నిన్ను బ్రోచేవారెవరురా!
► ఒంటిమిట్ట కోదండరామాలయంలో మూడేళ్లవుతున్నా ముందుకు సాగని అభివృద్ధి
► అధికారముద్ర పడినా.. అంతంత మాత్రమే
► చుట్టూ మాడవీధుల్లో సిమెంటురోడ్లు మినహా కనిపించని పురోగతి
► టీటీడీ 2015లోనే రూ.100 కోట్లు కేటాయించినా..
► రూ.10 నుంచి 15 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేసిన వైనం
సాక్షి, కడప:
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆంధ్ర భద్రాద్రిగా అధికారముద్ర పడి మూడేళ్లవుతున్నా పురోగతిమాత్రం శూన్యం. 2015 సెప్టెంబరులో టీటీడీలోకి ఒంటిమిట్ట రామాలయాన్ని విలీనం చేసుకున్నా అభివృద్ధిలో అధోగతే. ప్రత్యేకంగా టీటీడీ రూ. 100 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు 10 నుంచి 15 శాతంలోపే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మూడేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ముందుకు సాగకపోవడంతో భక్తులు పెదవి విరుస్తున్నారు. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒంటిమిట్టలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఏకశిలా నగరంలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో అభివృద్ధి లేకపోవడంపై భక్తుల్లో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. ఇప్పటికే రెండుమార్లు శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో చేస్తున్నట్లు..పూర్తి స్థాయిలో రూపురేఖలు మారుస్తున్నట్లు చెప్పుకొచ్చినా హామీకే పరిమితమైందే తప్ప అమలులో చిత్తశుద్ధి కరువైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. టీటీడీ వైఫల్యం.. పురావస్తుశాఖ అనుమతులు ఇవ్వకపోవడం.. వెరసి ఆలయ అభివృద్ధి అటకెక్కింది.
పూర్తయిన మాడ వీధులు
ప్రభుత్వం అధికార లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్న తరుణంలో ఆలయ పరిసరాలు అందంగా రూపుదిద్దుకోవాలి్సన తరుణమిది. కానీ ఒంటిమిట్ట కోదండ రామాలయం చుట్టూ మాడవీధులు తప్ప మిగతా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. ఆలయ సమీపంలో స్వామి వారి కల్యాణం నిర్వహించేందుకు మండపం తప్ప మరేమీ కనిపించడం లేదు. చెరువులో బోటింగ్‌తోపాటు కట్టపై ఆంజనేయస్వామి విగ్రహం, బమ్మెరపోతన థీం పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించినా ఇంతవరకు అతీగతీ లేదు. ఉత్సవ విగ్రహాలకు ఏరోజుకారోజు ఉత్సవాల్లో భాగంగా అలంకరించేందుకు ప్రత్యేకంగా అలంకార మండపం ఏర్పాటు కాలేదు.
ఇప్పటికీ పూర్తికాని వసతి గృహం
శ్రీ సీతారాముల కల్యాణ మండపం సమీపంలోని మైదానంలో కల్యాణ మండపాన్ని (వసతి గృహాన్ని) నిర్మిస్తున్నా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దాదాపు ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పైన వసతి గదుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం మైదానంతోపాటు ఆలయ పరిసరాలు, ఇతర అన్నిచోట్ల పిచ్చిమొక్కలు, కంపచెట్లు తొలగించారు. టీటీడీ జీఈఓ పోలా భాస్కర్ వచ్చి పరిశీలించి వెళ్లిన తర్వాత పనులను వేగవంతం చేశారు.
చెరువులో పిచ్చిమొక్కలు
కడప–తిరుపతి ప్రధాన రహదారిలోని ఒంటిమిట్ట వద్ద ఉన్న చెరువులో ప్రస్తుతం ఎక్కడ చూసినా పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. నీరు కూడా తగ్గిపోవడంతో ఎక్కడ చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలు తప్ప మరేమీ కనిపించడం లేదు. బోటింగ్ సిస్టమ్ అంటూ గత ఏడాది పర్యాటకశాఖ రెండు బోట్లు తెచ్చినప్పటికీ ముందుకు కదల్లేదు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు తప్ప మరెలాంటి వసతులు ఊపందుకోలేదు.
రూ. 100 కోట్లు కేటాయించినా.!
తిరుమల–తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట అభివృద్ధికి సుమారు రూ. 100 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు 10 నుంచి 15 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో అనుమతులు రాని కారణంగానే పనులు జరగలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది కూడా కనీసం అనుమతులు లేని పరిస్థితుల నేపథ్యంలో ఆలయ గాలిగోపురానికి రంగులు కూడా వేయని పరిస్థితి. ఇప్పుడిప్పుడు ఆలయ పరిసరాల్లో తాగునీటి పైపులైన్లు.. రెడీమేడ్ క్యూలైన్లు....బయట పడమర వైపున గడ్డిని నాటి పచ్చదనం కోసం పనులను వేగవంతం చేస్తున్నారు. ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నా అధికారులు మాత్రం ఉత్సవాలు అనగానే ఒంటిమిట్టలో వాలిపోవడం, అయిపోగానే వెళ్లిపోవడం తప్ప అభివృద్ధిని విస్మరించారని ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఏదీ ఆహ్లాదకర వాతావరణం
నెలరోజుల్లో ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటికప్పుడు అధికారుల హడావుడి తప్ప ముందస్తు చర్యలు లేవు. ప్రత్యేకంగా ఏడాది క్రితం నుంచే మండపం సమీపం నుంచి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, పార్కులు ఏర్పాటు చేయడం, భక్తులకు వసతి ఏర్పాట్లు చేసి ఉంటే కొంత ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కనీసం రాత్రి సమయంలో పడుకోవడానికి కూడా భక్తులకు అనువైన వసతులు లేవంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
అంతంత మాత్రంగానే రైల్వేస్టేషన్
ఒంటిమిట్ట రామాలయానికి అధికారిక గుర్తింపు వచ్చినా. ఇప్పటికీ ఒంటిమిట్టలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లాలంటే రోడ్డు వెంబడి కంపచెట్లు, అధ్వానమైన రహదారి సమస్యగా మారింది. కనీసం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అయినా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటే దూర ప్రాంతాల భక్తులకు అనువుగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.