
ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
జెండావందనానికి బూందీ, లడ్డూలు, చాకెట్లు.. జనాలకు పంచడం ఆనవాయితీ. అయితే పంద్రాగస్టు వేడుకల్లో తనకు అవమానం జరిగిందని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. దెబ్బకు దిగొచ్చిన అధికారులు అతని క్షమాపణలు చెప్పి.. తప్పును సరిదిద్దుకున్నారు. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసా?.. అతని చేతిలో ఒక్క లడ్డూనే పెట్టడం!!.
మధ్యప్రదేశ్ భింద్ జిల్లా నౌద్ గ్రామంలో ఓ వ్యక్తి పంచాయితీ ఆఫీస్ వద్ద విచిత్రమైన పంచాయితీ పెట్టాడు. అక్కడి గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో జెండా వందనం పూర్తయ్యాక.. జనాలకు లడ్డూలు పంచారు. అయితే అందరికీ రెండు లడ్డూలు ఇచ్చి.. చివరాఖరిలో అటెండర్ తన చేతిలో ఒక్క లడ్డూనే పెట్టడాన్ని కమలేష్ కుష్వాహా భరించలేకపోయాడు. తనకూ రెండు లడ్డూలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే అతనికి అటెండర్ నుంచి తిరస్కరణే ఎదురైంది.
దీంతో రోడ్డు మీద నిలబడి నిరసన తెలియజేశాడు. సీఎం హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి తనకు జరిగిన ‘అన్యాయం’ గురించి వివరించాడు. అయితే కమలేష్ చర్యతో అక్కడివాళ్లంతా కంగుతిన్నారు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారేమో.. మార్కెట్ వెళ్లి కేజీ స్వీట్లు తెచ్చి కమలేష్ చేతిలో పెట్టి సారీ చెప్పారు.
2020లో ఇదే జిల్లా నుంచి సీఎంఓకు ఓ అరుదైన ఫిర్యాదు వెళ్లింది. బోరు పంపు పని చేయడం లేదంటూ ఓ గ్రామస్తుడు ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే దానికి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE) శాఖకు చెందిన అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీఆర్ గోయల్ ఫిర్యాదు చేసిన వ్యక్తిని చంపి పాతరేస్తానంటూ అనుచితంగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ కాగా.. తాను అసలు ఆ బదులు ఇవ్వలేదని, ఎవరో తన ఐడీని దుర్వినియోగం చేసి అలా చేసి ఉంటారని వివరణ ఇచ్చారాయన.