breaking news
Lawyer Vaidyanathan
-
‘సుప్రీం’ దృష్టికి కృష్ణా బేసిన్ దుస్థితి
♦ నీటి కష్టాలను వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ♦ కోర్టు దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై కసరత్తు ♦ సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సగానికి పైగా జనాభాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే కృష్ణా నది బేసిన్లో ప్రస్తుత ఏడాదిలో నెలకొన్న కరువు పరిస్థితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగితే తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించాలని ప్రభుత్వం నిశ్చయానికి వచ్చినట్లు తెలిసింది. వచ్చిన నీటిని వచ్చినట్లు కర్ణాటక, మహారాష్ట్రలు ఎప్పటికప్పుడు ఒడిసిపట్టుకొని, వాడేసుకుంటూ పోతే దిగువన ఉన్న రాష్ట్రాలకు నీటి రాక ఎట్లాగో, లోటు వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో దిగువ రాష్ట్రాలు గుక్కెడు నీటి కోసం ఎక్కడికి వెళ్లాలో పరిష్కారం సూచించాలని ఎగువ రాష్ట్రాలను ప్రశ్నించేం దు కు సిద్ధమైంది. ఈ నెల 13న మరోమారు కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కేసు పూర్వాపరాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు సుప్రీంలో రాష్ట్రం తరఫు న్యాయవాది వైద్యనాథన్ శనివారం నీటిపారుదల అధికారులు, అంతర్రాష్ట్ర నదీ నిర్వహణ బోర్డు అధికారులు, రాష్ట్ర న్యాయవాదులతో సమావేశమయ్యారు. సుప్రీంలో వినిపించాల్సిన వాదనలపై వీరు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలంటూ గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకి కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై ఎలాంటి వాదనలు వినిపించాలన్న దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. నీరు తక్కువ ఉన్న ఏడాదుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్ధేశాలను బచావత్ కానీ, బ్రజేశ్ ట్రిబ్యునల్ కానీ చెప్పలేదన్న అంశాలపై చర్చించారు. కరువు పరిస్థితుల్లో తెలంగాణకు తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నీటిని విడుదల చేయాలని, దిగువ రాష్ట్రం ఏపీకి మిగిలిన మూడు రాష్ట్రాలు విడుదల చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. నీటి లోటు పరిస్థితుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలంటే విచారణలో కర్ణాటక, మహారాష్ట్రలు ఉండాల్సిందే అన్న వాదన వినిపించాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగులు జలాల పంపకంలో అన్యాయం.. వీటితో పాటే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం డిపెండబులిటీ మీద నీటి లభ్యతను లెక్కవేసి మిగులు జలాలను దిగువ రాష్ట్రం ఏపీ వాడుకునే వెసులుబాటు కల్పించగా, బ్రజేశ్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా నీటి లభ్యతను లెక్కించి మిగులు జలాలను పంచిం దని, దీనివల్ల ఎగువ రాష్ట్రాలకు లబ్ధి చేకూరగా, దిగువ రాష్ట్రాలు నష్టపోతున్నాయన్న విషయాన్ని మరోమారు కోర్టు దృష్టికి తేవాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులే ముందు, ముందు కూడా ఎదురైతే సాగర్ కింద ఆయకట్టుకు నీరివ్వలేని గడ్డు పరిస్థితులు నెలకొంటాయని, ఉన్న కాస్త నీటిని తాగు అవసరాల కోసం నిత్యం గుంజులాడుకోవాల్సి ఉంటుందని. రెండు రాష్ట్రాలకే వివాదాన్ని పరిమితం చేస్తే నీటి యుద్ధాలు మరింత తీవ్రం కాక తప్పదని.. దీనిని సుప్రీంకు అర్థమయ్యేలా వివరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలకే వాదనలు పరిమితం చేస్తే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన మిగులు జలాలపై ప్రశ్నించే అవకాశం తెలుగు రాష్ట్రాలకు దక్కదని, అదే జరిగితే తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ తదితర మిగులు జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్న అంశాలను కూడా వివరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. -
కేంద్రం నిర్ణయం వెనుక ఫైళ్లు ఇప్పించండి
కృష్ణా జలాల అంశంపై సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి తిరస్కరించిన ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వాటానే రెండు కొత్త రాష్ట్రాల మధ్య పంచాలని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఆధారమైన ఫైళ్లను తమకు ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. నదీ జలాల వివాదంపై గురువారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తుషార్ మెహతా కేంద్ర నిర్ణయానికి సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా నుంచే తెలంగాణ, ఏపీలకు పంచాలని... కర్ణాటక, మహారాష్ట్రల వాటాల్లో మార్పులు చేయవద్దని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీంతో ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు, సంబంధిత సమావేశాల మినిట్స్‌ను కేంద్రం నుంచి ఇప్పించాలని సుప్రీంకోర్టును తెలంగాణ అభ్యర్థించింది. అయితే ధర్మాసనం తాము ఆ పాత్ర పోషించలేమని వ్యాఖ్యానించింది. దీంతో తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ ఆ అభ్యర్థనను ఉప సంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో తమ వద్ద ఉన్న మార్గాంతరాలను అన్వేషించుకునేందుకు కొంత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్, అంధ్యార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలయాపనకే ఈ వాయిదా కోరడం తప్ప మార్గాంతరాలేవీ లేవన్నారు. అయితే వైద్యనాథన్ విజ్ఞప్తి మేరకు విచారణను జనవరి 13కు వాయిదా వేస్తూ... ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.