breaking news
Kamalapuram village
-
నీకు గతంలోనే చెప్పాను.. అయినా వినవా?
కమలాపురం: మండల పరిధిలోని లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్‌పై కమలాపురం ఎస్ఐ మహమ్మద్ రఫీ దాడి చేశారు. వంగబెట్టి వీపుపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ కోల్పోయిన ఆయనను రిమ్స్‌కు తరలించారు. బాధితుడి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ రాపూరి చంద్ర శుక్రవారం ఎటూరు సమీపంలో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న కూలీలను తన ఆటోలో ఎక్కించుకిని వస్తుండగా.. కుందూ వంతెనపై ఉన్న కమలాపురం ఎస్ఐ ఆపాడు. ‘నీకు గతంలోనే చెప్పాను.. కూలీలను ఎక్కించుకొని రావద్దని. అయినా వినవా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి కూలీలను తీసుకు వచ్చావని నెపం పెడుతూ.. జుట్టు పట్టుకొని వంగ బెట్టి వీపుపై పిడి గుద్దులు గుద్దుతూ, వంతెన రక్షణ గోడకు తగిలించి కొట్టడంతో స్పృహ తప్పి పడి పోయాడు. కేవలం నలుగురే ప్రయాణికులు ఉన్నా.. ఎందుకు కొడుతున్నావని ఆటో డ్రైవర్ భార్య ఎస్ఐని ప్రశ్నించగా.. ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏట్లో పడేస్తా అని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన వారు ఏమీ మాట్లాడలేకపోయారు. బాధితుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ శనివారం మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. తనపై గతంలో రెండు సార్లు దాడి చేశాడని, ఇది మూడో సారి అని వాపోయాడు. అసలు తనపై ఎందుకు దాడి చేస్తున్నాడో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికైనా ఈ ఎస్ఐ పై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాగే ప్రవర్తిస్తే పోలీసులకు చెడ్డ పేరు వస్తుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కమలాపురం ఎస్ఐపై తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డిని వివరణ కోరగా విచారణచేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ ప్రవర్తన సరికాదు కమలాపురం అర్బన్ : కమలాపురం ఎస్ఐ మహమ్మద్‌రఫీ ప్రవర్తన సరికాదని ఎమ్మెల్యే పి.రవీంద్రనా«థ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఎస్సై సామాన్య ప్రజలపై ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఆయన ఆక్షేపించారు. రోజురోజుకు ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. సివిల్ పంచాయతీలలో తలదూర్చి దళితుల పట్ల దురుసుగా వ్యవహరించి.. వారిపై చెయ్యి చేసుకోవడంతో గాయపడి ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఇటీవల గంగవరంలో దళిత మహిళ అయిన గంగాదేవిపై చెయ్యి చేసుకోవడంతో మనస్థాపానికి గురై అవమాన భారంతో విషద్రావణం తాగి ఆసుపత్రి పాలైందన్నారు. అయితే టీడీపీ నేతలు ఆ కేసును బలహీన పరచారన్నారు. అలాగే మీరాపరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రామిరెడ్డి ఛాతిపై బూటుకాలతో తన్ని, చిత్ర హింసల పాలు చేశారన్నారు. అంతేకాక శుక్రవారం పట్టణానికి సమీపంలో కుందూ నదీ వద్ద వినాయక నిమజ్జనం చేసేందుకు వచ్చిన లేటపల్లె గ్రామానికి చెందిన దళిత యువకుడి ఆటోను ఆపి.. డ్రైవర్‌ను చితక బాదడంతో తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలడంతో కడప రిమ్స్‌కు తరలించారన్నారు. లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్ర రిమ్స్ ఔట్‌పోస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆ కేసును బలహీన పరిచేందుకు కడప డివిజన్‌కు చెందిన ఒక పోలీసు ఉన్నతాధికారి, టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్‌పై ఎస్సై దాడి చేసిన సంఘటనకు సంబంధించి.. వెంటనే ఎస్సైని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉండగా ఆటో డ్రైవర్ల యూనియన్, వామపక్షాల నేతలు స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఆందోళనకు దిగారు. దీంతో సీఐ కొండారెడ్డి ఆటో యూనియన్ నేతల్ని స్టేషన్‌కు పిలిపించి.. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు. పరామర్శించిన ఎమ్మెల్యే ఎస్సై దాడిలో గాయపడిన లేటపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ చంద్రను ఎమ్మెల్యే పి.రవీంద్రనాధ్‌రెడ్డి కడప రిమ్స్‌కు వెళ్లి పరామర్శించారు. కాగా పోలీసుల సంఘటనతో ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పిచ్చిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కమలాపురం స్టేట్ బ్యాంక్‌లో చోరీ
మండపేట(వరంగల్): గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని ఎస్బీఐలో జరిగింది. వివరాలు.. కమలాపురం గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్లు సీసీ టీవీ పూటేజిల సహాయంతో గుర్తించారు. ఈ చోరీలో నిందితులు లాకర్లు తెరిచే ప్రయత్నం చేయగా వీలుకాకపోవడంతో విరమించుకున్నారు. దీంతో, బ్యాంకులోని 3 సీపీయూలు, 2 మానిటర్లు, 2 ప్రింటర్లను వారు దొంగలించినట్లు అధికారులు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో బ్యాంకులోని లాకర్లలో రూ.93 లక్షలు ఉన్నట్లు వారు తెలిపారు. సోమవారం బ్యాంకు తెరిచిన సమయంలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ పూటేజిల అధారంగా ఇద్దరు నిందితులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్‌టవర్లు, ఫోన్ నంబర్లు సంభాషణల ఆధారంగా వారు ఎవరితో మాట్లాడారో గుర్తించి, నిందితులను పట్టుకుంటాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.