breaking news
Kidney deaths
-
ఆ ఊళ్లో కిడ్నీలు ఫెయిల్! భయాందోళనలో గ్రామస్తులు..
ఆదిలాబాద్: భీంపూర్ మండలంలోని గుబిడిపల్లిని కిడ్నీ సంబంధిత వ్యాధి వేధిస్తోంది. రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు, 300కు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. గ్రామస్తులంతా వ్యవసాయంతో పాటు కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తాము తాగుతున్న నీటివల్లనా? లేక ఆహారపు అలవాట్లా? ఇతర కారణాల చేత కిడ్నీ వ్యాధులు సోకుతున్నాయో తెలియక గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులంతా గ్రామ సమీపంలోని బోరుబావి నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు నీటికి క్లోరైడ్ పరీక్షలు నిర్వహించగా సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది గ్రామానికి సమీపంలో ఉన్న కప్పర్ల, జామిడి నుంచి మినరల్ వాటర్‌ను సైతం ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఆరుగురు మృతి రెండేళ్ల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామానికి చెందిన తొడస ం దాదారావు, గంగమ్మ, రామన్న, డి.ఇస్తారి, దేవ మ్మ, లలితకు కిడ్నీ సంబంధిత వ్యాధి సోకి మృతి చెందగా పలువురు వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలోని ఆశమ్మ, భూమన్న నిత్యం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గ్రామానికి సరైన రోడ్డు, వాహన సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా ఆటో కు రూ.500 చెల్లించి ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వైద్యశాఖ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి వ్యాధికి గల కారణాలు తెలియజేస్తే వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది. ఈ చిత్రంలో తన పిల్లలతో కనిపిస్తున్న మహిళ పేరు పెంటపర్తి సంగీత. వీరిది భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి. ఈమె భర్త సంతోష్ పదేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎలాంటి పనులు చేయలేకపోవడంతో అన్నీతానై కుటుంబానికి అండగా నిలిచింది. ఈక్రమంలో డయాలసిస్ సైతం అవసరం ఉండటంతో రెండు రోజులకోసారి ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో సంతోష్ పదిహేను రోజుల క్రితం మృతి చెందాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో పిల్లలను ఎలా పెంచేదని సంగీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామాన్ని సందర్శిస్తాం గుబిడిపల్లిలో కిడ్నీ సంబంధిత వ్యాధి అధికంగా వస్తుందని ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. కిడ్నీ వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుసుకునేందుకు గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తాం. గ్రామస్తుల ఆహారపు అలవాట్లతో పాటు తాగే నీటిని పరీక్ష చేస్తే కిడ్నీ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. – నిఖిల్ రాజ్, వైద్యాధికారి, భీంపూర్ -
పచ్చని పల్లెలపై.. ఫ్లోరైడ్ రక్కసి..
గొంతు తడిపే జలం..గరళంగా మారి ప్రాణాలు తీస్తోంది. ఎముకలను గుల్ల చేసి మనుషులను బతికున్న శవాలుగా మారుస్తోంది. ఫ్లోరైడ్ రక్కసి మహమ్మారి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు హరిస్తోంది. ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా..తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీరు దొరక్క జనం విషం తాగి వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీంతో మూడు పదుల వయసుకే ఆరు పదుల వయసులా వృద్ధులా తయారవుతున్నారు. ఫలితంగా పాడి పంటలు, పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు ఫ్లోరైడ్ బాధితులతో కళావిహీనంగా తయారయ్యాయి. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వారి సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి. సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): మండల పరిధిలోని ధర్మవరం, రావిళ్లవారిపాలెం, వేమరం గ్రామాల్లో ఫ్లోరైడ్ రక్కసి పట్టిపీడిస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలోనే 38 మందిని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒక్క రావిళ్లవారిపాలెం గ్రామంలోనే 20 మంది కిడ్నీ వ్యాధికి బలైపోయారు. ధర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల్లో పదుల సంఖ్య కిడ్నీ వ్యాధి బాధితులు ఆస్పత్రులు, డయాలసిస్ కేంద్రాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రామాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకునే ప్రజాప్రతినిధులు కరువయ్యారు. ఫ్లోరైడ్ నీరే దిక్కు.. ధర్మవరం గ్రామంలో 400 కుటుంబాలకు చెందిన 1160 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలో 40 చేతిపంపులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామానికి తాగునీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్తులు చేతిపంపు నీటిని ఆశ్రయించి కిడ్నీ రోగాల బారిన పడుతున్నారు. ఆ నీరు అత్యంత ఫ్లోరిన్తో కూడుకోవడంతో గ్రామస్తులు కాళ్లు, కీళ్లు, వళ్లు నొప్పులతో మంచాల పాలవుతున్నారు. జిల్లాలోని కనిగిరి, పీసీపల్లి, మర్రిపూడి, పామూరు, పొదిలి తదితర మండలాలలో అత్యధికంగా ఫ్లోరిన్‌శాతం 5.2 పీపీఎం ఉందని, ఈ మహమ్మారితో మరణాలు సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పెదచెర్లోపల్లి మండలంలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేసి కిడ్నీవ్యాధిగ్రస్తులను ఆప్యాయంగా పలకరించారు. డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తాననడంతో రోగుల మొములో ఆనందం వెల్లువిరిసింది. జగన్మోహన్రెడ్డి కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం పెదచెర్లోపల్లిలో బహిరంగ సమావేశం ఏర్పాటుచేస్తున్న విషయం ముందే పసికట్టిన తెలుగుదేశం ప్రభుత్వం జిల్లాలో మూడు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కబళించిన కిడ్నీ వ్యాధి ధర్మవరం గ్రామ వ్యూ మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన నారపరెడ్డి గంగులు,(4), బత్తుల గోవిందు(25),బారెడ్డి తిమ్మారెడ్డి(65), గోపిరెడ్డిసుబ్బారెడ్డి (75), మార్తాల ఓబుల్‌రెడ్డి(78), యర్రబల్లి ఓబుల్‌రెడ్డి(78), గురవమ్మ(68), కసిరెడ్డి చినమాల కొండయ్య(55), బారెడ్డి గోవిందమ్మ(65)లను కిడ్నీ వ్యాధి కబళించింది. అలాగే గ్రామానికి చెందిన యర్రబల్లిపాపులు, కొమ్ము నారయ్య, రాజవరపు బాల వెంకయ్య, కొమ్ము గురవమ్మ, బత్తుల పెద వెంకట సుబ్బయ్య, బత్తుల కాంతమ్మ, యర్రబల్లి శ్రీను, కసిరెడ్డి పెద మాలకొండయ్య, కసిరెడ్డి నారాయణలతో పాటు మరి కొంతమంది కిడ్నీ వ్యాధి సోకి తల్లడిల్లితున్నారు. ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. గ్రామంలో ఉన్న డీబోరు సైతం మూలనపడటంతో కుళాయిలు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో జిల్లా నీటియాజమాని సంస్థ వాటర్ షెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బబుల్స్ నీటినే కొనుగోలు చేసి తాగుతున్నారు. స్థోమత లేని వారు గ్రామంలో ప్రధాన ఆధారమైన చేతిపంపు నీటిని సేవించి మూలనపడుతున్నారు. రామతీర్ధం జలాలు మండలంలో 33 గ్రామాలకు సరఫరా జరుగుతోంది. చిమట నుంచి కానీ లేదా విజయలక్ష్మీపేట గ్రామం నుంచి గానీ రామతీర్థం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామంలో కిడ్నీవ్యాధి సోకి ఇప్పటి వరకు 20 మంది చనిపోగా 8 మంది వ్యాధితో బాధపడుతున్నారు. చనిపోయిన వారిలో ముంతా వెంకటేశ్వర్లు, ముంతా నర్సమ్మ, బత్తుల యానాదులు, బత్తుల బ్రంహ్మయ్య, సొలసా నర్సమ్మ, బత్తుల నర్శింహా, బత్తుల పెద నర్సయ్య, పులగం అక్కమ్మ, సొలసా బ్రహ్మయ్య, రత్తమ్మ, బొట్లగుంట రామయ్య, పాలెపు పద్మ తోపాటూ మరో 8 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన పాదర్తి సుబ్బారావు ఒంగోలులో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. సీపీడబ్ల్యూస్కీమ్ నీరు సరఫరాకాక 3 నెలలు గడుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో ఫ్లోరిన్ నీరు సేవించడం వల్లా బత్తుల నర్సింహా, ముంతా మాలకొండయ్య, ముంతా టేకులమ్మ, సాలసా నాగేశ్వరరావు, పాలెపు కోటయ్య, పాదర్తి సుబ్బారావు, పులగం బ్రహ్మయ్యలతో పాటు మరికొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుకుంటున్నారు. పనిచేయని జంగాలపల్లి సీపీడబ్ల్యూస్కీమ్ దర్మవరం, రావిళ్లవారిపాలెం గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చేందుకు పొన్నలూరు మండలం పాలేటివాగులో ఏర్పాటుచేసిన జంగాలపల్లి సీపీడబ్ల్యూ స్కీం వాగులో నీరు లేక ఆయా గ్రామాలకు సక్రమంగా సరఫరా కాడంలేదని లేదు. ఈ స్కీమ్ ద్వారా మండలంలో 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. పాలేటివాగునీరు సైతం ఫ్లోరిన్తో కూడుకున్నాయంటున్నారు. వర్షాలు లేక పాలేరువాగు సైతం వట్టిపోయి బావిలో నీరు అడుగంటాయని, ఆ నీరు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్ధితి ఏర్పడిదని గ్రామస్తులు అంటున్నారు. మండలంలోని రావిళ్లవారిపాలెం గ్రామానికి దాదాపు 3 నెలలుగా తాగునీరు సరఫరా చేయడంలేదని వారు విమర్శిస్తున్నారు. రామతీర్థం నీరు చిమట నుంచి లేదా విజయలక్ష్మీపేట నుంచి తాగునీటి పైపులు ఏర్పాటుచేసి నీరు విడుదల చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఎమ్మెల్యే హామీ..ఒట్టి మాటలే.. మండలంలోని ధర్మవరం గ్రామస్తులకు రామతీర్ధం నీరు అందించి ఫ్లోరైడ్‌రహిత గ్రామంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే స్వామి 2017 జన్మభూమి సభలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులకు ఫ్లోరైడ్ కష్టాలు.. మండలంలోని ధర్మవరం గ్రామంలో ఒక పక్క పెద్దలను ఫ్లోరైడ్ కబళించి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మరో పక్క పాఠశాల విద్యార్థులపై ఫ్లోరైడ్ పంజా విసరనుంది. గ్రామానికి చెందిన విద్యార్థులు బత్తుల మల్లేశ్వరి, గంగిరెడ్డి శిరీషా, నేలపాటి అభిషేక్, గోపిరెడ్డి చక్రవర్తులకు పళ్లు గారపట్టింది. తమ బతుకులు ఎలాగూ నాశనమయ్యాయి, పిల్లల భవిష్యత్ అయినా కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కర్రల సాయం లేకుంటే నడవలేను గ్రామంలో చేతిపంపు నీరు సేవించడంతో నొప్పులు మొదలైయ్యాయి. క్రమేపి నాకాళ్లు వంకర తిరిగాయి. 6 ఏళ్ల నుంచి కర్ర లేకుండా నడవలేకపోతున్నాను. మందులు కొనుక్కునే స్థోమత లేదు. రామతీర్థం నీరు అందించి మా పిల్లల భవిష్యత్ కాపాడండి. - యర్రబల్లి పాపులు జగన్మోహన్రెడ్డి భరోసాతో ఆశలు చిగురించాయి కిడ్నీవ్యాధులతో మా గ్రామంలో 20 మంది చనిపోయారు. కొంత మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని పెదచెర్లోపల్లి జగన్మోహన్రెడ్డి òచేపట్టిన బహిరంగ సభకు కిడ్నీ బాధితులను తీసుకెళ్లాం. చలించిన జగన్ సార్ కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10వేలు పింఛన్ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ బాధితులకు ఆయన భరోసా కల్పించారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం కిడ్నీవ్యాధిగ్రస్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. - బొల్లినేని నాగేశ్వరరావు, రావిళ్లవారిపాలెం -
‘కుటుంబాల్లో పిట్టల్లా రాలిపోతున్న జనం’
సాక్షి, విజయవాడ : కిడ్నీ వ్యాధితో ఒక్కొక్క కుటుంబంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు అన్నారు. పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో 3 వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లలో దాదాపుగా103 మంది చనిపోయారని చెప్పారు. ‘25మందికిపైగా డయాలసిస్ చెయించుకోవాల్సి ఉండగా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థతి. కిడ్నీ వ్యాధి మెట్ట ప్రాంతంలోని 15 మండలాలకు విస్తరించింది. పిల్లలతో సహా అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు’. అని ఆయన పేర్కొన్నారు. సీపీఎం నిర్వహించిన సర్వేలో 1284 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రభుత్వానికి దుబారా ఖర్చు పెట్టడంలో ఉన్నా శ్రద్ధ.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. దాదాపుగా 1000మంది తమ సొంత భూములను అమ్ముకొని, అప్పులు చేసి కిడ్నీ వ్యాధి కోసం చికిత్స చేయించుకునే పరిస్థితి అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో చెందుతున్న జిల్లాలో 15 మండల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించలేదా అని బాబురావు ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్పందించినా కూడా ఒక డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేత అన్నారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరపాలి. అంతేకాక చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ క్రేషియా ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు.. వైద్య ఖర్చులకు సత్వర ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 2500 రూపాయల పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడుతో పాటు తిరువూరు, మైలవరం, నందిగామలలో కూడా డయాలసిస్ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. వైద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టే చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలి. ఈ నెల చివరిలోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే జూలైలో కిడ్నీ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం నేత బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
శ్రీకాకుళం జిల్లాలో రేపు పవన్ పర్యటన
విశాఖ: జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ మంగళవరాం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఆయన మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్దానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో లక్షల మంది అదే వ్యాధితో బాధపడుతున్నారన్నారు. అక్కడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సమస్య పరిష్కారం కోసం సమర్థంగా పనిచేయలేదని దుయ్యబట్టారు. కాగా రేపు ఉదయం ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఆయన ముఖాముఖీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ సోమవారం సాయంత్రమే విశాఖ చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఏడుగంటలకు శ్రీకాకుళం జిల్లా బయల్దేరి వెళతారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. pic.twitter.com/HnWUMNFTTS — Pawan Kalyan (@PawanKalyan) 2 January 2017