breaking news
kotipi
-
కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి
భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా హిందూపురం మండలంలోని కొటిపి చెరువు వద్ద వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయం విరాజిల్లుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చాలని చీర, సారే, గాజులు సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో ఆలయం వద్ద భక్తులు నిద్ర చేస్తుంటారు. ఈ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చోళులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి సమర్పించిన కానుకలను బహిరంగంగా పెట్టి ఉంటారు. వీటిని ఎవరూ తీసుకెళ్లారు. సంవత్సరాల తరబడి ఆలయం ముఖద్వారం వద్ద ఎడమవైపున ఉన్న నాగుల కట్ట వద్ద గుట్టగుట్టలుగా గాజులు, చీరలు పడేసి ఉంటారు. ఆలయానికి చేరుకోవాలంటే హిందూపురం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి కొటిపి చెరువును చేరుకోవాల్సి ఉంటుంది. హిందూపురం నుంచి ప్రత్యేకంగా ఆటోలు తిరుగుతుంటాయి. లేదంటే సొంత వాహనాల్లో వెళ్లి రావచ్చు. - హిందూపురం రూరల్ -
ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం
హిందూపురం రూరల్ : మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గొర్రెలు, మేకలను బలి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి మూలవిరాట్ విగ్రహాన్ని ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకువచ్చి రథోత్సవంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి నామస్మరణల నడుమ భక్తులు రథాన్ని ముందుకు లాగారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు బెంగళూరు, గౌరిబిదనూరు తమిళనాడు నుంచి అమ్మవారు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై అమ్మవారికి చీర, సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.