jayalalithaa passes away
-
అధికార పార్టీలో చీలిక తప్పదా?
-
అధికార పార్టీలో చీలిక తప్పదా?
తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేయరని, అలాంటి పరిస్థితి లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలో చీలిక తప్పదని ఆయన తేల్చిచెప్పారు. ఇక తమిళనాడు ప్రజలు ఆమోదించే స్థాయిలో బీజేపీలో రాష్ట్రస్థాయి నాయకుడు ఇప్పటికిప్పుడు ఎవరూ లేరని కూడా ఆయన అన్నారు. అందువల్ల రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వమే ప్రతిసారీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలని మరో సీనియర్ మంత్రి ప్రశ్నించారు. కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌కు మద్దతు పలకడంతో ఆయనే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం చాలావరకు చెన్నైలోనే ఉన్నారు. అక్కడి పార్టీ నాయకులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక డీఎంకే మాత్రం ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి, అధికారం చేపట్టే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపించడం లేదు. కొంతమంది అధికార, అనధికార ప్రముఖులు ఇంతకుముందే, జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ అవకాశాల గురించి కరుణానిధి, స్టాలిన్ల వద్ద ప్రస్తావించగా, దొడ్డిదారిలో అధికారాన్ని చేపట్టడం అనవసరమని, ఒకవేళ ప్రభుత్వం నిలబడలేని పరిస్థితి వస్తే.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి అప్పుడే విజయం సాధించి ప్రజాక్షేత్రం నుంచే అధికార పగ్గాలు చేపట్టాలని వాళ్లు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడులో సమీప భవిష్యత్తులో మధ్యంతర ఎన్నికలు వస్తాయా, లేక ఇదే ప్రభుత్వం చివరివరకు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే. -
లక్షలాది మందిని ప్రేమగా లాలించారు..!
-
లక్షలాది మందిని ప్రేమగా లాలించారు..!
'అమ్మ' అనేది అతిగొప్ప బిరుదని, జయలలిత నిజంగానే లక్షలాది మందిని ప్రేమగా లాలించే అమ్మగా నిలిచిపోయారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆమెను ప్రేమించే వాళ్లందరికీ దేవుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. తమిళ ప్రజల ఆరాధ్య దైవం అయిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్తను తట్టుకోలేక తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోని ఆమె అభిమానులు గుండె పగిలేలా విలపిస్తున్నారు. 'Amma' is the greatest title, she was truly a loving caring mother for millions. May God provide comfort and strength to all who love her. — YS Jagan Mohan Reddy (@ysjagan) 6 December 2016 -
జీవితం.. మరణం.. అన్నింటిలోనూ రహస్యమే!
చెన్నై: దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనంతలోకాలకు వెళ్లిపోయేవరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలూ అత్యంత రహస్యంగానే ఉన్నాయి. చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు నెలల్లోపే ఆమె మరణించారు. జయలలితను ఆరాధించేవాళ్లు, పూజించేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఆమెను ద్వేషించేవాళ్లు, అసలు పట్టించుకోనివాళ్లు కూడా అంతేమంది ఉండేవారు. 16 ఏళ్ల వయసులోనే స్టార్ స్థాయికి ఎదిగినప్పటి నుంచి ఆమె ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లోనే ఉన్నారు. తాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే తనకు పేరుప్రఖ్యాతులు, సిరి సంపదలు అన్నీ వచ్చాయని ఆమె అంటుంటారు. కానీ, ఆమె జీవితంలో ఎప్పుడూ విషాదఛాయలు మాత్రం కనిపిస్తూనే ఉండవి. మహారాణిలాగే బతికినా కూడా ఆమె ఎప్పుడూ ఒంటరే. చిట్టచివరి వరకు ఆమెలో ఏదో ఒక తెలియని అసంతృప్తి ఉంటూనే ఉండేది. జీవితంలో ఎవరో ఒకరి మీద తప్పనిసరిగా ఆధారపడాల్సిందేనని ఆమె ఓ సందర్భంలో అన్నారు. పురుషాధిక్యం స్పష్టంగా ఉండే ద్రవిడ రాజకీయాల్లో.. ఒక మహిళగా ఆమె నిలదొక్కుకోవడం చిన్న విషయం ఏమీ కాదు. ఈ క్రమంలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ఆమెకు ఎప్పుడూ అండగానే ఉన్నా కూడా.. చాలామంది సీనియర్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనేవారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత ఆమె పరిస్థితి అత్యంత దారుణం. అప్పటినుంచి కక్షలు, కార్పణ్యాలతో కూడిన రాజకీయాల్లో ఎలాగోలా ఆమె నెగ్గుకొచ్చారు. నాలుగేళ్ల తర్వాత 1991లో తొలిసారి సీఎం అయ్యారు. కానీ, ఆమె అనుసరించిన విధానాలేవీ తమిళ ప్రజలకు నచ్చలేదు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. ఆ విషయాలను మాత్రం ఎప్పుడూ ఎవరితోనూ పెద్దగా పంచుకునేవారు కారు. అన్నీ తనలో తానే రహస్యంగా ఉంచుకునేవారు. ఇక సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తొలి రోజు నుంచి.. డిసెంబర్ 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు మరణించేవరకు ప్రతి విషయం అత్యంత రహస్యంగానే ఉండిపోయింది. కేవలం అపోలో ఆస్పత్రి యాజమాన్యం, కొద్దిమంది వైద్య నిపుణులకు తప్ప ఏ విషయాలూ ఎవరికీ తెలియవు. ఎంత పెద్ద వీఐపీ, వీవీఐపీలు వచ్చినా కూడా వాళ్లెవరూ జయలలితను చూసేందుకు వీలుండేది కాదు. కేవలం అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెళ్లిపోవడమే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినా కూడా అమ్మను చూపించలేదు. మధ్యలో ఆమె మాట్లాడుతున్నారని, లేచి కూర్చున్నారని, అన్నం తింటున్నారని, శ్వాస సాధారణ స్థితికి చేరుకుందని.. ఇలా చెబుతూ వచ్చారే తప్ప ఒక్కసారి కూడా ఆమె వీడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టలేదు, కనీసం కెమెరాల ద్వారా అయినా ఆమెను ప్రజలకు చూపించలేదు. ఆస్పత్రిలో ఆమె పక్కన కేవలం ఒక్క శశికళ మాత్రమే ఉన్నారు. జీవితంలోను, మరణంతోను పోరాటమే జయలలిత జీవితం మొత్తం పోరాటాల మయం. చివరకు మృత్యువుతో కూడా చిట్ట చివరి నిమిషం వరకు ఆమె పోరాడుతూనే ఉన్నారు. స్కూలు బోర్డు పరీక్షలలో టాపర్‌గా నిలిచిన తర్వాత తాను లాయర్ కావాలని ఎంతగానో అనుకున్నారు గానీ, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లి బలవంతం మీద సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. తారాపథానికి వెళ్లినా ఏనాడూ వాణిజ్య ప్రకటనల జోలికి వెళ్లలేదు, ఎవరినీ రానివ్వలేదు. ఆస్తుల మీద కేసుల విషయంలో కోర్టులో పోరాడాల్సి వచ్చింది. చివరగా సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆమె చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అప్పటికి ఆమెకు మధుమేహం తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. క్రమంగా అవయవాలు సహకరించలేదు. అయినా పోరాడారు. అన్నాళ్లుగా పోరాడిన గుండె చిట్టచివరి క్షణాల్లో ఒక్కసారిగా ఆగిపోయింది. దాన్నే వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అన్నారు. అయినా, ఆమె తరఫున వైద్యులు పోరాడారు. 'ఎక్మో' అనే పరికరాన్ని అమర్చి, మరికొన్ని గంటల పాటు ప్రాణాలు నిలబెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు మృత్యువు చేతిలో ఓటమి తప్పలేదు. -
జయలలిత కన్నుమూత
తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చితలైవి జె.జయలలిత (68) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి సోమవారం వరకు ఆమె ఆరోగ్యం పలు రకాలుగా మారుతూ వచ్చింది. ఒక సమయంలో పూర్తి అచేతనంగా మారిన జయలలిత, మధ్యలో లేచి కూర్చున్నారని, అన్నం తిన్నారని, కాలర్ మైకు సాయంతో కొద్దిసేపు మాట్లాడారని కూడా చెప్పారు. ఇక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి పంపేస్తామని కూడా తెలిపారు. అయితే, ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో ఒక్కసారిగా అన్నివర్గాల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొంది. సోమవారం ఉదయం కూడా జయలలితకు గుండె ఆపరేషన్ చేసి, వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 1948 ఫిబ్రవరి 24వ తేదీన నాటి మైసూరు రాష్ట్రంలోని మేలుకోటే ప్రాంతంలో జయరాం, వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించారు. ఆమె అసలుపేరు కోమలవల్లి. తర్వాత స్కూల్లో రెండో తరగతిలో చేర్చినప్పుడు జయలలిత అనే పేరు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తన తల్లి బలవంతంతో 15వ యేట సినిమా రంగంలో ప్రవేశించారు. ఆమె నటించిన తొలి సినిమా చిన్నడ గొంబె (కన్నడ) పెద్ద హిట్టయ్యింది. తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను సినీరంగంలో పెద్దస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన జయలలిత.. రాచమంద్రన్ మరణానంతరం పెద్దస్థాయికి ఎదిగారు. 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా నిలిచారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సాధించారు. ఐదేళ్లు పూర్తి పదవీకాలంలో ఉన్నా.. 2006 మేలో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూశారు. ఆమె పార్టికి కేవలం నాలుగు స్థానాలే దక్కాయి. తర్వాత మళ్లీ ఫీనిక్స్ పక్షిలా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మధ్యలో ఒకసారి అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తన అనుంగు అనుచరుడు పన్నీరుసెల్వంకు పదవి అప్పజెప్పినా, మళ్లీ సుప్రీంకోర్టు ఊరటనివ్వడంతో పదవి చేపట్టారు. గుండె పగిలిన తమిళనాడు తాము ఎంతగానో ఆరాధించే 'అమ్మ' ఇక లేరని తెలిసి ఒక్కసారిగా తమిళుల గుండె పగిలింది. ఆదివారం సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో ఆస్పత్రివద్దకు చేరుకున్న అభిమానులు అమ్మకు ఏమైందోనని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు. ఇక విషయం తెలిసిన తర్వాత వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. సామాన్య ప్రజల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ విలపిస్తున్నారు.