breaking news
Lee Kuan Yew
-
గుడ్ బై గుడ్ బై మై డియర్ 'లీ'
సింగపూర్: సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ అంతిమయాత్ర ప్రారంభమైంది. గత సోమవారం చనిపోయిన ఆయన పార్థీవదేహాన్ని పార్లమెంటు భవనంలో పలువురు ప్రముఖుల దర్శనార్థం ఉంచిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం బ్రిగేడియర్ జనరల్ ఓంగ్జి చిన్ నేతృత్వంలోని ఎనిమిదిమంది సీనియర్ కమాండర్ల ఆధ్వర్యంలో లీ శవపేటికను పార్లమెంటు భవనం వెలుపలికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాలతో అశేష జనవాహిని అక్కడకు వచ్చింది. వీధుల్లో చేరిన జనం రోధిస్తూ 'గుడ్ బై గుడ్ బై మై డియర్ లీ' అంటూ వీడ్కోలు చెప్పారు. భారీ భద్రత బలగాలు మోహరించాయి. భారీ పరేడ్ నిర్వహించాయి. తమ చేతుల్లోని తుఫాకీలతో గౌరవ వందనం సమర్పించాయి. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఇతర దేశాల ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. -
ఆ ఆర్థిక అద్భుతం ఇక్కడ అసాధ్యం!
అవలోకనం చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే సింగపూర్ తరహా శరవేగ పురోగతిని సాధించగలిగాయి. కానీ లీ కాన్ యూ వంటి ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాల స్థితిని మార్చలేదు. కొద్ది రోజుల క్రితం కన్నుమూసిన సింగపూర్ నిర్మాత లీ కాన్ యూను అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ ప్రశంసిస్తూ ఆర్థిక రంగంలో ఆయన సాధించిన విజయాన్ని ఎత్తిచూపారు. ‘‘1965లో స్వాతంత్య్రం పొందినప్పుడు 500 డాలర్ల మేరకు ఉన్న సింగపూర్ జనాభా వార్షిక తలసరి ఆదాయాన్ని లీ ఆయన సహచరులు నేటికి 55,000 డాలర్లకు పెంచారు. ఒక తరం గడిచేసరికి సింగపూర్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా, ఆగ్నేయాసియాలో అతి ప్రధానమైన మేధో మహానగరంగా, ఆ ప్రాంతంలోనే అతి పెద్ద ఆసుపత్రుల నిలయంగా, అంతర్జాతీయ వ్యవ హారాలపై నిత్యం సదస్సులు జరిపేందుకు అత్యంత అనుకూల ప్రాంతంగా మారిపోయింది.’’ ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజ యం. చరిత్రలో అతి కొద్ది దేశాలు మాత్రమే ఇంత టి శరవేగ పురోగతిని సాధించగలిగాయి. అయితే సింగపూర్ కొన్ని ముందస్తు అనుకూలతలతో లీ చేతుల్లోకి వచ్చిందన్న విషయాన్ని మరువరాదు. శతాబ్దం పాటు అది బ్రిటిష్ పాలనలో ఉండేది. దానికి చక్కగా అభివృద్ధి చెందిన నౌకాశ్రయం ఉం డేది. పైగా, స్వాతంత్య్రం సిద్ధించేనాటికి ఈ నగరం వాణిజ్య కేంద్రంగా కూడా ఏర్పడి ఉంది. ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లయితే, 1965లో భారతీయుల తలసరి ఆదాయం 100 డాలర్లు మాత్రమే ఉండేది. సింగపూర్‌తో పోలిస్తే భారత్ ఆర్థికంగా మరింత అసమానతలతో కూడిన సమాజం. సింగపూర్‌కు మరో అనుకూలత కూడా ఉంది. అది అతి తక్కువ జనాభా ఉన్న అతి చిన్న దేశం. సింగపూర్‌లో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువమంది ప్రజలు చైనా నుంచి వలస వచ్చిన వ్యాపార వర్గాలతో కూడినవారు. నియంతృత్వ పాలనకు తలొగ్గి ఉండే కన్ఫ్యూసి యస్ సంస్కృతిని వీరు జీర్ణించుకుని ఉండేవారు. క్రమశిక్షణ, నిజాయితీ ప్రాతిపదికగా లీ పాలనా యంత్రాంగం ఈ అనుకూలతలను అద్భు తంగా ఉపయోగించుకుంది. దీని మూలంగానే ఆయన ఒక నిజమైన విశ్వ నగరాన్ని నిర్మించగలి గారు. సింగపూర్ సందర్శించిన ఎవరైనా సరే.. దాని సౌందర్యాన్ని, చక్కదనాన్ని ప్రశంసించకుండా ఉం డలేరు. అది అత్యంత సంపద్వంతమైనదీ, పరిశు భ్రమైనది మాత్రమే కాకుండా, జపాన్, యూరప్‌కు మధ్య ఉన్న ఏ నగరంకంటే కూడా ఉత్తమంగా అల రారుతూ వస్తోంది. దీన్ని సందేహించవలిసిన అవ సరం లేదు. ‘‘లీ దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడు. నాయకులలో ఆయన సింహం లాంటివారు. లీ కాన్ యూ జీవితం ఎవరికైనా అమూల్య పాఠా లను బోధిస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సింగ పూర్ నిర్మాతను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. మరి ఆ పాఠాలు ఏమిటి? భారత్ వంటి దేశాలకు వాటిని వర్తించవచ్చా? మోదీ వంటి దృఢమైన నేతలు (నిజమైన ప్రజాస్వామిక శక్తి లేని కిసింజర్ వంటి దృఢమైన నేతలు కూడా) లీని ప్రేమించటం సహజమే. ఎం దుకంటే సింగపూర్ నిర్మాణక్రమంలో లీ పొందిన అధికారం సంపూర్ణమైనది, నిరపేక్షమైనది. మరి అవధుల్లేని ఈ అధికారంలోని అనుకూలతలు ఏవి? సింగపూర్ ప్రధాన పత్రిక స్ట్రెయిట్స్ టైమ్స్‌లో 2012లో ఒక కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న లీ కెక్ చిన్ అనే 46 ఏళ్ల వయసున్న పాఠకుడు రాసిన ఒక ఉత్తరాన్ని చూద్దాం. ఆ పత్రికలో అచ్చయిన ‘రెండు పార్టీల వ్యవస్థ ఇక్కడ పనిచేయదు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై ఆ పాఠకుడు ఇలా స్పందించారు. ‘‘ప్రస్తుత సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ రెండు మంచి రాజకీయ పార్టీల వ్యవస్థను నెలకొల్పడానికి సింగపూర్‌లో తగినంత సమర్థులు లేరని భావిస్తుంటారు. అయితే దీన్ని మరింత విశా ల దృష్టితో చూడాలి. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న దేశంతో బహుళ పార్టీలవ్యవస్థ ఉన్న దేశాన్ని పోల్చి చూద్దాం. ఇండియా, చైనాలనే పరిశీలిద్దాం. ఈ రెండు దేశాలు అత్యంత భారీ జనాభాను, ఏకజాతీయ సంస్కృతిని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాలూ ఆర్థికంగా బాగానే అభివృద్ధి చెందుతున్నాయి. వీటి లో చైనానే ఉత్తమంగా పనిచేస్తోందనటం వాస్తవం. చైనాలో అమలవుతున్న ఏక పార్టీ ప్రభుత్వమే (ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కమ్యూనిస్టు ప్రభు త్వం) దీనికి కారణమని నేను భావిస్తున్నాను. ఒకే పార్టీ ఉనికిలో ఉన్నందున చైనా నేతలకు మొత్తం దేశాన్ని ఒకే దిశలో నడిపే వీలు చిక్కింది. మరోవై పున రెండు పార్టీలు లేదా బహుళ పార్టీల వ్యవస్థలో ప్రతి పార్టీ కూడా తమ ప్రయోజనాల కోసమే పోరా డతాయి కొన్ని సార్లు ఇవి దేశ పురోగతిని కూడా ఫణంగా పెడతాయి. ఉదాహరణకు, మౌలిక వస తుల కల్పనను వృద్ధి చేస్తే మొత్తం జాతి ప్రయోజ నం పొందుతుంది. కాని ఒక మంచి ప్రణాళికను కూడా ప్రతిపక్షం తన పార్టీ ప్రయోజనాల కోసం అడ్డుకోవచ్చు. దీని వల్ల ఒక దేశం ఆర్థికాభివృద్ధి విష యంలో మరోవైపుకు కొట్టుకుపోయి కృశించిపో వచ్చు. ఉదాహరణకు అమెరికానే తీసుకుందాం. ఒక రాజకీయపార్టీ మరొక రాజకీయ పార్టీని అధిగ మించాలని చేస్తున్న ప్రయత్నాల వల్ల గత దశాబ్దం పొడవునా అమెరికాలో ప్రగతి స్తంభించిపోయింది. మరోవైపున ఆసియా టైగర్లుగా పేరొందిన హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల ఆర్థిక వ్యవస్థలు సహజ వనరుల లేమి ఉన్న ప్పటికీ ముందడుగు వేస్తున్నాయి. కానీ సింగపూర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది తాజా ద్రవ్య సంక్షోభం నుంచి కూడా సాపేక్షికంగా తేరుకుని బతికి బట్ట కట్టింది. మన వ్యవస్థలోని ఏక పార్టీ ప్రభుత్వం దేశాన్ని ఒకే దిశగా నడిపించడమే దీనికి కారణమని నా విశ్వాసం. రెండు పార్టీలు లేదా బహుళ పార్టీ లను కలిగి ఉన్న పెద్ద దేశాలు తప్పులు చేసి కూడా బయటపడగలవు. కానీ సింగపూర్ వంటి చిన్న దేశానికి అలాంటి సందర్భంలో రెండో అవకాశానికి ఏమాత్రం వీలుండదు.’’ లీ ఎందుకు విజయం సాధించగలిగారో చెప్ప డానికి ఇదొక ప్రామాణిక వాదన. సింగపూర్‌పై ఆయన నియంతృత్వమే ఇందుకు కారణమని ఈ వాదన తేల్చి చెబుతుంది. జనాభాలో ప్రతిభ అపా రంగా ఉండటం, దేశం పరిమాణం చాలా చిన్నదై ఉండటంతో ఇక్కడి నియంతృత్వం పెద్దగా ప్రపం చం దృష్టిలో పడలేదు. అత్యున్నత ఆర్థిక పురోగతి సాధించడానికి ప్రభుత్వం అన్ని రంగాల్లో సమర్థవం తంగా చొచ్చుకుపోవలసి ఉంటుందనడంలో వివా దం లేదు. అయితే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ చేయిపెట్టి చొరబడటం (పౌరులు స్వచ్చందంగా అత్యవసర సేవలపై పన్ను విధింపునకు, తీర్పుల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి లోబడి ఉండటం) అనేది అతి పెద్దవీ, వనరుల కోసం కొట్టుమిట్టాడుతున్న భారత్ వంటి దేశాలకు సులభ పరిష్కారం కాదు. ఒక దృఢమైన నేతకు అధికారం అప్పగించడం అనేది భారత్ వంటి దేశాలను మార్చలేదు. బహు శా ఈ వాదనను లీ సమర్థిస్తారని నేననుకోవడం లేదు. తాను సాధించిన అద్భుత విజయం ఇండి యా లాంటి దేశాల్లో ఎందుకు సాధ్యపడలేదని లీ తరచుగా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. సింగపూర్‌లోని నియంతృత్వ పాలనకు వస్తు న్న చెడ్డపేరును ఎవరూ పెద్దగా పరిగణించడం లేదు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నా సింగపూర్ ఫ్రెండ్ పీటర్ ఓంగ్.. తన పౌరులపై సింగపూర్ విధించిన ఏకత్వంలో దాగిన క్రూరత్వంపై తీవ్ర అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. లీ నిరంకుశత్వం, విప రీత ధోరణులతో కూడిన పాలన (ఉదాహరణకు చూయింగ్ గమ్‌పై నిషేధం విధించడం, కొరడా లతో కొట్టడం వంటి తీవ్రమైన శిక్షలు) సింగపూర్ ప్రతిష్టకు ఎలాంటి విలువను ఆపాదించడానికి బదు లుగా నష్టం కలిగించాయని చెప్పక తప్పదు. అయితే 1965లో భారత్‌తో పోలిస్తే అయిదు రెట్లు ఎక్కువగా ఉన్న సింగపూర్ తలసరి ఆదా యాన్ని 2015 నాటికి 30 రెట్లు అధిక స్థాయికి తీసు కుపోవడంలో లీ సాధించిన విజయం అద్భుతమని నేను మళ్లీ చెబుతున్నాను. కానీ, లీ సింగపూర్ మన కు ఒక ఆదర్శం అని చెప్పడం తప్పు. పైగా లీ కానీ, లేదా ఆయన వంటి మరొక ప్రవక్త కానీ భారత్ వంటి దేశాల్లో ఈ ఆర్థిక అద్భుతాన్ని సాధిస్తారని భావించడం తప్పు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) ఈమెయిల్:aakar.patel@icloud.com -
లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని
టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91) అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. ఆయన 1965-1990 మధ్య కాలంలో సింగపూర్ ప్రధానిగా సేవలందించారు. అనంతరం ఆయన సీనియర్ మంత్రిగా, మంత్రి వర్గ సలహాదారుగా దేశానికి సేవలందించారు. -
సింగపూర్ పార్లమెంటుకు 'లీ' పార్థీవ దేహం
సింగపూర్: ఆధునిక సింగపూర్ వ్యవస్ధాపక ప్రధాని, పితామహుడు లీ క్వాన్ యూ పార్థీవ దేహాన్ని బుధవారం ఆ దేశ పార్లమెంటుకు తరలించారు. పలువురి సందర్శనార్ధం శనివారం వరకు అక్కడే ఉంచనున్నారు. ఇస్తానా గ్రౌండ్‌లోని ప్రధాని అధికారిక నివాసం శ్రీ తెమాసెక్ నుంచి పార్లమెంటుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 91 ఏళ్ల లీ క్వాన్ యూ గత కొద్ది కాలంగా న్యూమోనియాతో బాధపడుతూ సింగపూర్ జనరల్ ఆస్పత్రిలో సోమవారం తుది శ్వాస విడిచారు. -
'లీ' నాయకుల్లో సింహం: మోదీ
సింగపూర్: సింగపూర్ తొలిప్రధాని లీ కువాన్ యూ నాయకుల్లో సింహంలాంటివారని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క నాయకుడు ఆయనను అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గత కొద్ది కాలంగా న్యూమోనియా కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లీ కువాన్ యూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 1923 సెప్టెంబర్ 16న జన్మించిన ఆయన ఆసియా రాజకీయాల్లో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయనను ఆధునిక సింగపూర్ పితామహుడిగా అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. ఆగ్నేయాసియాలోని పలు దేశాలతో ఆయన ఎన్నో మైత్రి సంబంధాలు నెలకొల్పి అన్ని రంగాల్లో సింగపూర్ దూసుకెళ్లేలా కృషిచేశారు. చైనాకు చెందిన ఓ ధనికుల కుటుంబంలో జన్మించిన ఆయన పాఠశాల విద్యాభ్యాసం సింగపూర్‌లో న్యాయ విద్యను బ్రిటన్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పూర్తి చేశారు. సామ్యవాద సిద్ధాంతాన్ని నమ్ముకుని రాజకీయాల్లో ముందుకు వెళ్లి సింగపూర్ తొలి ప్రధాని అయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ముఖ్య నేతలు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ.. ప్రపంచ రాజకీయాలకు గొప్ప దిక్సూచిలాంటివారని కొనియాడారు. నివాళులర్పించినవారిలో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నారు. లీ కువాన్ యూ సింహంలాంటి వారని మోదీ కొనియాడారు.