breaking news
khubsurat
-
ఫవద్తో మళ్లీ నటిస్తా: సోనమ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నటుడు ఫవద్ఖాన్తో మరోసారి నటిస్తానని ‘ఖూబ్సూరత్’ సినిమా విజయపథంలో సాగిపోతున్న ఆనందంలో తేలియాడుతున్న నటి సోనమ్‌కపూర్ తెలిపింది. 1980లో ‘ఖూబ్సూరత్’ పేరిట హృషికేశ్ ముఖర్జీ సినిమా తీయగా దానిని రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఫవద్‌ఖాన్, సోనమ్‌కపూర్ నటించారు. ‘ఫవద్ సరసన వీలైనంత త్వరగా మరోసారి నటిం చాలని ఉంది. మా ఇరువురి నటనను ప్రేక్షకులు మెచ్చుకున్నారు. మా కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చింది. అందువల్ల త్వరలో మేమిద్దరం కలిసి మరో సినిమాలో నటిస్తాం’అని ఈ రాంఝ్నా సినిమా కథానాయిక చెప్పింది. ‘ఖూబ్సూరత్ సినిమాకి ఇంత భారీ స్పందన వస్తుందనుకోలేదు. ఈ స్పందనచూసి నాకే దిగ్భ్రాంతి కలిగింది. ఈ సినిమాని మరిన్ని థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది. ఈ సినిమా కేవలం 900 థియేటర్లలోనే విడుదలైంది. ప్రేక్షకుల స్పందన ఇంతగా ఉంటుందని మేము అనుకోలేదు. అసలు ఊహించలేదు కూడా. ఈ సినిమాని మరో ‘ఐషా’గా భావిస్తున్నారు. ఈ సినిమాచూసి వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ సినిమాలో అంత గొప్పగా చేశానని నేను అనుకోవడం లేదు’ అని అంది. కాగా ఫరాఖాన్‌తో కలిసి నటించిన ‘భాగ్ మిల్కా భాగ్’ ధనుష్ సరసన నటించిన ‘రాంఝ్నా’ తాజాగా విడుదలైన ఖూబ్సూరత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ‘నేను నటించడం అదృష్టంగా వారంతా భావిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వారంతా నాకు స్నేహితులుగా మారారు. నాతో నటించడాన్ని వారు అదృష్టంగా భావించినందువల్లనే మా మధ్య స్నేహం కొనసాగుతోంది. వారి గురించి నేనుకూడా అలాగే అనుకుంటాను’ అని సోనమ్ తన మనసులో మాట చెప్పింది. -
కమ్మని పాట పరిమళం!
సోనమ్ కపూర్ నటించిన ‘ఖూబ్సూరత్’ సినిమాతో గాయనిగా పరిచయమైన ఢిల్లీ అమ్మాయి జస్లీన్ రాయల్ గొంతు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ క్లాసులో ఉన్నప్పుడే పియానో వాయించింది జస్లీన్. అలా సంగీతం మీద ప్రేమ ఆమెతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పిల్లలకు ఆమె సంగీత పాఠాలు చెబుతుండేది. అందులో ఆమె వయసు పిల్లలు కూడా ఉండేవారంటే ఆశ్చర్యమే. పాఠాలు చెప్పగా వచ్చిన డబ్బుతో రకరకాల సంగీత పరికరాలు కొనుక్కునేది జస్లీన్. ‘‘మా కుటుంబసభ్యుల్లో సంగీత నేపథ్యం ఉన్నవారు లేరు. అయినా వారెప్పుడూ నన్ను నిరాశపరిచేవారు కాదు. నా అభిరుచిని ప్రోత్సహించేవారు. నేను ఆర్థికస్వాతంత్య్రానికి ప్రాధాన్యం ఇస్తాను. ఖర్చులకు ఎవరి మీదా ఆధారపడకుండా, నాకు అవసరమైన డబ్బును నేనే సమకూర్చుకునేదాన్ని’’ అంటోంది జస్లీన్. ఎం టీవిలో ప్రసారమైన ‘పంచీ హో జవాన్’ ఆల్బమ్‌తో ‘ఖూబ్సూరత్’లో పాడే అకాశం జస్లీన్‌కు వచ్చింది. ‘ఖుబ్సూరత్’లో జస్లీన్ పాడిన ‘ప్రీత్’ అనే పాట సోనమ్ కపూర్‌కూ, ఆమె సోదరి రియాకపూర్కూ తెగ నచ్చేసింది. ‘‘ఇది నా మనసు దోచిన పాట’’ అని ఇద్దరూ ట్వీట్ చేసి జస్లీన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పాపులర్ అయిన ఈ ‘ప్రీత్’ పాట పుణ్యమా అని మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశాలు జస్లీన్ తలుపు తడుతున్నాయి. అయితే, ఎన్ని పాటలు పాడాం అని లెక్కలు వేసుకోవడం కన్నా, ఎన్ని మంచి పాటలు పాడాం అనేది ముఖ్యమని నమ్ముతోంది ఈ కొత్త గాయని. ‘‘కొన్ని పాటలు వింటున్నప్పుడు సూటిగా హృదయాన్ని తాకినట్లు అనిపిస్తుంది. పాడిన వారి దగ్గరికి వెళ్లి, ‘ఎంత బాగా పాడారు...’ అని ప్రశంసించాలనిపిస్తుంది’’ అంటోంది జస్లీన్. నిజానికి ఆమె ‘ఖూబ్సూరత్’ చిత్రంలో పాడిన పాట విని చాలామంది ‘ఇంత అందమైన పాట పాడింది ఎవరు?’ అని ఆరా తీశారు. అది ఆమె తొలి విజయమే కదా!