breaking news
ladoos
-
జెండా పండుగ వంటలు
స్వాతంత్య్ర దినోత్సవం... మువ్వన్నెల జెండా దేశమంతా రెపరెపలాడుతుంది. ఇంటింటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. మువ్వన్నెల వంటలు తయారు చేసి, జాతీయజెండాకు వందనం చేద్దాం. తిరంగా ఢోక్లా కావలసినవి: బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; పుల్ల పెరుగు – కప్పు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూను; పుదీనా తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; పసుపు – టీ స్పూను; మిరప కారం– టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; నువ్వులు – టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం, సెనగ పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, విడివిడిగా సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ∙నీరంతా ఒంపేసి మిక్సీలో వేసి విడివిడిగా గారెల పిండిలా ఉండేలా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙పుల్ల పెరుగు, కొద్దిగా వేడినీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, ఆరుగంటలసేపు పిండిని వదిలేయాలి ∙మిక్సీలో పుదీనా, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙నానిన పిండికి ఉప్పు, అల్లం తురుము జత చేయాలి ∙పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగం పిండికి పసుపు, మిరప కారం జత చేయాలి ∙ఒక భాగానికి మెత్తగా చేసిన పుదీనా, పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙ఒక పాత్ర తీసుకుని నూనె పూయాలి ∙ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని సమానంగా వేసి, ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి ∙పాత్రను బయటకు తీసి, దాని మీద, తెల్లటి పిండి వేసి మళ్లీ ఆవిరి మీద ఉంచి రెండు నిమిషాల తరవాత ఆ పాత్రను బయటకు తీయాలి ∙పసుపు, మిరపకారం జత చేసిన మిశ్రమాన్ని సమానంగా పరిచి ఆవిరి మీద బాగా ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేయించి తీసేసి, ఢోక్లా మీద సమానంగా పోయాలి. కాజు కట్లీ కావలసినవి: జీడి పప్పు – 2 కప్పులు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; పాలు – టేబుల్ స్పూను; పంచదార పాకం కోసం; నీళ్లు – కప్పు; పంచదార – కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుడ్ కలర్ – ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులు (చిటికెడు చొప్పున) తయారీ: ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక, ఏలకుల పొడి జత చేసి, ముదురు పాకం పట్టి పక్కన ఉంచాలి ∙జీడిపప్పును మిక్సీలో వేసి మధ్యమధ్యలో ఆపుతూ తిప్పి, ఆ పొడిని జల్లించాలి ∙ఇలా మొత్తం జీడిపప్పులను మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పొడి వేసి దోరగా వేయించాలి ∙పంచదార పాకం జత చేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా దగ్గర పడి, అంచులను వదిలేస్తుండగా దింపేసి, కొద్దిగా చల్లారనివ్వాలి ∙చేతికి నెయ్యి రాసుకుని, పాలు జత చేసి, మెత్తగా అయ్యేవరకు కలిపి మూడు భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగానికి ఆకు పచ్చ రంగు రెండు చుక్కలు, ఆరెంజ్ రంగు రెండు చుక్కలు విడివిడిగా కలిపి పక్కన ఉంచాలి ∙ముందుగా ఆకుపచ్చరంగు, ఆ తరవాత తెలుపు రంగు, చివరగా కాషాయ రంగు ఉంచి చేతితో జాగ్రత్తగా అదిమి, సుమారు పది నిమిషాలు ఫ్రిజ్లో ఉంచి తీసి, కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కోకోనట్ గుల్కండ్ కావలసినవి: తెలుపు కోసం, తాజా కొబ్బరి తురుము – 3 అర కప్పులు; స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – 3 పావు కప్పులు; గుల్కండ్ రోజ్ పెటల్ ప్రిజర్వ్ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము – రోలింగ్ కోసం తగినంత; క్యారట్ ముక్కలు – పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఆరెంజ్ ఫుడ్ కలర్ – కొద్దిగా; గ్రీన్ ఫుడ్కలర్ – కొద్దిగా. తయారీ: తెల్ల లడ్డు... స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక క్యారట్ ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి, సన్నటి మంట మీద దోరగా (రంగు మారకుండా) వేయించాలి ∙కండెన్స్డ్ మిల్క్ జత చేసి, ఆపకుండా కలపాలి ∙అంచులు విడుతుండగా, దింపి చల్లారనిచ్చాక మూడు భాగాలు చేయాలి ∙ఒక భాగం నుంచి కొద్దిగా చేతిలోకి తీసుకుని, మధ్యలో కొద్దిగా గుల్కండ్ ఉంచి లడ్డూ మాదిరిగా చేసి, ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన ఉంచాలి (ఇలా తెలుపు లడ్లు సిద్ధం చేసుకోవాలి) ∙రెండో భాగానికి క్యారట్ మిశ్రమం, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు చేసి, కొబ్బరి పొడిలో దొర్లించితే కాషాయ రంగు లడ్లు తయారైనట్లే ∙మూడో భాగానికి ఆకు పచ్చ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు తయారుచేసుకుని, కొబ్బరి పొడిలో దొర్లించితే మువ్వన్నెల కోకోనట్ గుల్కండ్ రెడీ. -
గణనాథుల చెంతకు ఘనమైన లడ్డూలు
‘భక్తాంజనేయ’ నుంచి గాజువాకకు 7,885 కేజీల లడ్డూ తాపేశ్వరం ‘సురుచి’ నుంచి ఖైరతాబాద్కు 5,150 కేజీల లడ్డూ మండపేట రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్లోని తాపేశ్వరంలో తయారైన 2భారీ లడ్డూలు గురువారం గణనాథులను చేరేందుకు తరలివెళ్లాయి. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లడ్డూగా తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు సారథ్యంలో తయారైన 7,885 కిలోల లడ్డూ విశాఖలోని గాజువాకకు తరలింది. ఈ లడ్డూను ఎంతో శ్రమకోర్చి రెండు భారీ క్రేన్ల సాయంతో 16 చక్రాల వాహనంలోకి ఎక్కించి, భారీ ఊరేగింపు నడుమ విశాఖ తరలించారు. అక్కడి శ్రీ నవతరం యూత్ నెలకొల్పనున్న 60 అడుగుల గణనాథుని చెంత దీనిని ఉంచనున్నారు. సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు ఆధ్వర్యంలో తయారైన 5,150 కేజీల లడ్డూను.. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతిష్ఠించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ చేతిలో ఉంచేందుకు తరలించారు. లడ్డూను భారీ క్రేన్ సహాయంతో ప్రత్యేక వాహనంలోకి చేర్చి హైదరాబాద్ తరలించారు. అంతకుముందు మల్లిబాబు దంపతులు లడ్డూకు ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూను మంగళవాయిద్యాలతో, బాణసంచా కాల్పుల మధ్య ఊరేగించారు. ఖైరతాబాద్ గణపతికి లడ్డూను ఉచితంగా అందించడం వరుసగా ఇది ఐదోసారని మల్లిబాబు చెప్పారు. కాగా, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఈ లడ్డూల బరువు పరిశీలించారు.