breaking news
K. J. George
-
జార్జ్‌కు మళ్లీ అమాత్యపట్టం
బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య సంఘటనతో మంత్రి పదవిని కోల్పోయిన కే.జే జార్జ్ సోమవారం మళ్లీ అమాత్య పదవిని చేపట్టారు. ఈ కేసులో కే.జే జార్జ్ మొదటి నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో గణపతి ఆత్మహత్య విషయంలో జార్జ్ పాత్ర ఏమీ లేదని సీఐడీ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో కే.జే జార్జ్ గతంలో నిర్వర్తించిన బెంగళూరు నగరాభివృద్ధి శాఖనే సీఎం సిద్ధరామయ్య కేటాయించారు. -
మళ్లీ దద్ధరిల్లిన అసెంబ్లీ
అత్యాచార ఘటనపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహజ్వాల పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటన శాసన సభను రెండో రోజూ కుదిపేసింది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని దులిపేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుల ధాటికి పాలక పక్షం ఆత్మ రక్షణలో పడింది. ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరును హోం మంత్రి కేజే. జార్జ్ వివరిస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వారిని నిలువరించడానికి మంత్రులు టీబీ. జయచంద్ర, కృష్ణ బైరేగౌడ, దినేశ్ గుండూరావు ప్రభృతులు చేసిన ప్రయత్నాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గంటన్నర సేపు సభ హోరెత్తింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపించారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నా, వారికి రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఇంకా సఫలం కాలేదని దెప్పి పొడిచారు. ఇతర బీజేపీ సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. హోం మంత్రి వారి ఆరోపణలను తిప్పి కొడుతూ, తామీ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్ట రీత్యా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం సభ తనకు అధికారాన్ని ధారాదత్తం చేస్తే మీరు చెప్పినట్లే చేస్తానని అన్నారు. బీజేపీ సభ్యుడు కేజీ. బోపయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లయితే ఇన్స్పెక్టర్ ఇప్పటికే జైలుకు వెళ్లాల్సి ఉండేదని అన్నారు. మరో బీజేపీ సభ్యుడు అరవింద లింబావళి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ విబ్‌గ్యార్ స్కూలు సంఘటనను ప్రస్తావించారు. దీనిపై ఇంకా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మీ హయాంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, కేవలం ప్రచారం కోసం మాట్లాడవద్దని హోం మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు. ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదని, చట్ట పరంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధిత యువతి కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సందర్భంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు పలుసార్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. అనంతరం మంత్రి ఈ సంఘటనపై సభలో ప్రకటన చేశారు. దీనిపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.