breaking news
Live bombs
-
మెట్రో పిల్లర్ గుంతలో లైవ్ బాంబు..
ముంబయి : ముంబయిలో పెద్ద ప్రమాదం తప్పింది. మూడో దశ మెట్రో పనులు చేస్తున్న కార్మికులకు ఓ మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా ఓ పాత లైవ్ బాంబ్ లభ్యమైంది. అదృష్టం కొద్ది వారు వెలికి తీసే సమయంలో అది పేలలేదు. ఈ విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్య బృందం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదే ప్రాంతంలో దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే, ఆ క్రమంలో చిన్నసైజు పేలుడు సంభవించింది. అయితే ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై ఓ పోలీసు అధికారి వివరణ ఇస్తూ బుధవారం సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మెట్రో పిల్లర్ గుంట తీస్తుండగా తమకు ఓ అనుమానాస్పద వస్తువు దొరికిందంటూ వారికి ఫోన్ వచ్చింది. రోడ్డు ఉపరితలానికి ఓ మీటర్ లోతు తవ్వకాలు జరిపిన తర్వాత ఆ వస్తువు బయటపడింది. దాంతో పోలీసులు ముందే అనుమానించి బాంబ్ స్క్వాడ్‌కు ఫోన్ చేశారు. దీంతో దాన్ని నిర్వీర్యం చేశారు. ఆ బాంబులో స్ప్లింటర్లు, నెయిల్స్వంటివి కూడా చాలా ఉన్నాయి. ఆ బాంబు లభించిన చోట గతంలో ఓ టైరు షాపు, ప్రజా మరుగుదొడ్డి ఉండేదని అధికారులు తెలిపారు. ఏదైనా భారీ ఉగ్రవాద కుట్రతో ఆ బాంబును అమర్చి ఉంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఉగ్రవాదులు అమిత్‌షాను టార్గెట్ చేశారా..!
పాట్నా: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై బాంబు దాడులు చేయాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. పాట్నాలో పోలీసులు రెండు లైవ్ బాంబులను గుర్తించారు. గత ఏడాది ఏప్రిల్ 14న అక్కడ అమిత్ షా ర్యాలీని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా అదే రోజు, ఆ సమయానికే పేల్చేలా వాటిని అమర్చారని నిఘా అధికార వర్గాల సమాచారం. అయితే, అవి ఆ రోజు పేలలేదు. ఇటీవల ముగ్గురు తీవ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా పాట్నాలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. అందుకోసం బాంబులు కూడా అమర్చామని చెప్పడంతో వారి సమాచారం మేరకు గాలింపులు చేపట్టగా తాజా బాంబులు బయటపడ్డాయి. 2013 గాంధీ మైదాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం సందర్భంగా ఎలాంటి బాంబులను పేల్చాలని తీవ్రవాదులు నిర్ణయించుకున్నారో తిరిగి అలాంటి పేలుడు పదార్థాలే తాజాగా గుర్తించిన బాంబుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.