breaking news
Konda vagu
-
గల్లంతైన ముగ్గురూ మృతి
వాగులో కిలోమీటరు దూరం కొట్టుకొచ్చిన మృతదేహాలు ఆచూకీ కోసం గంటలపాటు శ్రమించిన సిబ్బంది చినకోండ్రుపాడు (ప్రత్తిపాడు): కొండవాగులో శనివారం సాయంత్రం గల్లంతైన ముగ్గురూ మృతిచెందారు. వారి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. నడింపాలెం పంచాయతీలోని చినకోండ్రుపాడుకు చెందిన ముగ్గురు కూలీలు స్థానికంగా ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ వాగులో గల్లంతైన సంగతి తెలిసిందే. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గల్లంతైంది ఇలా.. వాగులో ముగ్గురూ గల్లంతైన ఘటనపై తొలుత రకరకాల ప్రచారం జరిగింది. చినకోండ్రుపాడుకు చెందిన కుంటిగొర్ల చంద్రిక (13), గడ్డం కోటేశ్వరమ్మ (45), చాగంటి సామ్రాజ్యం (45), పల్లబోతుల శ్రీనాథ్ (12) శనివారం ఉదయం స్థానికంగా ఉన్న ఒక పౌల్ట్రీ ఫాంలో కూలి పనులకు వెళ్లారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో నలుగురూ ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నలుగురూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని వాగు దాటేందుకు ప్రయత్నించారు. వాగు ఉధృతికి నలుగురూ వాగులోకి కొట్టుకుపోయారు. అదే సమయంలో శ్రీనాథ్ ఓ చెట్టును పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగాడు. అక్కడి నుంచి గ్రామంలోకి వచ్చిన శ్రీనాథ్ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ఈ విషయం వెలుగుచూసింది. విస్తృతంగా గాలింపు.. గల్లంతైన వారి కోసం శనివారం రాత్రంతా రెవెన్యూ, పోలీస్ అధికారులు గాలింపు చేపట్టినప్పటికీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహాలను గుర్తించటం వీలు పడలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచే గాలింపు ప్రక్రియ ప్రారంభమైంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్పెషల్ స్రై్టకింగ్ ఫోర్స్, స్థానికులు వేకువజాము నుంచే రంగంలోకి దిగారు. తొలుత కుంటిగొర్ల చంద్రిక, గడ్డం కోటేశ్వరమ్మల మృతదేహాలు లభ్యమయ్యాయి. చాగంటి సామ్రాజ్యం మృతదేహం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరుగంటల పాటు విస్తృత గాలింపు అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో సామ్రాజ్యం మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాలు దాదాపు కిలోమీటరు దూరం కొట్టుకొచ్చాయని సిబ్బంది తెలిపారు. బాధితురాలి భర్త కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు ఎస్ఐ వీరేంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యల్లో 20 మంది ఎన్డీఆర్ఎఫ్, ఏడుగురు ఫైర్, వివిధ విభాగాలకు చెందిన 30 మంది పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు గాలింపు చర్యలకు సహకరించారు. గాలింపు చర్యలను వట్టిచెరుకూరు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, ప్రత్తిపాడు ట్రైనీ ఎస్ఐ ఖాదర్‌భాషా తదితరులు పర్యవేక్షించారు. -
కామవరం వాగు ప్రమాదం; ఆరుకు పెరిగిన మృతులు
బుట్టాయగూడెం : పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలోని కామవరం వాగులో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఆదివారం ఉదయం కామవరం వాగు అవతల ఉన్న గుబ్బాల మంగమ్మ గుడిలో పూజలు చేసి వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీళ్లు ఉధృతంగా వచ్చాయి. దాంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి(32), వేముల మాధవి(23), నక్కల గొల్లగూడెంకు చెందిన ఆకుల కల్యాణి(38), మరీదు సరస్వతి(60), సాయి(15), వేముల లోకేష్(13) లుగా గుర్తించారు. అయితే గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.