breaking news
land changes
-
భూ బదలాయింపుపై యథాతథస్థితి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఆర్‌ఏఆర్‌సీ) భూమిని ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణం కోసం బదలాయించే విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్, పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ తదితరులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. -
ఆ గ్రామంలో వింత పరిస్థితి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో వింత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి గ్రామంలో తరచూ భూమి కుంగిపోతుంది. దీంతో ఎప్పుడు ఎక్కడ భూమి కుంగుతుందోనన్న భయంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుధవారం 20 అడుగుల వెడల్పు మేర గుండ్రంగా భూమి పొరలు పొరలుగా చీలిపోయి 15 అడుగుల లోతుకు కుంగిపోయింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పలు మార్లు చోటు చేసుకున్నాయి. దీనికి కారణాలు తెలియడం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.