నీటి తొట్టిలో పడి బాలుడు మృతి
ఎల్కతుర్తి: కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం కొతులారం గ్రామంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటితొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన గట్టు శ్రీనివాస్, రజిత దంపతులకు లిఖ్యాత్(2) అనే కుమారుడున్నాడు. గురువారం రజిత ఉపాధి హామీ పనులకు వెళ్లగా శ్రీనివాస్ కుమారుడితో ఇంటి వద్దే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లిఖ్యాత్ ఆడుకుంటుండగా గమనించిన తండ్రి కాసేపు ఏమరుపాటుగా ఉన్నాడు. ఆ సమయంలోనే నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన బాలుడు అందులో పడి పోయాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ గమనించేసరికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.