్టి అతికించుకుంటే పోండి. తర్వాత దాన్ని రాగి తీగకు అమర్చండి. ఒక బేస్ కానీ, ఔట్‌లైన్ కానీ కావాలనుకున్నప్పుడు... కాస్త మందంగా ఉండే కాగితాన్ని సన్నగా ఫ్రేమ్‌లా కట్ చేసి, దాని మధ్యలో క్విల్డ్ పేపర్ పీసెస్‌ని అతికించు కోవాలి. గ్రాండ్‌గా కావాలంటే కుందన్స్, చమ్కీల్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్‌ను బట్టి కలర్ కాంబినేషన్స్ ఎంచుకోండి. ఇక్కడున్న కొన్ని మోడల్స్ చూస్తే ఎలా చేయవచ్చో మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీ క్రియేటివిటీకి పని పెట్టండి!