breaking news
K.bhagyaraj
-
రిలీజ్‌కు ముందే ప్రపంచ రికార్డు కొట్టిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు కె. భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 3.6.9. కేవలం 81 నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సాధించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ మాదవ్ ఈ చిత్ర షూటింగ్‌ను 24 కెమెరాలతో 81 నిమిషాల్లో పూర్తి చేశారు. నటుడు పీజీఎస్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో బ్లాక్ శాండీ, అంగయర్ కన్నన్, సుకై ల్ ప్రభు, కార్తీక్, గోవిందరరాజన్, సుభిక్ష, నిఖితా, బబ్లూ సహా 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు విదేశానికి చెందిన వారు సైతం నటించడం విశేషం. మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. 600 మంది సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా షూటింగ్‌ను నాలెడ్జ్ ఇంజినీరింగ్ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్ సమక్షంలో చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు తెలిపారు. సైన్స్ ఇతివృతంగా రూపొందిన ఈ చిత్రం గురించి నటుడు కె.భాగ్యరాజ్ వివరిస్తూ.. 81 నిమిషాల్లో రూపొంది ప్రపంచ రికార్డు సాధించిన 3.6.9 చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు శివ మాధవ్, నిర్మాత పీజీఎస్ను అభినందిస్తున్నానన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని భాగ్యరాజ్ ఆకాంక్షించారు. చదవండి: నాని నీ రేంజ్ ఏంటి..? వీళ్లందరూ గల్లీ హీరోలా..? -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆరుద్ర’
తమిళంలో రచయితగా, నటుడిగా, దర్శకనిర్మాతగా పా. విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆరుద్ర’. కె.భాగ్యరాజా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో మేఘాలీ, దక్షిత, సోని, సంజన సింగ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అదే పేరుతో కె. వాసుదేవరావు తెలుగులో అనువదిస్తున్నారు. సామాజిక ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రం తెలుగులో సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు ‘ఆరుద్ర’ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ అందించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. కీలకఘట్టమైన సెన్సార్ పూర్తి కావడంతో ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ‘ఆరుద్ర’ సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్మాత కె. వాసుదేవరావు మాట్లాడుతూ.. ‘తమిళంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో చైల్డ్ అబ్యూస్‌మెంట్ పై రూపొందిన చిత్రమిది. ఇందులో పిల్లలకు , పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు చూపించారు. వీటితో పాటు లవ్, కామెడీ మరియు ఎమోషన్స్ ఇలా అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయి. తమిళంలో ఇటీవల విడుదలై క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం’ అని అన్నారు. విద్యాసాగర్ సంగీతమందించారు. -
పసి ప్రేమకు తొలి అంకురం డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్
చిన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆ అమ్మాయితో దాగుడుమూతలు బాగుంటాయి. ఆ అమ్మాయి వెనుక వెనుకే తిరగడం బాగుంటుంది. ఆ అమ్మాయి పక్కనే కూర్చుని క్లాసు వినడం బాగుంటుంది. స్కూలు వదిలాక పక్కనే నడుస్తూ ఇల్లు చేరడం బాగుంటుంది. అమ్మాయి చాలా బాగుంటుంది. ఎందుకో అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉండ బుద్ధేస్తుంది. వయసు పెరుగుతుంది. వయసుతో పాటు మనమూ పెరిగితే బాగుంటుంది. కాదూ కూడదని ఆ చిన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గరే ఉండిపోతే మాత్రం కథ ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ అవుతుంది. ఎట్రాక్షన్‌కి తిథి, ముహూర్తమూ ఉండవు. మీసం వచ్చిందా, ఎత్తు అయిదడుగులు దాటిందా, కాళ్లు కాలేజీ దారిలో ఉన్నాయా అన్నది చూడదు. ఎట్రాక్షన్‌కి ఎదురుగా ఉన్నది యజమాని కూతురా పాలేరు కూతురా అన్నది కూడా తెలియదు. ఊహ తెలిసిన క్షణం నుంచి ఆకర్షణ ఉంటుంది. ఎవరి కోసమో ఒకరి కోసం మనసు గాఢంగా కోరుకుంటూ ఉంటుంది. అది సేమ్‌సెక్స్ అయితే స్నేహం. ఆపోజిట్ సెక్స్ అయితే ఇష్టం. ఈ సినిమాలో భాగ్యరాజ్ తన యజమాని కూతురైన పూర్ణిమా జయరామ్ పట్ల అలాంటి ఇష్టం పెంచుకుంటాడు. పెద్దయ్యాక కాదు. చిన్నప్పుడే. పదేళ్ల వయసులో. ఇద్దరూ ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఒకే క్లాసులో ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారు. మ్యూజికల్ చైర్స్‌లో ఒక్క చైరే మిగిలితే ఇద్దరూ నిలబడిపోతారు తప్ప ఒకరి మీద మరొకరు గెలవడానికి కూర్చోరు. స్కూల్లో మార్చింగ్ జరిగి ఎదురూ బొదురూ వస్తే ఆగిపోయి ఉన్న చోటే మార్చ్ చేస్తారు తప్ప ముందుకు కదలరు. ఆటల్లో ఒకరు ఫస్ట్ వస్తే ఒకరు సెకండ్. పోటీల్లో ఒకరు సెకండ్ వస్తే మరొకరు ఫస్ట్. కాని ఊటీలో కూడా ఎండ కాస్తుంది. వాళ్ల జీవితంలో కూడా ఎండ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ అమ్మాయి పోతూ పోతూ ‘నేను తిరిగి వచ్చే వరకూ నన్ను గుర్తు పెట్టుకుంటావ్‌గా’ అని అడుగుతుంది. అంతేకాదు చనిపోయిన తన కుక్కపిల్ల సమాధి దగ్గర రోజూ పూలు పెడతావుగా అని కూడా అడుగుతుంది. ఆ అమ్మాయి ఎక్కిన రైలు వెళ్లిపోతుంది. దాని చక్రాల కింద ఆమె అంత వరకూ పెంచుకున్న జ్ఞాపకాలు కూడా జారిపోయాయి. కాని ఆ పిల్లవాడు మాత్రం ఆ క్షణం దగ్గరే ఫ్రీజ్ అయిపోయాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదేళ్ల పాటు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండిపోయాడు. అనుక్షణం ఆమె తలపులు. జ్ఞాపకాలు. కుక్కపిల్ల సమాధి మీద రోజూ పూలు పెట్టి ఎంతో గాఢంగా మౌనం పాటిస్తుంటాడు. ఇదంతా ఎవరి కోసం. తన కోసమే. ఏదో ఒక రోజు రాకపోదు తనని చూసి గుండెల్లో పొదువుకోకపోదు అని ఆశ.అమ్మాయి వచ్చింది. రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లి స్టైల్‌గా ‘హాయ్... ఐయామ్ రాజా’ అన్నాడు.ఆ అమ్మాయి అతణ్ణి ఎగాదిగా చూసి ‘అయితే లగేజ్ అందుకో’ అంది.ఒక ఆశల బుడగ సూది మొన తగలకనే టప్పున పేలింది. ఆ అమ్మాయికి అసలు ఏమీ గుర్తు లేదు. చాలా జీవితం చూసింది. విదేశాల్లో చదువుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. రేపోమాపో పెళ్లి. ఈలోపు సరదాగా ఊటీ చూద్దామని ఫ్రెండ్స్‌తో వచ్చింది. ఇక్కడ చూస్తే అమర ప్రేమికుడు భాగ్యరాజ్. కళ్ల నిండా మనసు నిండా ఆమెను చూసుకోవడమే. అడిగితే డీసెంట్‌గా ప్రాణమిచ్చేసేలా ఉంటాడు. మొదట ఇతని వాలకం ఏమీ అర్థం కాదు. కాని మెల్లమెల్లగా అతడి మనసులోని లోతు అర్థం చేసుకుంటుంది. మరో వైపు తాను నిశ్చితార్థం చేసుకున్న వరుడు సుమన్ తన కోసం ఊటీ వస్తే అక్కడ అతడి కుసంస్కారం గమనిస్తుంది. భాగ్యరాజ్ దగ్గర డబ్బు లేదు. అతడు వాచ్మెన్ కొడుకు నిజమే. కాని అతడి లాంటి మనసు ఎక్కడ ఉందని? అందుకే ఎంగేజ్‌మెంట్‌ను కాదని భాగ్యరాజ్నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటుంది. అయితే ఈలోపే ఆమె మీద కృతజ్ఞతాభారం పడుతుంది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రిని స్నేహితుడైన సుమన్ తండ్రి ఆదుకున్నాడు కనుక ఈ క్షణంలో సుమన్‌ని కాదని భాగ్యరాజ్‌ని చేసుకోవడానికి ఆమెకు కృతజ్ఞత అడ్డు వస్తుంది. నలిగిపోతున్న ఆమెను సుమన్ తండ్రి గమనిస్తాడు. అసలు సంగతి గ్రహిస్తాడు. ఆయన పెద్దమనిషి. సంస్కారవంతుడు. అందుకే నిజమైన ప్రేమికునికే ఆమె చెందాలని నిర్ణయిస్తాడు. పదేళ్ల సుదీర్ఘప్రేమ ఫలవంతమైంది. చిన్నప్పటి స్నేహితురాలు ప్రియురాలైంది. ఇప్పుడు ఇల్లాలైంది. కలలు నిజమవుతాయి. తపస్సులు కూడా వరాలిస్తాయి. కావలసిందల్లా సిసలైన తపస్సే. ఈ సినిమాలో హాస్యం, ఆర్తి సమపాళ్లలో ఉంటాయి. తన చిన్ననాటి స్నేహితురాలు తిరిగి వస్తుందన్న ఆనందంలో స్వాగతం చెప్పడానికి కొత్త బట్టలు కుట్టించుకుంటాడు భాగ్యరాజ్. కాని షూస్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఏదో పెళ్లికి పెద్దమనిషిగా వెళ్లి అక్కడ మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా ఎవరివో కొత్త షూస్‌లో కాళ్లు దూర్చి చక్కా వచ్చేస్తాడు. నవ్వు వస్తుంది. దూరంగా కరాటే సాధన చేస్తున్న కుర్రాళ్లను కారులో ఉన్నామన్న ధైర్యంతో ఏడిపిస్తారు పూర్ణిమ జయరామ్ ఆమె స్నేహితులు. వాళ్లు వెంటపడతారు. వీళ్లు పారిపోతారు. కాని కారు ఆగిపోతుంది. పట్టుకుంటారు. మాతో ఫైట్ చేసి గెలుస్తారా అని ఛాలెంజ్ చేస్తారు. అప్పటి వరకూ డ్రైవర్‌గా ఉన్న భాగ్యరాజ్ కారులోని ఒక సంచి వెతికి అందులోని ఎల్లో కలర్ కరాటే డ్రస్సు వేసుకొని చాలా ప్రొఫెషనల్‌గా ఫైట్ చేసి గెలుస్తాడు. మళ్లీ నవ్వు. ఇలా నవ్వించిన భాగ్యరాజే తాను పదేళ్లుగా దాచిపెట్టుకున్న ఫొటోలను పూర్ణిమకు ఇస్తే ఆమె వాటిని తీసుకుని అతని ముందే తన ముక్క వరకూ కట్ చేసి అతని ముక్కను చేతిలో పెడితే కంట తడి పెట్టిస్తాడు. లోకంలో అందరూ వీరులూ శూరులూ ఉండరు. భాగ్యరాజ్ వంటి ఆర్డనరీ మనుషులే ఉంటారు. కాని వాళ్ల దగ్గర కూడా చాలా అట్రాక్షన్ ఉంటుంది. కోటాను కోట్ల సఫల ప్రేమలు ఈ ఆర్డనరీ ఫెలోల అట్రాక్షన్ నుంచి పుట్టినవే.తెర మీద మాత్రం ఇది మొదటిది.భాగ్యరాజా చేతిలో మెరిసిన భాగ్యరేఖ. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ కె.భాగ్యరాజ్ తమిళంలో హీరోగా నటించి నిర్మించి దర్శకత్వం వహించిన 1982నాటి సినిమా ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’. తెలుగులో కూడా అదే పేరుతో విడుదలై భాగ్యరాజ్‌ని తెలుగువారికి అభిమాన దర్శకుడిగా మార్చింది. ఈ సినిమా హిట్‌తో భాగ్యరాజ్ చాలా సినిమాలు ‘చిన్న ఇల్లు’, ‘అమ్మాయిలూ ప్రేమించండి’, ‘నేనూ మీవాడినే’, ‘చిన్నరాజా’ వరుస విజయాలు సాధించాయి. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’... చిన్నప్పటి నుంచి రూపుదిద్దుకునే ప్రేమను మొదటిసారి చూపింది. దీని ఆధారంగా అనేక సినిమాలు వచ్చాయి. నిన్నమొన్నటి ‘హలో’ దగ్గరి నుంచి ఆ మొన్నటి ‘మనసంతా నువ్వే’ వరకు ఎన్నో సినిమాలు ఈ సినిమా మూల కథ నుంచే పుట్టాయి. తరుణ్ ‘నువ్వు లేక నేను లేను’లో కూడా ఈ సినిమా లైన్ కనిపిస్తుంది. ఇక కరుణాకరన్ తీసిన ‘తొలి ప్రేమ’కు ఈ సినిమా పూర్తిగా స్ఫూర్తి. సైట్ ఉన్నవాడు కూడా హీరో కావచ్చని, మామూలుగా కనిపించేవాడు కూడా ప్రేమలో గెలవ్వచ్చని భాగ్యరాజ్ చాలామందికి ధైర్యం ఇచ్చాడు. అన్నట్టు ఈ సినిమాలో తనతో నటించిన పూర్ణిమా జయరామ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. మన దగ్గర పెద్ద హిట్టయిన ‘మూడుముళ్లు’, ‘రాధా కల్యాణం’, ‘అబ్బాయి గారు’ భాగ్యరాజ్ సినిమాలకు రీమేక్‌లే. భాగ్యరాజ్ స్కూల్లో తెలుగులో ఇటీవల వచ్చిన సినిమాలు ‘మళ్లీ రావా’ (సుమంత్), ‘జయమ్ము నిశ్చయమ్మురా’ (శ్రీనివాసరెడ్డి). – కె -
లిప్‌లాక్ ఎంజాయ్ చేశా
ఆరంభమే అట్టహాసం చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాన్ని తాను భాగా ఎంజాయ్ చేశానని సినీయర్ దర్శక నటుడు కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. విషయానికొస్తే లొల్లుసభ జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆరంభమే అట్టహాసం. సంగీత భట్ కథానాయకిగా నటించిన ఇందులో కే.భాగ్యరాజ్ పాండియరాజన్,జ్ఞానసంబంధం,వైయాపిరి, శ్యామ్స్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని రంగా దర్శకత్వంలో స్వాతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను పొందాయని చిత్ర వర్గాలు తెలిపారు. చిత్ర పరిచయ కార్యక్రమం విజయదశమి సందర్భంగా నగరంలోని ఎంఐటీ కళాశాలో నిర్వహించారు. వందలాది మంది విద్యార్థుల సమక్షంలో చిత్రంలోని ఆరంభమే అట్టహాసం అనే టైటిల్ సాంగ్‌ను కే.భాగ్యరాజ్ ఆవిష్కరించి తొలి సీడీని పాండిరాజన్కు అందించారు. ఈ సందర్భంగా కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ముఖ్యంగా ఇందులోని లిప్‌లాక్ సన్నివేశాన్ని చాలా ఎంజాయ్ చేశాననీ తెలిపారు. ఈ చిత్రం కథానాయకుడు లొల్లుసభ జీవా, ఇతర చిత్ర యూనిట్‌కు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభమే అట్టహాసం చిత్ర యూనిట్ పాల్గొన్నారు.