breaking news
Kerala school
-
ఆ స్కూల్లో బాలబాలికలకు యూనిఫామ్ ఒకటే!
సాధారణంగా పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా యూనిఫామ్స్ ఉంటాయి. కానీ ఆ స్కూల్లో మాత్రం బాలురు, బాలికలకు ఒకేరకమైన యూనిఫామ్ ఉంటుంది. ఈ పాఠశాల మన దేశంలోనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. లింగ సమానత్వాన్ని ప్రబోధించేందుకే బాల బాలికలకు ఒకే రకమైన ఏకరూప దుస్తుల ధరించేలా చేస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల సహకారంతో ఈ నిశ్శబ్ద విప్లవానికి తొలి అడుగుపడింది. విద్యార్జనలో అగ్రస్థానాన ఉన్న కేరళలోనే ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఎర్నాకులం జిల్లాలో వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిశ్శబ్ద విప్లవానికి అంకుర్పారణ జరిగింది. లింగ భేదం లేకుండా ఇక్కడ విద్యార్థులందరూ ఒకే రకమైన యూనిఫామ్ ధరిస్తారు. చొక్కాలు, త్రిబైఫోర్త్ షార్ట్స్ వేసుకుని చదువులమ్మ ఒడిలో ఒదిగిపోతున్నారు. బాలికలు ఎటువంటి సంకోచం లేకుండా స్వేచ్ఛగా ఆటపాటలతో చదువుకుంటున్నారు. (ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!) వలయన్చిరంగార ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, లోయర్ ప్రైమరీ విభాగాలు ఉన్నాయి. రెండు విభాగాల్లో మొత్తం 746 మంది విద్యార్థులు ఉన్నారు. లింగ సమానత్వ యూనిఫామ్ మొదట 2017లో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ఇది ఇప్పుడు 1 నుంచి 4 తరగతులకు విస్తరించారు. లింగ సమానత్వ యూనిఫామ్ ప్రవేశపెట్టడానికి ముందు బాలికలు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంకోచించే వారని.. ఇప్పుడు వారిలో ఎటువంటి సంకోచం లేదని ఉపాధ్యాయురాలు సి.రాజీ తెలిపారు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన తర్వాత జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ అమలు చేశామన్నారు. ‘బాలికలకు ఇబ్బందిగా ఉన్న డ్రెస్ కోడ్ మార్చాల్సిందేనని విద్యార్థినుల తల్లులు బలంగా విశ్వసించారు. తమ కుమార్తెలు తాము ధరించే యూనిఫామ్‌లో సురక్షితంగా ఉండాలని వారు కోరుకున్నారు. కొత్త యూనిఫామ్ అదనపు ఖర్చును భరించడానికి వారు ముందుకు వచ్చార’ని రాజీ వెల్లడించారు. ‘లింగ సమానత్వ ఏకరూప దుస్తులు ప్రవేశపెట్టడం వల్ల అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎక్కువ మంది బాలికలు క్రీడల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తుండటం ఇందుకు నిదర్శనం. కొత్త డ్రెస్ కోడ్ వారికి గొప్ప స్వేచ్ఛను అందించింది. మా పాఠశాలలో 378 మంది బాలికలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పేదవారే. కానీ తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్ కోసం అదనంగా డబ్బులు చెల్లించడానికి అంగీకరించారు. అమ్మాయిలు చాలా హ్యాపీగా ఉన్నార’ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ అన్నారు. 2019లోనే జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ ప్రవేశపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా కాస్త ఆలస్యమైందని తెలిపారు. కొత్త డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టడంతోనే ఆగిపోలేదు.. విద్యార్థుల కోసం జెండర్-సెన్సిటివ్ పాఠాలను కూడా సిద్ధం చేశారు ఉపాధ్యాయులు. బాలురు, బాలికలు ఇద్దరూ సమానమే అని చెప్పేవిధంగా పాఠాలు బోధిస్తున్నట్టు అకడమిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ బినోయ్ పీటర్ చెప్పారు. లింగ సమానత్వ మాడ్యూల్‌ను ప్రోత్సహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, వలయన్చిరంగార పాఠశాల చేపట్టిన ఈ ప్రయత్నాన్ని కేరళ విద్యా మంత్రి ఆర్ బిందు, సినీ నటి మంజు వారియర్, ఒలింపియన్ అంజు బాబీ జార్జ్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
గంట కొడితే నీళ్లు తాగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మీ పిల్లలు తగినన్ని నీళ్లు తాగుతున్నారా? చాలామంది తల్లిదండ్రులకిది అనుభమవే. నీళ్లు తాగమంటూ పిల్లలకు పదేపదే చెప్పటం, అయినా వారు వినకపోవటం కొత్తేమీ కాదు. స్కూలుకు వాటర్ బాటిల్ తీసుకెళ్లినవారు మూత కూడా తీయకుండా ఇంటికి తిరిగి తెచ్చేయటం తెలియని విషయమూ కాదు. ఈ సంగతి గ్రహించే కేరళ స్కూళ్లు ఓ చిట్కా కనిపెట్టాయి. ఆ చిట్కా పేరే... ‘గంట’కు గుక్కెడు నీళ్లు. విద్యార్థులకు ‘వాటర్ బెల్’ విరామమన్న మాట. స్కూల్ సమయంలో ప్రత్యేకంగా గంట కొట్టి విద్యార్థులతో నీటిని తాగించటమే ఈ చిట్కా. రోజులో మూడుసార్లు విద్యార్థులు నీళ్లు తాగేందుకే ప్రత్యేకంగా ‘వాటర్ బెల్’ మోగిస్తున్నారు. కేరళలో ప్రారంభమైన ఈ విధానం ప్రస్తుతం కర్ణాటకకూ పాకింది. గంట కొట్టి మరీ నీటిని తాగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలనేది తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండు కూడా!!. -
విద్యార్థులకు వింత డ్రెస్ కోడ్.. తీవ్ర ఆగ్రహం
తిరువనంతపురం: కేరళలో ఓ పాఠశాల తిక్క చేష్టలు చేసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. స్కూల్లో విద్యార్థులపట్ల వివక్షను చూపించే చర్యలకు పూనుకోవడంతో ఆయా చిన్నారుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ స్కూల్ ఏం చేసిందో తెలుసా.. తెలివైన పిల్లలు.. తెలివి తక్కువగా ఉండే పిల్లలు అని ప్రత్యేకంగా చూపించేలా వారికి స్కూల్ యూనిఫాం సిద్ధం చేసి ఇచ్చింది. అకాడమిక్ స్కిల్స్ ఆధారంగా ఎక్కువ నైపుణ్యం ఉన్న విద్యార్థులకు తెల్ల చొక్కాలు, విద్యార్థినులకు తెల్లని టాప్స్.. అలాగే, నైపుణ్యం తక్కువగా ఉన్న విద్యార్థినీవిద్యార్థులకు ఎరుపు రంగు గళ్ల చొక్కాలు, టాప్‌లు ధరించాలని నిబంధన పెట్టి అమలు చేసింది. ఈ జూన్ నుంచి కొత్త విధానం ప్రారంభించారు. విద్యార్థుల మధ్య పోటీ వాతావరణం పెంచడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని తొలుత సదరు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే, కాలక్రమంలో విద్యార్థులపట్ల తీవ్ర వివక్ష కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ స్కూల్‌పై ఫిర్యాదు కూడా చేశారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు.