breaking news
Kings XI Pujab
-
గేల్ బల్లే బల్లే
సీజన్లో పావు వంతు మ్యాచ్‌లు అయిపోయాయి...అయినా ఒక్క శతకమూ నమోదు కాలేదే!సగటు క్రికెట్ అభిమానుల్లో ఒకింత నిరాశ...బహుశా ఈ నిరీక్షణంతా అతడి కోసమేనేమో...దానికి తెరదించేందుకే తను ఉన్నాడేమో...!మొదటిసారి వేలంలో అక్కర్లేదన్నారురెండోసారి వేలంలో పట్టించుకోనేలేదుఎప్పుడైనా చెలరేగకపోతాడాని అనుకున్నారేమో? మూడోసారి కనీస మొత్తానికి దక్కించుకున్నారుఈ కసినంతా మనసులో పెట్టుకున్నాడేమో!దానిని మనసారా ఆటలో చూపాడేమో!అందుకే అతడు క్రిస్ గేల్ అయ్యాడేమో!అదిగో... రానే వచ్చాడు! సెంచరీ కొట్టనే కొట్టాడు! మొహాలి: ఐపీఎల్లో మళ్లీ మొదలైంది గేల్ తుఫాన్! టి20ల్లో తానెంతటి విశిష్ట ఆటగాడో చాటుతూ, తనను తీసుకోకపోవడం ఎంత తప్పో ఇతర జట్లకు చెబుతూ, తన బ్యాట్ పదును తగ్గలేదని చూపుతూ... అతడు విరుచుకు పడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో కింగ్‌లా నిలిచి... వరుస విజయాల ఊపులో ఉన్న సన్‌రైజర్స్‌ను పరాజయం పాల్జేశాడు. రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గేల్ (63 బంతుల్లో 104 నాటౌట్; 1 ఫోర్, 11 సిక్స్‌లు) దూకుడుతో కింగ్స్ ఎలెవెన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. భువనేశ్వర్ (1/25) మెరుగ్గానే బౌలింగ్ చేసినా, రషీద్ ఖాన్ (1/55) భారీగా పరుగులిచ్చాడు. ఛేదనలో శిఖర్ ధావన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా, కెప్టెన్ విలియమ్సన్ (41 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనీశ్ పాండే (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా బ్యాట్స్‌మెన్ చతికిలపడటంతో హైదరాబాద్ నాలుగు వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15 పరుగుల తేడాతో సీజన్లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. ఆండ్రూ టై (2/23), శరణ్ (0/22), ముజీబ్ (0/27) పొదుపుగా బంతులేశారు. గేల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. అశ్విన్ ఆలోచనే మలుపు... ఐపీఎల్–11లో ఇప్పటివరకు టాస్ గెలిచిన కెప్టెన్లందరూ మొదట బ్యాటింగ్ ఎంచుకోలేదు. కానీ, హైదరాబాద్ బౌలింగ్‌లో ఛేదన కష్టమని తెలివిగా ఆలోచించిన పంజాబ్ సారథి అశ్విన్... ఏమాత్రం సంకోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఫలితం దక్కడానికి మాత్రం ఆ జట్టుకు కొంత సమయం పట్టింది. భువనేశ్వర్, జోర్డాన్ కట్టుదిట్టంగా బంతులేయడంతో 4 ఓవర్లకు కింగ్స్ ఎలెవెన్ 25 పరుగులే చేయగలిగింది. అయితే 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాహా క్లిష్టమైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దక్కిన గేల్... రెండు సిక్స్‌లు కొట్టి ఊపులోకి వచ్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 49/0తో నిలిచింది. మరో ఎండ్‌లో సాధికారికంగా ఆడలేకపోయిన కేఎల్ రాహుల్ (21 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో పాటు, కొన్ని మెరుపు షాట్లు ఆడిన మయాంక్ అగర్వాల్ (9 బంతుల్లో 18) త్వరగా వెనుదిరిగారు. అప్పటికీ గేల్ కూడా జోరందుకోలేదు. దీంతో 11 ఓవర్లకు 86/2తో మ్యాచ్ సాధారణంగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ, కరుణ్ నాయర్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) తోడుగా కరీబియన్ సునామీ విరుచుకుపడటంతో ఆట మారిపోయింది. 39 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న అతడు 14వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు కొట్టి రషీద్‌కు చుక్కలు చూపాడు. ఈ ఓవర్లో మొత్తం 27 పరుగులు రాగా అందులో 26 గేల్ చేసినవే. దీంతో అతడు ఒక్కసారిగా 70ల్లోకి వచ్చాడు. జోర్డాన్ బౌలింగ్‌లో సిక్స్‌తో 90ల్లోకి వచ్చిన అతడు, 18వ ఓవర్ చివరి బంతిని సిక్స్ కొట్టి 99 మీద నిలిచాడు. సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో సింగిల్ శతక లాంఛనం పూర్తి చేశాడు. అంతకుముందు గేల్, కరుణ్ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 85 పరుగులు జోడించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపారు. చివర్లో ఫించ్ (6 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) తనవంతుగా ఆడాడు. ఆదిలోనే కోలుకోలేని దెబ్బ... ఎదురుగా భారీ లక్ష్యం. దానిని అందుకోవాలంటే మెరుపు ఆరంభం కావాలి. జట్టులో అలాంటి ఇన్నింగ్స్ ఆడగల ఏకైక బ్యాట్స్‌మన్ అయిన శిఖర్ ధావన్... శరణ్ బౌలింగ్‌లో ఆడిన తొలి బంతికే రిటైర్ట్ హర్ట్ అయ్యాడు. ఇక సన్ రైజర్స్ పరిస్థితి చెప్పేదేముంది! సాహా (6), యూసుఫ్ పఠాన్ (19) నిరాశపరిచారు. హైదరాబాద్ కొద్దిసేపైనా మ్యాచ్‌లో నిలిచిందంటే అది విలియమ్సన్, పాండే క్రీజులో ఉన్నప్పుడే. వీరు 56 బంతుల్లో 76 పరుగులు జోడించినప్పటికీ ఆ రన్‌రేట్ విజయానికి సరిపోలేదు. షకి బుల్ హసన్ (12 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు. మ్యాచ్లోఫీల్డర్లు పలు అవకాశాలు జారవిడవకుంటే పంజాబ్ మరింత ఆధిక్యంతో గెలిచేదే. నాకు వయసైపోయిందని చాలా మంది అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవడానికేమీ లేదు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకోబోతున్న నా కూతురికి ఈ సెంచరీ అంకితం. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై పట్టుదలతో నిలబడ్డాను. నన్ను జట్టులోకి తీసుకొని సెహ్వాగ్ ఐపీఎల్‌ను రక్షించాడు. రెండు మ్యాచుల్లో గెలిపిస్తే చాలన్న అతని మాట నిలబెట్టాను – క్రిస్ గేల్ ►21 టి20ల్లో గేల్ సెంచరీల సంఖ్య. మెకల్లమ్, క్లింగర్, ల్యూక్ రైట్ తలా 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ►16 గేల్ ఒక ఇన్నింగ్స్‌లో పదికి పైగా సిక్సర్లు బాదడం ఇది 16వ సారి. మరో నలుగురు ఆటగాళ్లు మాత్రమే గరిష్టంగా రెండు సార్లు ఈ ఘనత సాధించారు. -
దేవుడు నాకా శక్తి ఇచ్చాడు: ధోనీ
మొహాలీ: సీజన్ ఆరంభం నుంచే ప్రతికూలతలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనుందా? కావేరీ ఆందోళనల కారణంగా సొంత గడ్డకు దూరం కావడం, కీలక ఆటగాడు కేదార్ జాదవ్ గాయంతో టోర్నీకి దూరంకావడం, తండ్రి మరణించడంతో సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోవడం కోలుకోలేని పరిణామాలు. అంతలోనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను కలవరపెడుతోంది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం మొహాలీలో పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ వెన్నునొప్పి తాళలేకపోవడం, ఇన్నింగ్స్ మధ్యలో ఫిజియోథెరపీ చేయించుకోవడం, ఆ నొప్పి కారణంగానే ఆఫ్ స్టంప్ అవతి నుంచి వెళ్లే బంతుల్ని ఆడలేకపోవడం, చివరికి 4 పరుగుల తేడాతో చెన్నై ఓటమిపాలుకావడం తెలిసిందే. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత తన గాయంపై ధోనీ ఇచ్చిన వివరణ కాస్త ఉపశమనం కలిగించేలా ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు: ‘‘అవును. వెన్నునొప్పి నన్ను బాధించింది. ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం పొందాను. మళ్లీ నొప్పి తిరగబెడుతుందా లేదా ఇప్పుడే చెప్పలేను. అయితే ఇవేవీ నాకు కొత్తేంకాదు. ఒక మోస్తారు గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకా శక్తి ఇచ్చాడు. పైగా తర్వాతి మ్యాచ్‌కు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి బహుశా పూర్తిగా కోలుకోవచ్చని ఆశిస్తున్నా’’ అని ధోనీ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం(ఏప్రిల్ 20న) రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. పుణె వేదికగా ఆ మ్యాచ్ జరుగనుంది. ముజీబ్‌పై మహీ ప్రంసలు: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరికి పంజాబే గెలిచినప్పటికీ చెన్నై సారధి మహేంద్ర సింగ్ ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనకు ఫ్యాన్స ఫిదా అయిపోయారు. మహీని ఆకాశానికెత్తేస్తూ పలువురు కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే, మ్యాచ్ తర్వాత కామెంటేంటర్లతో మాటల సందర్భంగా ధోనీ.. పంజాబ్ బౌలర్, అఫ్ఘానిస్తాన్‌కు చెందిన ముజీబ్‌పై ప్రశంసలు కురిపించాడు. మిడిల్ ఓవర్స్‌లో ముజీబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, అతని బంతుల్ని ఎదుర్కోవవడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. -
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. అయితే పంజాబ్ విజయంలో మాక్స్ వెల్, బెయిలీ, ఫెరీరాలు కీలక పాత్ర వహించారు. మాక్స్ వెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు, బెయిలీ 27 బంతుల్లో 5 ఫోర్లతో 34, ఫెరీరా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశారు. హోబర్ట్ జట్టులో బొలింగర్ 2, హిల్ ఫెన్ హస్, లాలీన్, గుల్బీస్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన హోబర్ట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. -
పంజాబ్ టార్గెట్ 145, సెహ్వాగ్ డకౌట్
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. అయితే 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది.