breaking news
Lance Armstrong
-
ఉవ్వెత్తున ఎగసి... ఉసూరుమని కూలి...
అది 1999 సంవత్సరం... ప్రతిష్టాత్మక ‘టూర్ డి ఫ్రాన్స్’ సైక్లింగ్ రేసు పోటీలు జరుగుతున్నాయి. అందరి దృష్టి అమెరికాకు చెందిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై నిలిచింది. అలా ఆకర్షించేందుకు అతనేమీ స్టార్ కాదు. అప్పటికే కొన్ని చెప్పుకోదగ్గ ఈవెంట్స్ గెలిచినా... దీంతో పోలిస్తే వాటి స్థాయి చిన్నదే. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో ఆటకు దూరమయ్యాడు. ఆ మహమ్మారితో పోరాడి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అభిమానమో, సానుభూతో కానీ చాలా మంది అతనికి మద్దతుగా నిలిచారు. అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ అదే జోరును మరో ఆరేళ్లు కొనసాగించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇదంతా డ్రగ్స్ పవర్ అని తెలిసిన రోజున ప్రపంచం నివ్వెరపోయింది. ఒక హీరో అందరి దృష్టిలో విలన్‌గా మారిపోయాడు. చిన్నప్పుడు స్విమ్మర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్మ్‌స్ట్రాంగ్ టీనేజీలో ట్రయాథ్లెట్గా కెరీర్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా మారిన అతను ఈ క్రమంలో కొన్ని విజయాలు సాధించాడు. ‘థ్రిఫ్ట్ ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ సైక్లింగ్’గా చెప్పుకునే పిట్స్బర్గ్, వర్జీనియా, ఫిలడెల్ఫియా కూడా ఉన్నాయి. ‘టూర్ డి ఫ్రాన్స్’లో కూడా కొన్ని రేసులు గెలిచినా... తగినంత గుర్తింపేమీ రాలేదు. క్యాన్సర్‌తో పోరు... సైక్లింగ్‌లో అద్భుతమైన కెరీర్‌ను ఆశిస్తున్న దశలో ఆర్మ్‌స్ట్రాంగ్‌పై పిడుగు పడింది. 25 ఏళ్ల వయసులోనే అతనికి ‘టెస్టిక్యులర్ క్యాన్సర్’ ఉన్నట్లు బయటపడింది. దాంతో జీవితంపై ఆశలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అప్పటికే శరీరంలోని ఊపిరితిత్తులు, మెదడు, పొత్తికడుపులోకి అది వ్యాపించిందని డాక్టర్లు తేల్చారు. ఇక ‘స్ట్రాంగ్’గా పోరాడాల్సిన సమయం వచ్చేసింది. కేవలం 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని చెప్పిన రోజు నుంచి బతుకును మార్చుకునేందుకు అతను విధితో పోరాడాడు. రెండేళ్లకుపైగా అన్ని రకాల పరీక్షలను, చికిత్సలను ఎదుర్కొన్నాడు. చివరకు క్యాన్సర్‌ను జయించాడు. అయితే అది చావు నుంచి మాత్రమే... ఆట మా త్రం కుదరదు అని కొందరు హెచ్చరించారు. కానీ లాన్స్ వదల్లేదు. మళ్లీ సైకిల్ తీసుకొని ట్రాక్‌పైకి బయల్దేరాడు. అద్భుత పురోగమనం... ఇలాంటి స్థితిలో ఒక వైద్యుడి ద్వారా యూఎస్ పోస్టల్ సర్వీస్ జట్టులో చోటు దక్కింది. అదే అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. 1998లో ‘టూర్ డి ఫ్రాన్స్’ బరిలోకి దిగినా ఫలితం దక్కలేదు కానీ తర్వాతి ఏడాది అతని జీవితం మలుపు తిరిగింది. 1999లో తొలిసారి అతను ఈ ప్రతిష్టాత్మక రేసులో గెలిచాడు. అది అక్కడితో ముగిసిపోలేదు. అదే జోరు కొనసాగిస్తూ వరుసగా 2000, 2001, 2002, 2003, 2004, 2005లలో కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా టైమ్ ట్రయల్ రేస్‌లో కాంస్యం కూడా దక్కింది. ఆ సమయంలో అతను ప్రపంచవ్యాప్తంగా సైక్లింగ్‌కు పర్యాయపదంగా నిలిచాడు. అశేష అభిమానులు, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ఒక్కటేమిటి ఏడేళ్ల పాటు అతను సైక్లింగ్ ప్రపంచాన్ని శాసించాడు. 2005 విజయం తర్వాత అతను ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే 2008లో పునరాగమనం చేసి కొన్ని రేస్‌లలో పాల్గొన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. డ్రగ్స్‌తో పతనం... ఆర్మ్‌స్ట్రాంగ్ కెరీర్లో డ్రగ్స్ ఆరోపణలు కొత్త కాదు. క్యాన్సర్‌లాంటి వ్యాధి నుంచి కోలుకొని ఈ తరహా విజయాలు సాధించడం అసాధ్యమంటూ చాలాసార్లు అతనిపై విమర్శలు వచ్చినా అతను ప్రతీసారి వాటిని కొట్టిపారేశాడు. అతని సైక్లింగ్ సహచరుడు ఫ్లాయిడ్ లాండిస్ 2012లో చేసిన డోపింగ్ ఆరోపణలు ఆర్మ్‌స్ట్రాంగ్ పరువు తీశాయి. మేమందరం డ్రగ్స్ తీసుకునేవాళ్లమంటూ అతను చెప్పుకోవడంతో బండారం బయటపడింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇవన్నీ నిజమని నిరూపించింది. తాను అమాయకుడిని అంటూనే దీనిపై అప్పీల్ వెళ్లకుండా ఆర్మ్‌స్ట్రాంగ్ మౌనం పాటించడంతోనే సైక్లింగ్ ప్రపం చం నివ్వెరపోయింది. తాజా పరిణామాలతో అతని నేరాన్ని ఒప్పు కున్నట్లుగా భావించి ఆర్మ్‌స్ట్రాంగ్ సాధించిన విజయాలన్నింటినీ లెక్క లోంచి తీసేశారు. వరల్డ్ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం అతను గెలిచిన ఏడు ‘టూర్ డి ఫ్రాన్స్’ టైటిల్స్‌ను రద్దు చేశారు. ఒలింపిక్ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. చివరకు అంగీకారం తనపై నిషేధం విధించాక ఏడాదికి ఆర్మ్‌స్ట్రాంగ్ నోరు విప్పాడు. ఇన్నేళ్లపాటు తాను జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారం డ్రగ్స్‌ను తీసుకున్నానని, తన విజయాలకు అదే కారణమని అంగీకరించాడు. అసలు డ్రగ్స్ లేకుండా ఏ రేసులోనూ బరిలోకి దిగలేదని బయటపెట్టాడు. దాంతో ఇన్నాళ్లూ అతనికి అండగా నిలిచిన స్పాన్సర్లు, కార్పొరేట్లు తిరగబడ్డారు. ఒక దిగ్గజ ఆటగాడిగా ప్రపంచం దృష్టిలో నిలిచి ఇప్పుడు ఇలా నైతికంగా పతనం కావడం నిజంగా విషాదం. -
తప్పు చేసి గర్ల్‌ఫ్రెండ్‌పైకి తోసి...
లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ నిర్వాకం లాస్ఏంజెల్స్: డో పింగ్‌లో చిక్కి నిషేధానికి గురైన సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. దా దాపు రెండు నెలల క్రితం కొలరాడాలో దురుసుగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన అతను, ఈ నేరాన్ని తన గర్ల్‌ఫ్రెండ్ అనా హన్సెన్పైకి తోసివేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తానే డ్రైవ్ చేస్తున్నట్లుగా ముందుగా అంగీకరించిన అనా, ఆ తర్వాత పోలీసు విచారణలో ఆర్మ్‌స్ట్రాంగ్‌దే తప్పని బయటపెట్టింది. ప్రమాదం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మ్‌స్ట్రాంగ్‌కు 90 రోజుల జైలుశిక్షతో పాటు 300 డాలర్ల వరకు జరిమానా పడవచ్చు. -
ఇదో ‘రక్త చరిత్ర’
పెచ్చరిల్లుతున్న బ్లడ్ డోపింగ్ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న స్టార్లు డోపింగ్‌కు బానిసలవుతున్న అథ్లెట్లు మనిషి బ్రతకడానికి రక్తం ఎంత అవసరమో... పోటీల్లో విజయం సాధించడానికీ దాన్ని అంతకంటే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు కొంత మంది అథ్లెట్లు. క్రీడా జగత్తును పట్టి పీడిస్తున్న డోపింగ్ మహమ్మారికి ఇదో అనువైన ‘మూలకంగా’ మారిపోయింది. అధునాతన పద్ధతులకు, కఠినమైన పరీక్షలకు కూడా దొరకకుండా... స్టార్లుగా వెలుగొందుతున్న అథ్లెట్లు దీనికి బానిసలుగా మారుతున్నారు. అసలు ఈ బ్లడ్ డోపింగ్ ఎలా చేస్తారు. దాని వల్ల జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం! డోపింగ్... ఒకప్పుడు దీని పేరు వింటేనే వణికిపోయే క్రీడాకారులు ఇప్పుడు ఈ పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంటున్నారు. దశాబ్దాల కిందట స్వశక్తితో, పట్టుదలతో పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అథ్లెట్లు కొందరైతే.. ఆధునిక యుగంలో డ్రగ్స్ జాడ్యంతో మరికొంత మంది అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. ఒక్కో క్రీడల్లో ఒక్కో రకంగా డోపింగ్ చేస్తూ అటు అభిమానులను, ఇటు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇదంతా దేనికంటే కేవలం ఒకే ఒక్క ‘విజయం’ కోసం. సింగిల్ నైట్‌లో స్టార్‌గా మారిపోవడానికి డోపింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండు అత్యంత అధునాతన డోపింగ్ పద్ధతుల ద్వారా అథ్లెట్లు క్రీడా ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తున్నారు. బ్లడ్ డోపింగ్ క్రీడల్లో బ్లడ్ డోపింగ్ ఓ సంచలనం. అథ్లెట్ల ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. పోటీల సందర్భంగా మామూలు అథ్లెట్లు స్వీకరించిన ఆక్సిజన్ శాతం కంటే ఈ డోపింగ్‌కు పాల్పడిన క్రీడాకారులు స్వీకరించే శాతం అధిక మొత్తంలో ఉంటుంది. దీని కోసం రక్త ప్రవాహంలో ఎర్ర రక్త కణాలను భారీ సంఖ్యలో పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. దీని వల్ల చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్... ఊపిరితిత్తుల నుంచి అస్థిపంజర కండరాలకు చేరుతుంది.. ఫలితంగా అథ్లెట్‌కు అలసట అనేదే తెలియదు. అయితే ఆక్సిజన్ లభ్యత, హిమోగ్లోబిన్ మాస్, గుండె పంపింగ్ సామర్థ్యంపై ఈ డోపింగ్ ఆధారపడి ఉంటుంది. సాధారణ అథ్లెట్ గుండె 80 శాతం వరకు అవుట్‌పుట్‌ను ఇస్తే... అదనపు ఆక్సిజన్‌ను తీసుకునే హృదయం 90 నుంచి 95 శాతం వరకు అవుట్‌పుట్‌ను ఇస్తుంది. హిమోగ్లోబిన్ మాస్‌ను పెంచడం ద్వారా ధమనుల్లో ఆక్సిజన్ శాతం గణనీయంగా మెరుగుపడుతుంది. బ్లడ్ డోపింగ్ ముఖ్యంగా మూడు రకాలుగా చేస్తారు. ఎరిత్రోప్రొటీన్ (ఈపీఓ) ఎరిత్రోప్రొటీన్ అనేది గ్లైకో ప్రొటీన్ హార్మోన్. దీన్ని మధ్యస్త ఫైబ్రోబ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి. ఎముక మజ్జలో ఎరిత్రోపాయిసిస్ (రక్త కణాల ఉత్పత్తి) జరుగుతుందనడానికి ఇది సంకేతంగా పని చేస్తుంది. అయితే హీమోసైటోబ్లాస్ట్ (ఆర్బీసీ మూల కణాలు) కణాల పని తీరును పెంచడం ద్వారా రక్తంలో ఆక్సిజన్ తీసుకొని వెళ్లే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. క్యాన్సర్ పేషంట్లలో కీమోథెరపీ, రేడియోషన్ వల్ల కలిగే దుష్ర్పభావాల నుంచి తట్టుకోవడానికి వీలుగా ఈపీఓను మొట్టమొదట అభివృద్ధి చేశారు. ఇది గాయాలు తొందరగా మానేందుకు కూడా దోహదం చేస్తుంది. అయితే సైక్లిస్ట్‌లు, అమెచ్యూర్ అథ్లెట్లు శక్తివంతమైన డ్రగ్‌ను తీసుకోవడం ద్వారా ఈపీఓను పెంచుకుంటారు. హైపోక్సియా ఇండ్యూసబుల్ ఫ్యాక్టర్ (హెచ్ఐఎఫ్-స్టాబిలైజర్) దీన్ని హెచ్ఐఎఫ్ స్టాబిలైజర్ అని కూడా అంటారు. శరీరంలోని ఈపీఓను ఇది యాక్టివేట్ చేస్తుంది. రక్తహీనత, ప్రేరిత హైపోక్సియా, జీవక్రియ ఒత్తిడి, వ్యాసోగ్లుకోజెన్సిస్ ప్రభావాల నుంచి బాగా కాపాడుతుంది. చాలా మంది సైక్లిస్ట్‌లు కోబాల్ట్ క్లోరైడ్ / డిస్ఫెరాక్సిమైన్తో కలిపి హెచ్ఐఎఫ్ స్టాబిలైజర్ను తీసుకుంటారు. శరీరంలో సాధారణంగా ఉండే ఈపీఓ హార్మోన్‌ను ఇది ఉత్తేజపర్చడంతో పాటు నియంత్రణలోకి తీసుకుంటుంది. రక్తంలో ఆక్సిజన్ పరిమాణం 40 ఎమ్ఎమ్హెచ్జీ వరకు ఉంటే మూత్ర పిండాల నుంచి ఈపీఓ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా హిమోగ్లోబిన్ రవాణా పెరుగుతుంది. రకరకాల డ్రగ్స్ సమ్మేళనాలను తీసుకోవడం ద్వారా నిరంతరంగా ఈపీఓ ఉత్పత్తి జరుగుతుంది. రక్త మార్పిడి ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు అథ్లెట్లు చేస్తున్న అత్యాధునిక డోపింగ్ ప్రక్రియ ఇది. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రక్తాన్ని తిరిగి అదే వ్యక్తిలోకి ప్రవేశపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. పోటీలకు ముందు జరిగే శిక్షణ శిబిరాలు, ప్రాక్టీస్ క్యాంప్‌ల్లో అథ్లెట్లు దీనికి సంబంధించిన డ్రగ్స్‌ను స్వీకరిస్తారు. తర్వాత అథ్లెట్ల శరీరంలోంచి 1 నుంచి 4 యూనిట్ల రక్తాన్ని సేకరిస్తారు. దాన్ని పరీక్ష నాళికలో తీసుకుని హైస్పీడ్ మెషిన్లో సెంట్రిఫ్యూజ్ చేస్తారు. ఫలితంగా ఎర్రరక్త కణాలు పూర్తిగా అడుగు భాగంలోకి చేరుకుంటాయి. పై భాగంలో సీరమ్ మాత్రమే మిగులుతుంది. ఈ సీరాన్ని తిరిగి అథ్లెట్ల రక్తంలోకి ప్రవేశపెడతారు. ఆర్బీసీని మాత్రం అవసరమైనన్ని రోజులు 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద నిలువ చేస్తారు. పోటీలకు వారం రోజుల ముందు ఈ ఆర్బీసీని తిరిగి అథ్లెట్ల శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్‌బీసీల సంఖ్య రెట్టింపవుతుంది. ఫలితంగా ఆక్సిజన్ మోసుకెళ్లే శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీంతో అథ్లెట్ల కండరాలకు పుష్కలంగా ఆక్సిజన్ అందడంతో శ్రమ, అలసట అనేది తెలియదు. అయితే కొన్నిసార్లు ఒకే వ్యక్తిలోని రక్తాన్ని సేకరిస్తారు. మరికొన్ని సార్లు ఇతర వ్యక్తుల్లోని బ్లడ్‌ను తీసుకుంటారు. ఒక్కోసారి డోప్ టెస్టుకు ఒకటి, రెండు రోజుల ముందు రక్తాన్ని బయటకు తీసి పరీక్ష తర్వాత శరీరంలోకి ఎక్కించుకుంటారు. జీన్ డోపింగ్ రెపోఆక్సిజన్ పద్ధతి ద్వారా జీన్ డోపింగ్‌కు పాల్పడటం ఇప్పుడొస్తున్న అత్యాధునిక ప్రక్రియల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. డోపింగ్ పరీక్షలకు ఏమాత్రం దొరకని ఈ పద్ధతిలో అథ్లెట్ల ప్రదర్శన కృత్రిమంగా మెరుగుపరుస్తారు. అయితే దీనివల్ల శరీరంలో శాశ్వత దుష్ర్పభావాలు కలుగుతాయి. ఇలా పని చేస్తుంది... తీవ్రమైన రక్తహీనత ఉన్న వారిలో జీన్ థెరపీ చికిత్స ద్వారా రెపోఆక్సిజన్ను పెంపొందిస్తారు. శరీరానికి హాని చేయని ఓ వైరస్‌ను తీసుకొని దానిలో ఎరిత్రోప్రోటీన్‌ను క్రోడీకరించిన జన్యువును ప్రవేశపెడతారు. ఫలితంగా ఆ ప్రదేశంలో గణనీయంగా ఆర్బీసీ ఉత్పాదన జరుగుతుంది. శరీరంలోకి ప్రవేశపెట్టిన ఆతిధేయి కణాలు లోపల ఉండే జన్యువును యాక్టివ్ ప్రోటీన్స్గా మారుస్తుంది. దీంతో ఫారిన్ జీన్ సొంతంగా కణాలను ఏర్పర్చుకుంటుంది. డీఎన్ఏ ప్యాకేజి కలిగిన వైరస్‌ను అథ్లెట్ శరీరంలో అనుకున్న ప్రదేశంలో ప్రవేశపెడతారు. ఫలితంగా అథ్లెట్ రక్త ప్రవాహంలో నుంచి కండరాల్లోకి వెళ్తుంది. కొన్నిసార్లు వైరస్లు కేవలం ప్రదర్శనను మెరుగుపర్చే జన్యువులను మాత్రమే ప్రవేశపెట్టవు. అలాంటప్పుడు కొవ్వు కణాలతో కూడిన నేక్డ్ డీఎన్ఏను నేరుగా కండరాల్లో ప్రవేశపెడతారు. తర్వాత వైరస్‌ల్లోని ఫారిన్ డీఎన్ఏ కండరాల్లోకి చేరడంతో పాటు కణంలోని క్రోమోజోమ్‌లతో రూపాంతరం చెందుతుంది. తర్వాత ఏర్పడే కొత్త జన్యువు ఎరిత్రోప్రోటీన్ ఉత్పత్తిని ఉద్దీపనం చేస్తుంది. కొన్నిసార్లు ఫారిన్ డీఎన్ఏను ప్రవేశపెట్టినప్పుడు కండరాలు తన సొంత జన్యువుల ప్రభావాన్ని కోల్పోతాయి. ఫలితంగా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. రూపాంతరం చెందిన జన్యువు ఎరిత్రోప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త ప్రవాహం ద్వారా ఇది ఎముక మజ్జను చేరి ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అథ్లెట్ల శరీరంలో ఉండాల్సిన పరిమాణంలో కంటే ఎక్కువ సంఖ్యల్లో ఆర్బీసీ ఉన్నట్లయితే ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం గణనీయంగా పెరిగిపోతుంది. ఓవరాల్‌గా మనిషి తీసుకొనే ఆక్సిజన్‌కు రెట్టింపు స్థాయిలో లభించినప్పుడు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా అథ్లెట్స్‌కు శ్రమ, అలసట అనేది తెలియదు. ఆర్మ్‌స్ట్రాంగ్... అతి పెద్ద దోషి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్... సైక్లింగ్‌లో ఎదురులేని అమెరికా ఆటగాడు. ఏడుసార్లు టూర్ డి ఫ్రాన్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న అథ్లెట్. వృషణాల క్యాన్సర్‌ను జయించిన తర్వాత తిరిగి సైక్లింగ్ రేసులో పాల్గొనడంతో ఒక్కసారిగా క్రీడాలోకంలో హీరోగా మారిపోయాడు. కానీ ఇంత గొప్ప కెరీర్ వెనుక చీకటి అగాధం ఉందంటే తొలినాళ్లలో ఎవరూ నమ్మలేకపోయారు. 1999 టూర్ డి ఫ్రాన్స్ రేసు సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్ డోపింగ్‌కు పాల్పడినట్లు... గతంలో అతని ప్రత్యర్థులుగా ఉండి తర్వాత జర్నలిస్ట్లుగా మారిన పాల్ కిమేగ్, క్రిస్టోఫర్ బ్యాసన్లు బహిర్గతం చేశారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడం, ఏ పరీక్షలోనూ విఫలం కాకపోవడంతో అధికారులు కూడా మిన్నకుండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక డోపింగ్ పరీక్షలు ఎదుర్కొన్నాన్నంటూ 2009లో ఆర్మ్‌స్ట్రాంగ్ ఏకంగా 24 పరీక్షల ఫలితాలను మీడియా ముందుపెట్టాడు. 2010లో తనతో పాటు ఆర్మ్‌స్ట్రాంగ్ మరికొంత మంది సహచరులు డోపింగ్‌కు పాల్పడినట్లు ఫ్లయిడ్ లెండిస్ అంగీకరించడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. యూఎస్ పోస్టల్ జట్టుపై ఫెడరల్ డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించింది. 2009, 10 మధ్యకాలంలో సైక్లిస్ట్‌కు చేసిన రక్త పరీక్షలపై మళ్లీ పరిశోధనలు, సహచరుల వాంగ్మూలాలతో ఆర్మ్‌స్ట్రాంగ్ బ్లడ్ డోపింగ్‌కు పాల్పడినట్లు యూఎస్‌ఏడీఏ తిరుగులేని ఆధారాలు సంపాదించింది. కొన్ని నెలల విచారణ తర్వాత జనవరి 2013లో ఆర్మ్‌స్ట్రాంగ్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతను గెలిచిన అన్ని టైటిళ్లను వెనక్కి తీసుకున్నారు.