breaking news
Kehkashan Basu
-
భారతీయ బాలికకు అంతర్జాతీయ అవార్డు
హేగ్: యూఏఈకి చెందిన పదహారేళ్ల భారతీయ బాలికకు అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం లభించింది. వాతావరణ సమన్యాయం, పర్యావరణ క్షీణతపై చేసిన పోరాటానికి గాను పర్యావరణ కార్యకర్త కెహకాషన్ బసును ఈ అవార్డు వరించింది. నెదర్లాండ్స్‌లోని హేగ్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ పర్యావరణ సంబంధిత వ్యాధులతో ప్రతి ఏటా ముప్ఫై లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణిస్తున్నారని, పర్యావరణ సమస్యలతో చాలామంది బాలలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ తరుణంలో పర్యావరణ సమస్యలపై పోరాడే కెహకాషన్ బసు వంటివారి అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా, సురక్షితంగా ఎదిగేందుకు చక్కటి పర్యావరణం అవసరమని.. ఇది వారి హక్కు అని అన్నారు. ఈ హక్కు కోసం కెహకాషన్ బసు పోరాటం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. బాలల స్థిరమైన భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మావంటి వారందరిపై ఉందని బసు చాటిచెప్పిందన్నారు. ఈ సందర్భంగా బసు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పురస్కారం కోసం 49 దేశాల నుంచి 120 నామినేషన్లు రాగా.. అందులో గ్రీన్‌హోప్ వ్యవస్థాపకురాలైన బసు ఎంపిక కావడం విశేషం. ఆమ్స్టర్డామ్కు చెందిన గ్లోబల్ చిల్డ్రన్స్ ఎయిడ్ గ్రూప్ ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని 2005 నుంచి నిర్వహిస్తోంది. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ప్రవాస బాలిక
దుబాయ్: ప్రతిష్టాత్మక బాలల శాంతి బహుమతి రేసులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారత సంతతి బాలిక కేకాషణ్ బసు(16) నిలిచింది. బాలల హక్కులు, స్థితిగతులు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు రేసులో ఉన్న తుది ముగ్గురిలో ఆమె కూడా నిలిచింది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా 120 ఎంట్రీలు వచ్చాయి. ఆదివారం(నవంబర్ 20) ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. తుది పోటీలో ఉన్న ముగ్గురూ బాలల హక్కుల కోసం పోరాటాలు చేశారు. ప్రతీ యేటా ఈ అవార్డు గ్రహీతలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల ముందు తమ సందేశం వినిపించే అవకాశం లభిస్తుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ అవార్డును 2006 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ అందించనున్నారు. ఈ కార్యక్రమం హేగ్‌లోని హాల్ ఆఫ్ నైట్స్‌లో జరగనుంది. కేకాషణ్ బసు ఎనిమిదేళ్ల వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించింది. 2012లో ‘గ్రీన్ హోప్’ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా చెత్త సేకరణ, బీచ్‌లను శుభ్రం చేయడం, అవగాహనా సదస్సులను నిర్వహించడం వంటివి చేస్తుండేది. ఆమె ఇంతకు ముందు ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంది.