ఎరువుల పంపిణీలో నగదు బదిలీ తగదు
పెదపాడు : ఎరువుల పంపిణీలో నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీలో తీసుకువస్తున్న నగదుబదిలీ విధానం వల్ల వాస్తవ సాగుదారులకు ఎరువుల ధరలు పెరిగి నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో వ్యవసాయం చేయని భూయజమానులకే సబ్సిడీ వెళుతుందని, కౌలు రైతులు నట్టేట మునుగుతారని చెప్పారు. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి పంటల పండించలేక ప్రైవేట్ అప్పుల కోసం తిరుగుతున్నారని, అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించుకోవడానికి ఉపయోగించే రెయిన్‌గన్స్ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతు సంఘం మండల అధ్యక్షుడు జి.సురేష్ పాల్గొన్నారు.