కుజ్నెత్సోవాదే టైటిల్
సింగపూర్:మాస్కోలో జరిగిన క్రెమ్లిన్ కప్ టైటిల్‌ను రష్యా టెన్నిస్ క్రీడాకారిణి కుజ్నెత్సోవా నిలబెట్టుకుంది. శనివారం జరిగిన తుది పోరులో కుజ్నెత్సోవా 6-2, 6-2 తేడాతో డారియా గావ్రిలివో(ఆస్ట్రేలియా)పై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన టైటిల్ పోరులో కుజ్నెత్సోవా ఆద్యంతం ఆకట్టుకుంది. గంట 13 నిమిషాలపాటు జరిగిన పోరులో కుజ్నెత్సోవాకు తిరుగేలేకుండా పోయింది. ఈ టైటిల్ సాధించడంతో కుజ్నెత్సోవా సీజన్ ముగింపు టోర్నీ డబ్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉన్న వాళ్లు మాత్రమే డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో ఆడతారు. అయితే గాయం కారణంగా అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు.