breaking news
Jawaharlal Nehru University Students
-
జేఎన్‌యూలో పట్టు నిలబెట్టుకున్న వామపక్షం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్షాలు మరోమారు సత్తా చాటాయి. కీలకమైన నాలుగు పదవులకు గాను మూడింటిని కైవసం చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీకి తొమ్మిదేళ్ల తర్వాత జాయింట్ సెక్రటరీ పోస్టు దక్కించుకోగలిగింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం ప్రకటించిన ఫలితాల్లో ప్రెసిడెంట్ పదవిని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు చెందిన నితీశ్ కుమార్ గెలుచుకున్నారు. ఈయనకు 1,702 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన శిఖా స్వరాజ్‌కు 1,430 ఓట్లు దక్కాయి. ఎస్ఎఫ్ఐకి చెందిన తయ్యబా అహ్మద్ 918 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. వైస్ ప్రెసిడెంట్‌గా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్(డీఎస్ఎఫ్)బలపరిచిన మనీ షా 1,150 ఓట్లతో విజయం సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 1,116 ఓట్లు దక్కాయి. జనరల్ సెక్రటరీ పదవిని గెలుచుకున్న డీఎస్‌ఎఫ్‌కు చెందిన ముంతేహా ఫతిమాకు 1,520 ఓట్లు రాగా ప్రత్యర్థి, ఏబీవీపీకి చెందిన కునాల్ రాయ్‌కి 1,406 ఓట్లొచ్చాయి. అదేవిధంగా, ఏబీవీపీ అభ్యర్థి వైభవ్ మీనా 1,518 ఓట్లతో జాయింట్ సెక్రటరీ పదవిని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి ఏఐఎస్ఏకు చెందిన నరేశ్ కుమార్‌కు 1,433 ఓట్లు, ప్రోగ్రెసివ్ స్టూడెంట్ అసోసియేషన్(పీఎస్ఏ) అభ్యర్థి నిగమ్ కుమారికి 1,256 ఓట్లు పడ్డాయి.2015–16 తర్వాతచిట్టచివరిసారిగా 2015–16 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి సౌరవ్ శర్మ జాయింట్ సెక్రటరీగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ పదవి దక్కడం ఇదే మొదటిసారి. అదేవిధంగా, 2000–01 ఎన్నికల్లో ఏబీవీపీకి చెందిన సందీప్ మహాపాత్ర జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఏబీవీపీ ఆ పదవిని ఇప్పటి వరకు గెలుచుకోలేకపోయింది. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఫీజుల పెంపును నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టారు. జేఎన్‌యూ నుంచి విద్యార్థుల నిరసనర్యాలీ మొదలైంది. దగ్గర్లోని ఏఐసీటీఈ ఆడిటోరియంకు సమీపానికి రాగానే పోలీసులు వారిని నిలువరించారు. ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతున్నపుడు బయట విద్యార్థుల ఆందోళన కొనసాగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవం తర్వాత వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆడిటోరియం ప్రాంతాన్ని విద్యార్థులు చుట్టుముట్టడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ దాదాపు ఆరు గంటలపాటు ఆడిటోరియంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల అభ్యంతరాలు, డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
విద్యార్థి ఎన్నికల్లో ఓ అమ్మ.. ఓ స్వలింగ సంపర్కుడు.. ఓ కజకిస్థానీ!
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో ఎన్నికలంటేనే దేశవ్యాప్తంగా ఓ ఆసక్తి కలగడం సహజం. అయితే ఈసారి జేఎన్ యూ లో ఎన్నికలు మరో విధంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో పలు పార్టీలు విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే జేఎన్ యూ ఎన్నికల్లో గే (స్వలింగ సంపర్కుడు), ఓ తల్లి, కజకిస్థాన్ కు చెందిన అభ్యర్థులు నేను సైతం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓ పాపకు తల్లైన గుంజన్ ప్రియ జేఎన్ యూ లో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పార్టీ తరపున కౌన్సిలర్ గా ప్రచారం చేస్తోంది. అయితే గుంజన్ కూతురు కూడా జేఎన్ యూ క్యాంపస్ లో తన తల్లికి ఓటు చేయాలని ప్రచారం చేయడం అందర్ని ఆకట్టుకుంటోంది. 'తాను వివాహితురాలిని. లింగ సమానత్వం కోసం పోరాడుతాను. వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి' అనే డిమాండ్ తో గుంజన్ ముందుకెళ్తోంది. ఇక ఎస్ఎఫ్ఐ బ్యానర్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీ తరపున గౌరవ్ ఘోష్ రంగంలో నిలువడం ప్రత్యేకతగా నిలిచింది. ఎల్ జీ బీటి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకు జేఎన్ యూ లో సమాన హోదా కల్పించాలి. మా కమ్యూనిటీలోని సభ్యులపై వివక్ష కు అంతం పలికి, సమానత్వం కల్పించాలని గౌరవ్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక జేఎన్ యూ ఎన్నికల్లో విదేశీ విద్యార్థి కూడా అధ్యక్ష పదవికి పోటి పడుతూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాడు. కజకిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సహాయంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మాజీ సైనికుడైన ఝాస్సులాన్ కు యుద్దంలో పాల్గొన్నందుకు పలు పతకాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.ఝాస్సులాన్ ప్రస్తుతం జేఎన్ యూలో ఎకనామిక్స్ లో స్నాతకోత్సవ విద్యను అభ్యసిస్తున్నాడు. ఝాస్సులాన్ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) తరపున బరిలో ఉన్నారు. జేఎన్ యూలో విదేశీ విద్యార్థులకు ఇబ్బందులున్నాయని.. భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని.. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని తన ఎజెండాగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. అనేక విశేషాలతో కొనసాగుతున్న ప్రచారం సెప్టెంబర్ 13 తేదిన జరిగే ఎన్నికలతో ముగియనుంది.