breaking news
Karimanar Ditrict
-
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
సంజయ్ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విడతలో 20 రోజులపాటు 12, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200–240 కి.మీ మేర పాద యాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీమాత ఆలయంలో పూజ చేసి భైంసాలో మొదలుపెట్టి కరీంనగర్లో ముగించేలా యాత్రకు రూపకల్పన చేశారు. వచ్చేనెల మొదటివారంలో మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన పక్షంలో యాత్ర తాత్కాలికంగా వాయిదాపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 4 విడతల్లో 1,260 కి.మీ. గతేడాది ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్ పాదయాత్ర మొదలుకాగా మధ్య మధ్యలో బ్రేక్‌లు ఇస్తూ 4 విడతలు సాగింది. నాలుగో విడత ఈ నెల 22న రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో ముగిసింది. నాలుగు దశల్లో మొత్తం 102 రోజులపాటు 48 అసెంబ్లీ స్థానాల్లో 1,260 కి.మీ మేర సాగింది. ఒక్కో విడతలో భిన్నమైన సమస్యలు, అంశాలను ఎంచుకుని యాత్ర సాగింది. (క్లిక్: కేసీఆర్ పర్యటనల కోసం రూ.80 కోట్లతో ప్రత్యేక విమానం) -
ఆడపడుచు కట్నంగా.. ఓటు హక్కు వినియోగించుకోండి
పోలింగ్ పెంచేందుకు వినూత్నంగా పోల్ చిట్టీల పంపిణీ సిరిసిల్ల, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరగనున్న పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కరీంనగర్జిల్లా సిరిసిల్లలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓటర్ల సెంటిమెంట్‌ను పట్టుకొని.. పోలింగ్ పెంచే దిశగా పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు.తహశీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉపాధిహామీ, సాక్షర భారత్, బీఎల్వోల ద్వారా గ్రామాల్లో పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి తాంబులం ఇచ్చి.. బొట్టు పెట్టి మరీ పోల్ చిట్టీలను అందిస్తున్నారు. ‘మీ ఇంటి ఆడపడుచును అనుకోండి.. నాకు కట్నకానుకలు వద్దు.. మీ ఓటు హక్కు వినియోగించుకుంటే చాలు’ అంటూ ఓటర్ల నుంచి మాట తీసుకుంటున్నారు. -
‘తడిగుడ్డతో గొంతు కోసిన కేసీఆర్’
మంథని: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో తన గొంతు కోశారని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందుపట్ల సునీల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో తమను అన్ని విధాలుగా వినియోగించుకుని ఇప్పుడు తీరని అన్యాయం చేశారని వాపోయారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తమను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం దుర్మార్గమన్నారు. మాటంటే మాటేనని, అవసరమైతే నాలుక కోసుకుంటానే కానీ మాట తప్పనని చెప్పిన కేసీఆర్.. సర్వేలను నమ్మి తమకు అన్యాయం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. వారం రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ వివేక్ కాటారంలో జరిగిన సభలో కేసీఆర్ సూచనల మేరకు మంథని అభ్యర్థిగా తనను ప్రకటించారన్నారు. తర్వాత తమకు కనీసం మాటైనా చెప్పకుండా మరొకరిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అవమానించడం కాదా అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జెడ్పీటీసీగా పోటీలో ఉండమని సూచించడం తగునా అని నిలదీశారు. రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.